Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'

విశాఖలో భారీగా తీరం కోత
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ కరుగుతున్న తీర ప్రాంతం
విశాఖపట్నంలో రహదారి అంచు వరకు సముద్రపు నీరు
హరించుకుపోతున్న ఇసుక తిన్నెలు
ఈనాడు, విశాఖపట్నం: సాగరం భయపెడుతోంది. అడుగు అడుగూ చొచ్చుకొస్తూ తీరాన్ని కబళిస్తోంది. రాష్ట్రంలోని సముద్ర తీరాలు కరిగిపోతున్నాయి. విశాఖపట్నంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో విస్తరించిన అన్ని తీరాల్లోనూ సముద్రం ముందుకు చొచ్చుకొస్తోంది. రాష్ట్రంలో 974 కి.మీ. పొడవైన తీరం విస్తరించి ఉంది. ఆ తీరాన్ని పరిరక్షించడానికి, తీరప్రాంత ప్రజలకు భరోసా కల్పించడానికి రాష్ట్రం తీసుకుంటున్న చర్యలు మొక్కుబడిగా ఉన్నాయి. తీరం పొడవునా మడ అడవుల పెంపకానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా నానాటికీ పెరగాల్సిన వాటి విస్తీర్ణం తగ్గిపోతోంది. శాస్త్రవేత్తలు విశాఖ తీరంపై అధ్యయనం చేయగా ప్రమాదకర పరిస్థితులున్నట్లు వెల్లడయింది. విశాఖలో అధ్యయనం పూర్తయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అధ్యయనం చేయాలని భావిస్తున్నారు.

గతంలో విశాఖ తీరం పొడవునా సువిశాలమైన ఇసుక తిన్నెలు ఎంతో కనువిందు చేసేవి. ఆ సుందర దృశ్యాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. తీరం భారీగా కోతకు గురవుతుండడంతో అక్కడకు వెళ్లడానికి సందర్శకులు భీతిల్లుతున్నారు. సముద్రపు నీరు బీచ్‌రోడ్డు అంచుల వరకు వచ్చేస్తోంది. సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన ‘కురుసురా’ జలాంతర్గామి చుట్టూ నిర్మించిన ప్రహరీలో కొంతభాగం ఇటీవల కూలిపోయింది. కొద్ది సంవత్సరాల కిందటి వరకు అలల తాకిడి ప్రహరీ సమీపానికి కూడా వచ్చేదికాదు. ఒకవేళ సముద్రం ముందుకువచ్చినా గోడకు ఎలాంటి

ఇబ్బంది లేకుండా అధికారులు భారీ బండరాళ్లను ఏర్పాటు చేశారు. మ్యూజియం వెనుకభాగం నుంచి కూడా సందర్శకులు యథేచ్ఛగా తీరంలో సంచరించేవారు. ఇటీవలి నెలల్లో పరిస్థితి మొత్తం మారిపోయింది. మ్యూజియం వెనక బండరాళ్ల పైకి కూడా సముద్రపు నీరు వచ్చేస్తోంది. మ్యూజియం ప్రహరీకి అటుఇటు రెండువైపులా ఇసుక కోతకు గురై సుమారు ఎనిమిది నుంచి పది అడుగుల ఎత్తు గోడలా ఇసుక మేటలు పేరుకుపోయాయి. మరికొన్ని సంవత్సరాల్లో సముద్రం మరింత చొచ్చుకు వచ్చి మ్యూజియాన్ని తరలించక తప్పని పరిస్థితి తలెత్తవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గోకుల్‌పార్క్‌ గోడకు తూట్లు
నావల్‌ కోస్టల్‌ బ్యాటరీ నుంచి గోకుల్‌పార్క్‌ వరకు వెళ్లే రహదారికి సముద్రాన్ని ఆనుకుని నిర్మించిన రక్షణ గోడ ఇటీవల కొట్టుకుపోయింది. అక్టోబరు, నవంబరు నెలల్లో వచ్చిన తుపాను సమయంలో రక్షణ గోడ పడిపోయింది. తాజాగా ఇసుక తెన్నెలు కొట్టుకుపోవడంతో సముద్రం బాగా ముందుకు వచ్చింది. గోకుల్‌ పార్కు మూడోవంతు సముద్రంలో కలిసిపోయింది. పరిస్థితి గమనించిన జీవీఎంసీ అధికారులు కర్రలతో ప్రమాద హెచ్చరికలను ఏర్పాటు చేశారు.

* అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్లు ఎక్కువగా రావడం తీరం కోతకు గురవడానికి ప్రధాన కారణం. అవి ఏర్పడినప్పుడు అలల ఎత్తు భారీగా పెరిగి తీరానున్న ఇసుకను భారీగా లోపలికి లాగేస్తున్నాయి.
* అలల ఉద్ధృతి నేరుగా తీరానికి తాకకుండా వాటి తీవ్రతను తగ్గించడానికి వీలుగా సముద్రంలో ఇసుకమేటలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి తీసి(డ్రెడ్జింగ్‌ చేసి) తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేస్తారు. ఈ ప్రక్రియను పోర్టు అధికారులు బీచ్‌ నౌరిష్‌మెంట్‌ పేరిట ప్రతి సంవత్సరం నిర్వర్తిస్తున్నారు. అయితే ఎక్కడ ఎంత మొత్తంలో ఇసుకను వేయాలన్న అంశంపై శాస్త్రీయ విధానాల్ని పాటించకపోవడంతో ఫలితాలు ఆశాజనకంగా ఉండడం లేదు.
* తీరానికి అత్యంత సమీపంలోనే లోతు ఎక్కువగా ఉండే విశాఖలో ఇసుకకూడా హరించుకుపోవడంతో సముద్రం మరింత ముందుకు వస్తోంది.

శాస్త్రీయ కారణాల్ని అధ్యయనం చేస్తున్నాం
విశాఖలో సముద్రం ఏ స్థాయిలో ముందుకొస్తోందో తీవ్రత అంచనా వేయడానికి ఆర్‌.కె.బీచ్‌, కైలాసగిరి, రుషికొండ, కురుసురా మ్యూజియం ప్రాంతాల వద్ద మూడు సంవత్సరాల నుంచి అధ్యయనాలు చేస్తున్నాం. ఆ నాలుగుచోట్లా కోత చాలా ఎక్కువగా ఉంది. అలల తీవ్రత, దిశ, వేగం, అలల్లో ఉండే కరెంటులతోపాటు గత సంవత్సరం తుపాన్లు ఎక్కువగా రావడం వల్ల కూడా ఇసుక కోతకు గురైంది. ఇసుక కోతకు గురికావడం, మళ్లీ పరిస్థితులు మారిన తరువాత ఇసుక మేటలు వేయడం సహజంగా జరిగేదే అయినా విశాఖ తీరంలో తిరిగి ఇసుక జమ కాకపోవడంతో సముద్రం మరింత ముందుకు వస్తోంది. మరింత శాస్త్రీయంగా విశ్లేషించి కారణాల్ని నిర్ధారించడంతోపాటు, పరిస్థితిని అదుపు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం. రాష్ట్రంలోని తీరం పొడవునా సమగ్ర అధ్యయనం చేస్తే కోతకు దారితీస్తున్న మరిన్ని కారణాలు వెలుగులోకి రావచ్చు. ప్రస్తుతం విశాఖతీరంలో చేస్తున్న అధ్యయనాలు పూర్తయిన తరువాత మిగిలిన ప్రాంతాలపై దృష్టి సారిస్తాం.
- డాక్టర్‌ వి.ఎస్‌.ఎన్‌.మూర్తి, సైంటిస్ట్‌ ఇన్‌ఛార్జి,
జాతీయ సముద్ర అధ్యయన సంస్థ, విశాఖపట్నం
గ్రోయిన్స్‌తో అడ్డుకోవచ్చు
సాగరతీరంలో ఉండే ఇసుక కోతకు గురై సముద్రం ముందుకు చొచ్చుకురాకుండా చేయడానికి శాస్త్రీయమైన విధానాలు అందుబాటులో ఉన్నాయి. అవి అనుసరించకపోతే సముద్రం మరింత ముందుకు చొచ్చుకువచ్చి తీరానికి ఆనుకుని ఉండే ప్రాంతాల్లో భూగర్భజలాలు దైనందిన అవసరాలకు ఏ మాత్రం పనికిరావు. ఆ పరిస్థితి తలెత్తకుండా తీరం నుంచి సముద్రంలోకి 200 నుంచి 300 మీటర్ల దూరం వరకు కాంక్రీటుతో గోడలను నిర్మిస్తారు. వీటిని గ్రోయిన్స్‌గా పిలుస్తారు. వాటి వల్ల తీరంలో పేరుకున్న ఇసుక మళ్లీ వెనక్కి వెళ్లకుండా ఉంటుంది. అమెరికాలోని మియామీ తీరంలో గ్రోయిన్ల నిర్మాణం చేసి కోతను ఆపడమేకాకుండా తీరంలో ఇసుకతెన్నెల విస్తీర్ణాన్ని భారీగా పెంచగలగారు.

