Wed, February 10, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఈ హనుమంతుడు మృత్యుంజయుడు!''విద్యా విలీనం''ఆ నాటి హామీలను నెరవేర్చండి''తెరాస గూటికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే''కాల్పుల్లో అనూహ్య మలుపు''ఉగ్ర మూలం ఐఎస్‌ఐ''వెనక్కు పంపాం.. బహిష్కరణ కాదు''సుశీల్‌ కొయిరాలా కన్నుమూత''వెళ్లిరా నేస్తమా...''రాజ్యాంగం పవిత్రతను కాపాడాలి'
పొట్టకొట్టిన కరవు
పొట్ట దశలో ఎండిపోతున్న వరి
అడుగంటిన జలాశయాలూ.. ఆశలూ
సరైన వానల్లేక ఖరీఫ్‌లో అరకొరగా సాగు
ఆ పంటలకూ చివరిదశలో అందని నీరు
ఎండుతున్న పంటలతో అన్నదాతలు ఆందోళన
వానల్లేక తెలంగాణలో కరవు ఛాయలు
బాధతో పంటకు నిప్పు పెడుతున్న రైతన్నలు
తొలకరికి పులకరించిన రైతన్న ఆశగా పంటల సాగుకు సన్నద్ధమయ్యాడు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చాడు. కానీ ఖరీఫ్‌ కాటేసింది. అన్నదాతను ప్రకృతి కరుణించలేదు. వరుణుడు ముఖం చాటేశాడు.. బోర్లు, జలాశయాలూ అడుగంటాయి. అయినా పట్టువదలకుండా రైతన్న ఎంతో కష్టంపై పంటను కాపాడుకుంటూ వచ్చాడు. అప్పు చేసి మరీ పెట్టుబడులు పెట్టినా పంట చేతికొచ్చే దశలో ఇప్పుడు నీరందడంలేదు. ముఖ్యంగా వరి పొట్ట దశలో ఎండిపోతోంది. కళ్లముందే చేను ఎండుతుండడంతో దిక్కుతోచని కర్షకులు ప్రాణంలా కాపాడుకున్న పంటకు తమ చేతులతోనే నిప్పు పెడుతున్నారు.. కరవు పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో తాజా పరిస్థితిపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనం..
అప్పుల చి‘వరి’కి మిగిలింది గుండె కోతే!
అన్నదాతపై ప్రకృతి పగపట్టింది.. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు చేతికొచ్చే దశలో ఎండిపోతుండడంతో కర్షకులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఖరీఫ్‌ పంటలు చివరిదశలో ఎండిపోగా.. కనీసం రబీ పంటలైనా సాగు చేద్దామంటే జలాశయాల్లో నీటి జాడ లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌లో కురిసిన తొలకరి వర్షాలకు వరి పంట సాగుచేసిన రైతులకు ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో సాగు కష్టాల కొలిమిలా తయారైంది. వ్యవసాయం చేయకపోతే రూ.10 నష్టం.. చేస్తే రూ.20 నష్టం.. అన్న చందంగా మారింది అన్నదాత పరిస్థితి. ఈ ఏడాది తెలంగాణలోని ప్రధాన జలాశయాలకు నీరు రాలేదు. అయినా వర్షాలు కురుస్తాయన్న ఆశతో అరకొర ఆయకట్టులోనే రైతులు ఖరీఫ్‌ పంటలు వేశారు. వాటిని రక్షించుకునేందుకు గత 3 నెలలుగా వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టినా చివరకు అప్పులు మిగిలాయే తప్ప పంట మాత్రం దక్కే పరిస్థితి కానరావడం లేదు. వర్షాలు లేకపోవడం, ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్ల కింద సాగు చేసిన పంటలూ పొట్ట దశలో ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితిని తట్టుకోలేని రైతన్నలు కడుపు మంటతో వరిపైరును కాల్చేస్తున్నారు. మరికొందరు పశువులను మేపుతున్నారు. ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు పైర్లను ‘ఈనాడు’ యంత్రాంగం ప్రత్యక్షంగా పరిశీలించి రైతులను పలకరిస్తే వారి వేదన వర్ణనాతీతంగా ఉంది.
ఎంత తవ్వినా.. నీరు రాదాయె..
