close

వార్తలు / కథనాలు

అబ్బో బేర్‌ గ్రిల్స్‌.. గట్టి పిండమే..!

17వేల అడుగుల ఎత్తు నుంచి పడి బతికిన సాహసికుడు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: పచ్చి మాంసమే ఆహారం.. అడవిలో దొరికే కీటకాలే ఫలహారం.. మురికి నీరే ప్రాణాధారం.. అడవి పుల్లలతో పందిరే నీడ.. గడ్డితో చేసిన పరుపుపై నిద్ర.. ఇవన్నీ చదివితే గుర్తొచ్చే పేరు బేర్‌ గ్రిల్స్‌. 17,000 అడుగుల ఎత్తు నుంచి పడిపోయి బతికి బట్టకట్టిన గట్టి పిండం. ఆయన జీవితంలో పాము కాట్లకు కొదవే లేదు. ఎటువంటి ప్రమాదం నుంచైనా గ్రిల్స్‌ సురక్షితంగా బయటపడగలడని ఆయన అభిమానులు బలంగా నమ్ముతారు. అదీ బేర్‌ గ్రిల్స్‌ సత్తా..!

డిస్కవరీ ఛానల్‌లో గ్రిల్స్‌ నిర్వహించే ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’కు పాపులారిటీ అంతా ఇంతా కాదు. కేవలం బేర్‌ గ్రిల్స్‌ కోసమే ఈ షో చూసే వారున్నారంటే అతిశయోక్తి కాదు. సాహసికుడు బేర్‌ గ్రిల్స్‌తో కలసి ప్రధాని నరేంద్ర మోదీ ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ కార్యక్రమంలో పాల్గొన్నారని డిస్కవరీ ఛానల్‌ పేర్కొంది. ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌లో దీన్ని చిత్రీకరించామని తెలిపింది. అది ‘సూటిగా, యథేచ్ఛగా సాగిన ప్రయాణం’ అని వివరించింది. వన్యప్రాణి సంరక్షణను ఇది ప్రస్తావిస్తుందని పేర్కొంది. ఈ కార్యక్రమం ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాల్లో డిస్కవరీ నెట్క్‌వర్క్‌పై ప్రసారం కానుంది. బేర్‌గ్రిల్స్‌ కేవలం టీవీ షోలోనే కాదు.. నిజ జీవితంలో కూడా పోరాట యోధుడు. 

అక్క పెట్టిన పేరుతో అదృష్టం..

బేర్‌ ఒక సైనిక కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి బ్రిటన్‌లో ఎంపీగా కూడా విధులు నిర్వహించారు. బేర్‌ గ్రిల్స్‌ అసలు పేరు ఎడ్వర్డ్‌ మైఖెల్‌ గ్రిల్స్‌. కానీ, పుట్టిన వారం తర్వాత ‘బేర్‌’ అని అతని సోదరి ముద్దుపేరు పెట్టింది. ఇప్పుడు ఆ పేరుతోనే ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితుడయ్యాడు. 
బేర్‌గ్రిల్స్‌ తండ్రి సర్‌ మైఖెల్‌ గ్రిల్స్‌ రాయల్‌  మెరైన్‌ ఫోర్స్‌లో పనిచేశారు. బ్రిటన్‌లో ఎంపీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. బహిరంగ ధూమపానంపై నిషేధం, బొగ్గు గనుల మూసివేతకు ఆయన విశేష కృషి చేశారు. కానీ, మహమ్మద్‌ అల్‌ ఫాయిద్‌ అనే వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకొని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినట్లు ఆరోపణలు కూడా ఎదుర్కొన్నాడు. 

వేధింపులు తట్టుకోవడానికి కరాటే.. 

పాఠశాలలో చదువుతున్నప్పుడు బేర్‌ను తోటి విద్యార్థులు వేధించేవారు. దీంతో అక్కడే ఉండే యువతులతో పాటు ఆత్మరక్షణకు కరాటే శిక్షణలో చేరాడు. అతనితోపాటు శిక్షణలో చేరిన యువతులు మానేసినా తాను మాత్రం పట్టువీడలేదు. ఫలితంగా మూడేళ్లకే బ్లాక్‌బెల్ట్‌ నడుముపైకి చేరింది. ఇంతకీ గ్రిల్స్‌ కరాటే నేర్చుకుంది ఎక్కడో తెలుసా.. ప్రపంచ వ్యాప్తంగా సుప్రసిద్ధుడైన సెన్సీ యహార వద్ద. ఈ విషయాన్ని గ్రిల్స్‌ తాను  రాసిన ‘మడ్‌, స్వెట్‌, అండ్‌ టియర్స్‌’లో వెల్లడించాడు. నాడు నేర్చుకొన్న కరాటే శిక్షణ ఆయనకు నిత్య జీవితంలో బాగా ఉపయోగపడుతోంది. 

పాఠశాల నుంచి హిమాలయాలకు..