*పోర్టు అవుటర్‌ హార్బర్‌ను నిర్మించి దాని పరిరక్షణకు వీలుగా భారీగా కాంక్రీటు దిమ్మెలను వేశారు. ఫలితంగా సదరన్‌ లాంగ్‌ షోర్‌ కరెంటుకు అడ్డుకట్ట పడుతోంది. దీంతో పాటు తీరానికి చేరే ఇసుక రాకుండా పోతోంది.

* ప్రస్తుతం ఉన్న బీచ్‌రోడ్‌ నుంచి సుమారు కిలోమీటరు దూరం వరకు ఇసుకతెన్నెలు ఉండేవని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రస్తుతం సముద్రంలోకి చొచ్చుకుపోయిన డాల్ఫిన్స్‌ నోస్‌ కొండ ముందుభాగంలో కూడా సుమారు వందేళ్ల కిందట ఇసుక తెన్నెలుండేవి. విశాఖ తీరం పొడవునా ఉన్న ప్రాంతంలో మట్టిరోడ్డు కూడాఉందని...ఆ రహదారిపై విశాఖ నుంచి గంగవరం గ్రామం వరకు ఎడ్లబళ్లపై ప్రయాణించేవారని కూడా మా అధ్యయనాల్లో తేలింది. క్రమక్రమంగా ఇసుక కోతకు గురవుతూ డాల్ఫిన్‌నోస్‌ కొండ ముందుభాగం వరకు నీళ్లు వచ్చేయడంతో మట్టిరోడ్డు మునిగిపోయింది. కోత ఎక్కువగా ఉన్నచోట్ల తీరం వెడల్పు 50 మీటర్లకంటే కూడా తక్కువగా ఉంది.

* డాల్ఫిన్స్‌ నోస్‌ పక్కనే పోర్టును అభివృద్ధి చేసి జెట్టీల కోసం సముద్రలోతును భారీగా పెంచడంతో విశాఖ తీరం పొడవునా సముద్రం క్రమక్రమంగా ముందుకువచ్చింది.

- ఆచార్య ఎం.జగన్నాథరావు, భూవిజ్ఞానశాస్త్ర విభాగం,
ఆంధ్రవిశ్వవిద్యాలయం
పెద్ద ఫుట్‌బాల్‌ మైదానం ఉండేది
విశాఖకు నేను 1949లో వచ్చాను. నేను అప్పట్లో తరచూ సాగరతీరానికి వెళ్లి సేదతీరుతుండేవాడిని. బీచ్‌లో పెద్ద ఫుట్‌బాల్‌ మైదానం ఉండేది. కాలగమనంలో సముద్రం ముందుకు రావడంతో ఆ మైదానం కాస్తా కనుమరుగైంది. కొన్ని వందల ఏళ్ల కిందట విశాఖ తీరంలో వైశాఖేశ్వర దేవాలయం ఉండేదని, సముద్రం ముందుకు రావడం వల్లే ఆ దేవాలయం ముంపునకు గురై కనుమరుగైందన్న ప్రచారమూ ఉంది. 65 ఏళ్ల కిందట నేను చూసిన విశాఖ తీరానికి నేటి విశాఖ తీరానికి ఏమాత్రం సంబంధం లేదు. సగానికి పైగానే కోతకు గురైనట్లు కచ్చితంగా చెప్పగలను.
- అంగర సూర్యారావు,
రచయిత, విశాఖపట్నం

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

చైనాలో విడుదలకు సిద్ధమవుతున్న బాహుబలి

బాహుబలి ది బిగినింగ్‌ చిత్రాన్ని చైనాలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమయిన సంగతి తెలిసిందే. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్రానికి కొన్ని మార్పులు చేయనున్నట్లు దర్శకుడు ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net