ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం..
గత ఏడాది అండర్-17 ప్రపంచకప్ ఆడిన భారత జట్టులో ఎనిమిది మంది మణిపూర్‌కు చెందిన వాళ్లే.. మిగతా వాళ్లలో కొందరు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వాళ్లు. ఇంకొందరు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. వీళ్లలో చాలామందిది.. ముఖ్యంగా మణిపూర్ కుర్రాళ్లది అతి సామాన్య నేపథ్యం. జట్టు సారథి అయిన అమర్జీత్ సింగ్ ఒక రైతు కొడుకు. కొలంబియాపై హెడర్ గోల్‌తో సంచలనం సృష్టించిన జీక్సన్ సింగ్ తల్లి చేపలు అమ్ముతుంది. నంగ్దంబా తల్లి అంగన్వాడీ కార్మికురాలు. ఇలా దాదాపుగా అందరినీ పేద, మధ్య తరగతి నేపథ్యమే. వీరికి ఇప్పటికీ ఇంగ్లిష్ మాట్లాడటం రాదు. కానీ వాళ్లలో ప్రతిభకు మాత్రం లోటు లేదు. ఆతిథ్య హోదాలో అండర్-17 ప్రపంచకప్‌లో ఆడిన భారత జట్టు ఓ మోస్తరు ప్రదర్శన చేసింది. కొలంబియా లాంటి ప్రపంచ స్థాయి జట్టు చేతిలో 1-2 తేడాతో ఓడటం గొప్ప ఘనతే. ఆ మ్యాచ్‌లో భారత్ గోల్ కూడా సాధించింది. ఈ ప్రదర్శన మన కుర్రాళ్లలో ప్రతిభకు లోటేమీ లేదని చాటిచెప్పింది. అండర్-17 జట్టు ఈ మాత్రం ప్రదర్శన చేయగలిగిందంటే.. దాని వెనుక కొన్నేళ్ల కృషి, ప్రణాళిక ఉన్నాయి. ప్రపంచకప్ ఆడే అవకాశాన్ని తేలిగ్గా తీసుకోకుండా భారత జట్టుపై గత కొన్నేళ్లలో రూ.30 కోట్లు ఖర్చు పెట్టింది భారత ఫుట్‌బాల్ సమాఖ్య. ప్రపంచకప్ జట్టు దాదాపు 20 దేశాలు తిరిగి, 100కు పైగా మ్యాచ్‌లు ఆడింది. ప్రపంచ స్థాయి కోచ్, సహాయ సిబ్బంది నేతృత్వంలో ఆటగాళ్లు శ్రమించారు. కఠిన సాధన చేశారు. దీని వల్లే భారత్ ప్రపంచకప్‌లో మరీ పేలవ ప్రదర్శన చేయకుండా బయటపడింది. అండర్-17 ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చే క్రమంలో దేశంలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఫుట్‌బాల్ స్టేడియాల్ని తీర్చిదిద్దారు. మౌలిక సదుపాయాల్ని మెరుగుపరిచారు. యువ ఆటగాళ్లకూ పలు దేశాల్లో పర్యటించే, పేరున్న జట్లతో ఆడే అవకాశం లభించింది. మరోవైపు ఐఎస్ఎల్ రాకతోనూ భారత ఫుట్‌బాల్‌లో కదలిక వచ్చింది. సీనియర్ ఆటగాళ్లు ప్రపంచ స్థాయి ఫుట్బాలర్లతో కలిసి ఆడే అవకాశం దక్కింది. ఈ క్రమంలోనే అండర్-17 ప్రపంచకప్ ఆడిన కుర్రాళ్లు క్రమంగా మెరుగవుతూ వచ్చారు. తాజాగా ఇప్పుడు ఆ కుర్రాళ్లే అండర్-20 జట్టు తరఫున సత్తా చాటుతున్నారు. వీరిలో చాలామంది ఐ లీగ్, ఐఎస్ఎల్ లాంటి టోర్నీల్లో మరింత అనుభవం సంపాదించారు. ప్రపంచకప్ తర్వాత కూడా కుర్రాళ్లు ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కొటీఫ్ టోర్నీ ఆడింది. రెండు వరుస ఓటములు చవిచూసినా.. తర్వాత పుంజుకుంది. ముందుగా వెనెజువెలాతో మ్యాచ్‌ను డ్రా చేసుకుని ఆశ్చర్యపరిచింది. తర్వాత అర్జెంటీనా లాంటి మేటి జట్టును మట్టి కరిపించి పెద్ద షాకే ఇచ్చింది. అర్జెంటీనా అంటే మామూలు జట్టు కాదు. అండర్-20 ప్రపంచకప్‌ను అత్యధికంగా ఆరు సార్లు గెలిచిన దేశం అదే. సీనియర్ స్థాయిలో కొంచెం బలహీన పడ్డా.. జూనియర్ జట్టు మాత్రం బలంగానే ఉంది. వారి ప్రమాణాలతో పోలిస్తే భారత జట్టు ఎక్కడో ఉంటుంది. అలాంటి జట్టుకు భార కుర్రాళ్లు షాకిచ్చారు.
|
చేయాల్సింది చాలా ఉంది..

ఒకప్పుడు భారత ఫుట్‌బాల్ ఒక సారవంతమైన భూమిలా ఉండేది. అందులోంచి గొప్ప ఫలాలు వచ్చాయి. నిర్వహణ లోపంతోనే అది బీడువారింది. దాన్ని మళ్లీ సారవంతంగా మార్చడానికి ఇప్పుడు కొంచెం సానుకూల వాతావరణం ఏర్పడింది. ఐఎస్ఎల్ కొన్నేళ్ల నుంచే కొనసాగుతున్నా అండర్-17 ప్రపంచకప్‌తో వచ్చిన ఊపే వేరు. ఈ టోర్నీ వల్ల భారత ఫుట్‌బాల్‌కు చాలా మంచే జరిగింది. మౌలిక వసతులు మెరుగయ్యాయి. కుర్రాళ్లకు ప్రపంచ దేశాల్లో పర్యటించే అవకాశం దక్కింది. ప్రపంచ స్థాయి శిక్షణా అందింది. కొన్నేళ్ల పాటు సాగిన ఈ ప్రయత్నానికి ఇప్పుడు ఫలితాలు కనిపిస్తున్నాయి. అండర్-20లోనే కాదు అండర్-16 స్థాయిలోనూ ఇటీవల భారత కుర్రాళ్లు అదరగొట్టారు. ఇరాక్, యెమెన్ జట్లపై ఘనవిజయాలు సాధించారు. ఈ ప్రదర్శన భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించేదే. కానీ సీనియర్ స్థాయిలో ప్రపంచకప్ ఆడే స్థాయికి భారత్ రావాలంటే చాలా సమయమే పడుతుంది. రాబోయే పదేళ్ల సంగతి పక్కన పెట్టేసి ఆ తర్వాత జరగబోయే ప్రపంచకప్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రణాళికా బద్ధంగా అడుగులేయడమే ఇప్పుడు కావాల్సింది. పాఠశాల స్థాయిలోనే ప్రతిభావంతుల్ని గుర్తించాలి. వారికి ప్రపంచ స్థాయి శిక్షణ ఇవ్వాలి. ఫుట్‌బాల్‌లో నైపుణ్యం ఒకెత్తయితే, ఫిట్నెస్ మరో ఎత్తు. మిగతా క్రీడలన్నింటికంటే మించి శారీరక ధారుడ్యం అవసరం. అన్ని క్రీడలకూ సన్నద్ధమైనట్లు దీనికి సన్నద్ధమైతే కుదరదు. ప్రణాళికా బద్ధంగా సాధన సాగాలి. ఇందుకోసం దేశవ్యాప్తంగా అకాడమీలు ఏర్పాటు కావాలి. ప్రపంచ స్థాయి శిక్షకుల్ని తేవాలి. ఫుట్‌బాల్ ప్రపంచంలో మనమెక్కడున్నామో, మనకు మిగతా జట్లకు ఉన్న అంతరమేంటో గుర్తించి.. ఆ అంతరాన్ని పూడ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలి. ఐఎస్ఎల్ లాంటి లీగ్ భాగస్వామ్యంతో ఆటగాళ్లకు ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం కల్పించాలి. ఇదంతా ఏళ్ల తరబడి క్రమ పద్ధతిలో జరిగితే భవిష్యత్తులో కచ్చితంగా ఫలితాలుంటాయి. అప్పుడు ఫిఫా ప్రపంచకప్‌లో భారత్‌ను చూడటం కష్టమేమీ కాదు.
|