రీంనగర్‌ జిల్లాలో 33 మండలాల్లోని 1.57 లక్షల హెక్టార్లు శ్రీరాంసాగర్‌ ఆయకట్టు పరిధిలో ఉంది. ఎస్సారెస్పీలో నీరు చేరకపోవడంతో వరసగా రెండో ఏడాది ఆయకట్టుకు సాగు నీరు అందలేదు. రైతులు బోర్లు, బావుల ఆధారంగా కేవలం 50 వేల హెక్టార్లలోనే వరి వేశారు. వర్షాభావం, ఎండల ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో బోర్లు మరింత లోతుకు తవ్వేందుకు రైతులు రూ.లక్షలు వెచ్చించారు. అయినా చివరి దశకు వచ్చిన పంటకు నీళ్లు చాలట్లేదు. పలు ప్రాంతాల్లో వరిని అలాగే వదిలేస్తున్నారు. బాధ భరించలేక పంటను తగలబెడుతున్నారు.
తొమ్మిది బోర్లు వేసినా..
మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌కు చెందిన రాజేశ్‌కు 11 ఎకరాలుండగా తొమ్మిదెకరాల్లో వరి, రెండెకరాల్లో మొక్కజొన్న, పసుపు సాగు చేశాడు. గతంలోనే ఐదు బోర్లు వేశాడు. వర్షాభావం, భూగర్భజలాలు అడుగంటిపోవడంతో రూ.1.45 లక్షలు వెచ్చించి తొమ్మిది బోర్లు వేశాడు. ఒక్క బోరు నుంచి కూడా నీరు రాలేదు. ఎండిపోతున్న పంటను కాపాడుకునేందుకు రూ.60 వేలు ఖర్చు పెట్టి ట్రాక్టర్‌ డైనమో కొనుగోలు చేశాడు. నెల రోజులుగా విద్యుత్తు సరఫరా లేని సమయంలో ట్రాక్టర్‌ డైనమో ద్వారా బోర్లలోని కొద్దిపాటి నీటిని తోడి వరి పొలానికి అందిస్తున్నాడు. రోజూ డీజిల్‌కు రూ.1000 వరకు ఖర్చవుతోంది. ఇంత కష్టపడుతున్నా పెట్టిన పెట్టుబడి తిరిగొచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
- రాజేశ్‌, జగ్గాసాగర్‌
కాలువపై నమ్మకంతో పంటవేసి నష్టపోయా..
ముత్తారం మండలం బుధవారంపేటకు చెందిన బావు రాయమల్లు తనకున్న మూడెకరాలతో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని పంట సాగు చేశాడు. కౌలుకు తీసుకున్న రెండెకరాలు పూర్తిగా ఎండిపోయింది. కౌలు, పెట్టుబడి కలిపి రూ.65 వేలు దాటాయి. ఎల్లంపల్లిలో నీటిని ఎస్సారెస్పీ కాలువలోకి వదులుతారనే నమ్మకంతో పంట వేసి నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 
- బావు రాయమల్లు, బుధవారంపేట, కరీంనగర్‌ జిల్లా
నీరు లేక.. సాగు సాగక..
మెతుకు సీమగా పేరుగాంచిన మెదక్‌ జిల్లాలో భారీ సాగునీటి ప్రాజెక్టులు లేవు. మెదక్‌ నియోజకవర్గ పరిధిలోని మధ్యతరహా ప్రాజెక్టు ఘనపురం ఆనకట్ట ఆధారంగానే అంతో ఇంతో సాగయ్యేది. కానీ, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీరు అడుగంటడంతో ఖరీఫ్‌లో ఒక్క ఎకరానికీ నీరందించలేకపోయారు. ఈ ఆనకట్ట నిల్వ సామర్థ్యం 0.2 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం పూర్తిగా ఎండిపోయింది. దీని కింద మెదక్‌, పాపన్నపేట, కొల్చారం మండలాల్లో 23 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఖరీఫ్‌లో బోర్ల ఆధారంగా రైతులు సాగుకు ఉపక్రమించారు. దాదాపు 1500 ఎకరాల్లో వరి వేశారు. ఆ బోర్లలోనూ ప్రస్తుతం నీరు తగ్గిపోవడంతో రబీలో ఆరుతడి పంటలు మినహా మిగతా ఒక్క ఎకరా కూడా సాగు చేసే పరిస్థితి లేదు. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని నల్లవాగు ప్రాజెక్టు ద్వారా 5,330 ఎకరాల వరకు సాగయ్యేది. వర్షాభావంతో పాటు కాలువలు ధ్వంసం కావడంతో గత ఖరీఫ్‌లో ఒక్క ఎకరాకు కూడా నీరందలేదు. వెల్దుర్తి మండలంలోని హల్దీ ప్రాజెక్టు కింద సుమారు 400 ఎకరాల్లో సాగయ్యేది. ఇక్కడా ఇదే పరిస్థితి. భారీసాగునీటి ప్రాజెక్టులు లేకపోగా, ఉన్న చిన్న చిన్న ప్రాజెక్టుల్లోనూ నీళ్లు లేకపోవడంతో అన్నదాతలు భూములను పడావుగా వదిలేస్తున్నారు.


పాలమూరు.. పైరు చూస్తే గుండె బేజారు..
వర్షాభావం పాలమూరు జిల్లా రైతుల నడ్డి విరిచింది. వర్షాధార పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. చివరికి జలాశయాల కింద సాగుచేసిన పంటలు కూడా ఎండిపోతున్నాయి. ఇందిరా ప్రియదర్శిని జూరాల జలాశయం కింద 1.02 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే ఈ ఏడాది గరిష్ఠంగా 20 వేల ఎకరాలు కూడా సాగవలేదు. తుంగభద్ర నుంచి నీటిని విడుదల చేయించాలని ఆర్డీఎస్‌ పరిధిలోని రైతులు ఆందోళన బాట పడుతున్నారు. భీమా ఎత్తిపోతల పరిధిలోనూ సాగు పూర్తిగా తగ్గిపోయింది. నెట్టెంపాడు ఎత్తిపోతల పరిధిలోని గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు జలాశయాల కింద ఈ ఏడాది సాగు ఆలస్యంగా ప్రారంభమైనా పదివేల ఎకరాలకే పరిమితమైంది. ప్రస్తుతం వరి పొట్టదశలో ఉంది. సాగునీటిపై ఆశలు పెట్టుకోవద్దని ఇదివరకే అధికారులు ప్రకటించారు.
కోయిల్‌సాగర్‌ పరిధిలోనూ..
మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్‌సాగర్‌లో ప్రస్తుతం 18.2 అడుగుల నీళ్లు ఉన్నాయి. దీని కింద 12 వేల ఎకరాల్లో సాగు చేపట్టాల్సి ఉండగా.. కేవలం నాలుగు వేల ఎకరాలకే పరిమితమైంది. కుడి, ఎడమకాలువల కింద నీళ్లు రాకపోతాయా అని ఎదురుచూసిన రైతులు వరి, వేరుశనగ, ఆముదం, కంది, జొన్న పంటలను సాగు చేశారు. జూరాల ఆలస్యంగా నిండడంతో ఆ ప్రభావం కోయిల్‌సాగర్‌పైనా పడింది. దీంతో పొట్టదశలో ఉన్న నాలుగు వేల ఎకరాల్లోనూ పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ఈ జలాశయంపై మహబూబ్‌నగర్‌తోపాటు పలు మండలాలు తాగునీటికి ఆధారపడుతున్నాయి. అధికారులు సాగుకు నీటిని విడుదల చేయలేమని తేల్చేశారు.

వెక్కిరిస్తున్న రామన్‌పాడు, సరళాసాగర్‌
జూరాలకు బ్యాలెన్సింగ్‌ జలాశయమైన రామన్‌పాడు ఈ ఏడాది రైతులకు చేదు అనుభవాలను మిగిల్చింది. 0.38 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ జలాశయం పరిధిలో ఏటా పది వేల ఎకరాల్లో పంటలు వేస్తారు. ఈ ఏడాది కేవలం మూడు వేల ఎకరాలకు ఇది పడిపోయింది. రామన్‌పాడుకు అనుబంధంగా ఉన్న సరళాసాగర్‌ నీటిసామర్థ్యం 0.5 టీఎంసీలు. దీని కింద 4,100 ఎకరాలు సాగుచేయాల్సి ఉండగా రెండు వేల ఎకరాల్లోనే సాగు చేశారు. వరి పొట్టదశలో ఉండగా నీటి విడుదల ప్రశ్నార్థకంగా మారింది.

తినడానికీ గింజలు మిగలవేమో!
జూరాల కుడికాల్వ కింద రెండెకరాల పొలం ఉంది. ఈ ఏడాది వర్షాలు లేక జూరాల నిండకపోవడంతో నారుమడి ఎండిపోయింది. తిండిగింజల కోసం రెండు గుంటల్లో వరి సాగు చేశా. ప్రస్తుతం వరి పొట్టదశకు చేరుకుంటోంది. తిండిగింజలూ రావేమోనని అనుమానంగా ఉంది.
- సులోచనమ్మ, వెంకంపేట, గద్వాల మండలం
గడ్డి కూడా దక్కేలా లేదు
కోయిల్‌సాగర్‌ జలాశయం కింద నాలుగెకరాల్లో వరి వేశా. పంట పొట్టదశలో ఉంది. నీళ్లులేక ఎండిపోతోంది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పంటలు వేయక చాలామంది వలసపోయారు. నేను ఆశతో కొంత సాగు చేశా. ఇన్‌ఫ్లో లేదని నీటి విడదలకు అధికారులు అంగీకరించడం లేదు.
-కిషన్‌రావు, దేవరకద్ర

బాధలతో ఆత్మహత్యల వైపు..
తీవ్రవర్షాభావ పరిస్థితుల వల్ల నల్గొండ జిల్లా వరప్రదాయినిగా పేరొందిన నాగార్జునసాగర్‌ వెలవెలబోతోంది. ఈ జిల్లాలో దాదాపు ముప్పావు వంతు పంటలను ప్రధాన, మధ్యతరహా ప్రాజెక్టులైన సాగర్‌ కాలువ, మూసీ ప్రాజెక్టుల కిందే సాగుచేస్తున్నారు. సాగర్‌ కింద మొత్తం 3.81 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. వర్షాలు లేకపోవడం, పైనుంచి వరద రాకపోవడంతో సాగర్‌ జలాశయానికి ఈ ఏడాదీ నీరందలేదు. సాగర్‌ ఆయకట్టులో బోరుబావుల కింద ఖరీఫ్‌లో సుమారు 1.40 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. వర్షాలు లేకపోవడంతో బోరుబావులూ వట్టిపోయాయి. పొట్ట దశలో ఉన్న పంట ఎండిపోవడం చూసి అన్నదాతలు తట్టుకోలేకపోతున్నారు. 80 వేల ఎకరాల్లో పంటలు కష్టంగానైనా చేతికందే పరిస్థితి ఉంది. మిగిలిన 60 వేల ఎకరాల్లో పంటలు ఇప్పుడిప్పుడే పొట్టదశకు వస్తున్నాయి. ఇప్పటికే సుమారు 10 నుంచి 15 వేల ఎకరాల్లో పంట ఎండిపోయిందని అనధికార అంచనా. ఇప్పుడు సాగర్‌ ఎడమ కాలువ కింద వదులుతున్న నీటిని మరో 10 రోజులు కొనసాగిస్తేనే కొద్ది శాతం పంటలనైనా కాపాడే పరిస్థితి ఉంటుందని రైతులు వేడుకుంటున్నారు. మూసీ ప్రాజెక్టు కింద అనధికారికంగా 25కు పైగా చెక్‌డ్యాంలున్నాయి. ఈ ప్రాజెక్టు కింద జిల్లావ్యాప్తంగా దాదాపు 1.50లక్షల ఎకరాలను స్థిరీకరించారు. ఖరీఫ్‌లో 50శాతం కూడా సాగుచేయలేదు.
నిలువునా ఎండిపోయింది
ఖరీఫ్‌లో బావిలో పూడిక, బోర్ల మరమ్మతులకు దాదాపు రూ.60 వేలు ఖర్చు చేశాను. నాకున్న 15 ఎకరాల్లో నీటి వసతి లేకపోవడంతో కేవలం 8 ఎకరాల్లో మాత్రమే సాగు చేశాను. పెట్టుబడి, బోర్ల మరమ్మతులు కలిపి మొత్తం రూ.2.80 లక్షల వరకు అప్పు మిగిలింది. పంట మాత్రం చేతికొచ్చే పరిస్థితి లేదు.
- కుందూరు శ్రీనివాసరెడ్డి, వేపలసింగారం
కూతురి పెళ్లి వాయిదా వేసుకున్నా
నాకు రెండెకరాల పొలం ఉంది. గతేడాది రూ.లక్ష ఖర్చు చేసి బోరు వేయించా. ఈ ఏడాది మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని వరి వేశా. కాలువ రాకపోవడంతో బోరు బావిలో నీళ్లు లేవు. ఇప్పటికే మూడెకరాల్లో పంట పూర్తిగా ఎండింది. ప్రస్తుతం కాలువ ద్వారా వదులుతున్న నీరు కూడా అందడంలేదు. పంట బాగా పండితే కూతురి పెళ్లి చేద్దామనుకున్నా. కానీ, పెట్టుబడులకు తెచ్చిన అప్పులే తీరే పరిస్థితి లేకపోవడంతో పెళ్లి వాయిదా వేశా.
- రణపంగు మత్తాయి, లక్కవరం
కర్షకుల కంటనీరు..
మ్మం జిల్లాలో కర్షకుల కష్టం కన్నీటిని మిగిల్చింది. చేతికి వచ్చిన పంట ఫలసాయం అందేక్రమంలో కళ్ల ముందే ఎండుముఖం పట్టడం అన్నదాత జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ జిల్లాకు నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ పెద్దదిక్కు. ఈ కాలువ కింద జిల్లాలోని 16 మండలాల్లో 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఎక్కువగా రైతులు వరి సాగు చేస్తుంటారు. ఖరీఫ్‌లో ఈసారి 1.25 లక్షల ఎకరాల్లో వరి పంట వేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలో సుమారు 60 వేల ఎకరాల్లో వరి సాగవుతుంది. ఈ పంటకు రెండుసార్లు నీరిస్తే 70 శాతం పంట చేతికొస్తుంది. ప్రస్తుతం సాగర్‌ నుంచి 5,037 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ఆ నీరు పాలేరుకు చేరుకుంటోంది. ఇది పూర్తి స్థాయిలో చేరాక.. ఎడమ కాలువకు సాగునీటిని వదులుతారు. ఈ నీరేదో ముందుగానే విడుదల చేస్తే పంట చేతికొచ్చేది. కనీసం పెట్టుబడులైనా మిగిలేవని రైతులు వాపోతున్నారు. సాగర్‌ నీటి రాక ఆలస్యంపై ఆగ్రహించిన కొందరు రైతులు కల్లూరు ప్రాంతంలో తమ వరి పంటను దహనం చేశారు. ఇక వైరా, లంకాసాగర్‌, పెద్దవాగు, తాలిపేరు, పాలెంవాగు ప్రాజెక్టుల కిందా పంటల విస్తీర్ణం ఈ ఏడాది తగ్గింది.

ఆయకట్టు అతలాకుతలం
నిజామాబాద్‌ జిల్లాలో ప్రధాన జలాశయాల ఆయకట్టు కింద సాగైన పంటల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిజాంసాగర్‌, ఎస్సారెస్పీ, పోచారం జలాశయాల్లో నీటి నిల్వలు కనీస స్థాయికి పడిపోవడంతో సాగు విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది. బోరు బావులు ఉన్న చోట్ల మాత్రం రైతులు కొంతమేర పంటలు సాగు చేశారు. ప్రస్తుతం వీటిలో కూడా నీటి లభ్యత లేకపోవడంతో పంటలు నిలువునా ఎండిపోతున్నాయి.

* నిజాంసాగర్‌ కింద ఆయకట్టు 2.35 లక్షలు ఉండగా జలాశయంలో నీరు లేకపోవడంతో బోర్లున్న రైతులు 80 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. భూగర్భజలాలు అడుగంటడంతో 30 వేల ఎకరాల్లో వరి పూర్తిగా ఎండిపోయింది. మిగతా 50 వేల ఎకరాల్లో గింజ నాణ్యత తగ్గి పంట దిగుబడి పడిపోయింది.

* పోచారం జలాశయం కింద 11,600 ఎకరాల ఆయకట్టు ఉంది. బోరు సౌకర్యం ఉన్న రైతులు 2,510 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, చెరకు పంటలు వేశారు. ప్రస్తుతం బోర్లలో నీరు అడుగంటిపోవడంతో 1200 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి.

* ఎస్సారెస్పీ కాకతీయ కాలువ కింద 7 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. బోర్లు ఉండడంతో మొత్తం ఆయకట్టులో పసుపు, వరి పంటలు సాగు చేశారు. 200 బోర్లలో పూర్తిగా నీరు రాక నిరుపయోగంగా మారాయి. ఇప్పటికే 4 వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మిగతా విస్తీర్ణంలో దిగుబడి గణనీయంగా తగ్గిపోయే పరిస్థితి నెలకొంది.


బీళ్లుగా మారిన భూములు..
రంగల్‌ జిల్లాలో ప్రధాన ప్రాజెక్టుల కింద ఉన్న సాగు భూములు నీరు లేక బీళ్లుగా మారాయి. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు దేవాదుల, శ్రీరాంసాగర్‌. శ్రీరాంసాగర్‌ ఈసారి వర్షాభావంతో ఎండిపోయే దశకొచ్చింది. ఈ ప్రాజెక్టు కింద సాగు చేసే ఒక్క ఎకరం పొలానికి కూడా నీరందించే పరిస్థితి లేకుండా పోయింది. జిల్లాలో ఈ ప్రాజెక్టు కింద 4,24,228 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. కానీ, ప్రాజెక్టు నిర్మించినప్పటినుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీటిని అందించలేదు.

ఆదుకుంటున్న దేవాదుల: దేవాదుల ప్రాజెక్టు మాత్రం కొంత మేరకు రైతుల్ని ఆదుకుంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని 5,43,750 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలని స్థిరీకరించారు. ప్రాజెక్టు కింద ఉన్న రిజర్వాయర్లను నింపుతూ 1.15 లక్షల ఎకరాలకు నీటిని అందిస్తున్నారు. ఇందులో వరంగల్‌ జిల్లా పరిధిలో 93 వేల ఎకరాలు ఉన్నాయి. ప్రస్తుత ఖరీఫ్‌లో మాత్రం 80వేల ఎకరాలకు సాగునీటిని అందించారు. పంటలకు పూర్తిస్థాయిలో సాగునీటిని అందించడంతో ఖరీఫ్‌లో సాగుచేసిన పంటలు ఆశించిన మేరకు దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. రబీలో మాత్రం నీటిని విడుదల చేసేందుకు వీలుండదు. దేవాదుల గోదావరి నది ఎత్తిపోతల పథకం కావడంతో నీరున్నప్పుడు మాత్రమే పంపింగ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. గోదావరిలో నీటి సామర్థ్యం తగ్గితే దేవాదుల ప్రాజెక్టుకు నీరుండదని అధికారులు తెలిపారు. ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, ములుగు, గోవిందరావుపేట ప్రాంతాల్లో ఈసారి భారీ వర్షాలు కురవడంతో దేవాదుల ఎత్తిపోతల ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న రిజర్వాయర్లకు నీటిని పంపింగ్‌ చేశారు. పంటలకు సాగునీటితో పాటు వరంగల్‌ నగరానికి తాగునీటిని కూడా అందిస్తున్నారు.

రెండేళ్లుగా రబీలో నీరివ్వలేదు..
స్సారెస్పీ కాలువ కింద ఎకరన్నర పొలం ఉంది. కాలువ నిర్మించి పదేళ్లు దాటింది. ఇప్పటి వరకు సుమారు ఐదుసార్లు కాలువలోకి నీళ్లు వచ్చాయి. వచ్చినప్పుడే పొలాలు పండాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎకరన్నర పొలంలో నాటు వేశాను. పొలానికి బోరుబావి ద్వారా నీరందిస్తున్నాను. పంట చేతికొచ్చే సమయంలో బోరులో జలాలు అడుగంటిపోవడంతో పంట ఎండిపోతుంది.
- బచ్చల స్వామి, వర్ధన్నపేట మండలం కొత్తపల్లి
రైతుల క్షేమం కోరే ప్రభుత్వాలు లేవు
త్మకూరులో ఎస్సారెస్పీ కాలువ కింద 8 ఎకరాలు ఉంది. మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మొక్కజొన్న, పసుపు పంటలు సాగు చేశాను. ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో సాగుచేసిన పంటలో సగం వరకు ఎండిపోయింది. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా ఆయకట్టు రైతులకు నీరందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి రైతులను మోసం చేసింది. రైతుల క్షేమం కోరే ప్రభుత్వాలు లేవు.
- ఆరె సాంబరెడ్డి, ఆత్మకూరు

మమ్మల్నీ ఉద్యోగులే అనుకున్నారు!

బయోటెక్నాలజీ రంగాన్ని చాలా ఇష్టంగా ఎంచుకున్నారా ఇద్దరు..!కానీ ఆ చదువుకు తగ్గ ఉద్యోగాల్లేవు.. ఈ పరిస్థితుల్లో ఎవరయినా ఉన్నచోటే వేరే ఉద్యోగాలు చూసుకోవడమో...

‘ముఠామేస్త్రీ’ రానా

నటుడు దగ్గుబాటి రానా ముఠామేస్త్రీ అయ్యారు. మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా ప్రసారం కానున్న ‘మేముసైతం’ .........

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net