పాఠశాల చదువు అనంతరం బేర్‌గ్రిల్స్‌ తొలిసారి హిమాలయాల్లో సాహస యాత్ర నిర్వహించారు. కొన్ని నెలల పాటు ఆయన భారత్‌లోనే ఉన్నారు. పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా, డార్జిలింగ్‌లో గడిపారు. ఒక దశలో భారత సైన్యంలో చేరదామని అనుకున్నారు. కానీ, చివరకి బ్రిటన్‌ స్పెషల్‌ ఎయిర్‌ సర్వీస్‌ (ఎస్‌ఏఎస్‌)లో చేరారు. మూడేళ్లపాటు అత్యంత కఠినమైన శిక్షణను పూర్తి చేసుకొన్నారు. అనంతరం ఉత్తరాఫ్రికా దేశాల్లో సేవలు అందించారు. 

పారాచూట్‌ పనిచేయకపోయినా..
అఫ్రికాలో రెండో సారి విధుల్లో చేరిన బేర్‌గ్రిల్స్‌ మృత్యు ముఖం వద్దకు వెళ్లొచ్చారు. ఆ సమయంలో ఆఫ్రికాలో 17,000 అడుగుల ఎత్తు నుంచి భూమిపైకి దూకే క్రమంలో ఆయన పారాచూట్‌ పనిచేయలేదు. కానీ, అదృష్టవశాత్తు వెన్నెముక గాయంతో బయటపడ్డాడు. ఆ తర్వాత 18నెలల పాటు ఒంటిపై కట్లు ఉన్నాయి. తిరిగి నడవగలడని ఎవరూ అనుకోలేదు. కానీ, ఆయన కోలుకొన్నారు.  ఈ గాయం తర్వాతే బేర్‌గ్రిల్స్‌ ఎవరెస్టు యాత్రను పూర్తి చేశాడంటే అతని సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అప్పటికీ గ్రిల్స్‌ వయస్సు 23 ఏళ్లే కావడం ఒక రికార్డు. ఈ యత్రలో ఒక సారి తాను అధిరోహించే మంచు ఫలకం పగిలి గాల్లో వేలాడాడు. అప్పుడు ఆయన్ను సహచరుడు మైక్‌తో పాటు ఇద్దరు నేపాలీలు కలిసి కాపాడారు. 

ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో డిన్నర్‌ పార్టీ

ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో డిన్నర్‌ పార్టీ చేసుకున్న వ్యక్తుల్లో బేర్‌ ఒకరు. ఒక హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లో 24,262 అడుగుల ఎత్తుకు చేరుకొని అక్కడి ఒక టేబుల్‌ను కిందకు వేలాడదీసి త్రీకోర్స్‌ మీల్‌ను తిన్నాడు.  అప్పుడు అక్కడ ఉష్ణోగ్రత -50 డిగ్రీలు కావడం విశేషం. 

వివాదాల సుడిలో..
వివాదాలకు బేర్‌ అతీతుడేమీ కాదు. 2008లో ఆయనపై అమెరికా సర్వైవల్‌ కన్సల్టెంట్‌ మార్క్‌ వెన్రెట్‌ విమర్శలు చేశారు. ముందే చేసిన పరికరాలను చివర్లో మొక్కుబడిగా అమర్చి బేర్‌ పేరు సంపాదించుకొంటున్నాడని పేర్కొన్నారు. ఆయన షోలు మొత్తం తప్పుడని ఆరోపించాడు. సియార్ర నెవడా ఎపిసోడ్‌ సందర్భంగా ప్రతి రాత్రి బేర్‌ విలాసవంతమైన హోటళ్లలో టీవీ, హాట్‌ టబ్‌, ఇంటర్నెట్‌తో జీవించాడని పేర్కొన్నాడు. దీనికి ఒక సందర్భంలో బేర్‌సమాధనం ఇస్తూ.. చిత్రీకరణ నిబందనల్లో భాగంగా రాత్రికి బేస్‌క్యాంప్‌కు వెళ్లాల్సిందేనని తెలిపారు. ఇదంతా ఒక ఎత్తయితే.. వేల్స్‌ తీరంలో ఒక నిర్మానుష్య ద్వీపంలో బేర్‌ కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు

చైనాలో భారీ ఫ్యాన్స్‌..

బేర్‌కు చైనాలో భారీగా ఫ్యాన్‌ఫాలోయింగ్‌ ఉంది. 2012లో ఆయన రాసిన ‘మడ్‌, స్వెట్‌ అండ్‌ టియర్స్‌’ పుస్తకం అత్యధికంగా అమ్ముడుపోయింది. దీంతో 2015లో సర్వైవర్‌ గేమ్స్‌ పేరుతో చైనాలో ఒక టీవీషో చేశారు. 2017లో చైనా సెలబ్రిటీలైన ఎన్‌బీఏ స్టార్‌ యో మింగ్‌, సంపన్న టెకీ రాబిన్‌ లీతో కలిసి వేర్వురుగా సాహసకార్యక్రమాలు చేశారు. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ‘రన్నింగ్‌ విత్‌ బేర్‌గ్రిల్స్‌’ టీవీ షో చేశారు. దీనిని తన అధ్యక్షపాలనలో మిగిలిన తీపి గుర్తుగా ఒబామా ఒక సందర్భంగా వెల్లడించారు. తాజాగా ఇప్పుడు బేర్‌ మన ప్రధాని మోదీతో కలిసి టీవీషో చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు