Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ప్యాకేజీ ఇవ్వండి''విలీనమా.. అనర్హతా?''అదనపు పనులన్నీ పాత గుత్తేదారులకే''భారతమాతను కించపరిస్తే సహించం''‘తెలంగాణ బ్రాండ్‌’ పేరుతో అమ్మకాలు''శాశ్వత ఉత్సవంగా మేడారం జాతర''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''విలీన లేఖపై ఏమి చేయాలి?''వీరసేనానికి కన్నీటి వీడ్కోలు''అమ్మతనానికి అండ'
నేను స్వలింగ సంపర్కుడినే!
అందుకు గర్వపడుతున్నా ‘ఆపిల్‌’ సీఈవో టిమ్‌ కుక్‌ ప్రకటన
వివక్షలు వీడిపోవాలనే బయటపడుతున్నానని వివరణ
‘‘ఆపిల్‌ కంపెనీ సీఈవో అంతటి వాడు కూడా స్వలింగ సంపర్కుడేనని తెలియటం వల్ల కొందరికైనా మేలు జరుగుతుందని భావిస్తున్నాను.. తమ హక్కుల కోసం గద్దించి అడిగేందుకు కొందరికైనా స్ఫూర్తినివ్వచ్చు. అందుకే నేను గోప్యత వీడుతున్నా’’
ప్పుడూ అందమైన, అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులతో అంతర్జాతీయ మార్కెట్‌లో సరికొత్త సంచలనాలు సృష్టిస్తుండే విఖ్యాత ‘ఆపిల్‌’ కంపెనీ.. ఒక సామాజిక అంశంపై కొత్త చర్చకు తెర తీసింది. ఆ కంపెనీ ముఖ్య కార్యనిర్వహణాధికారి, అమెరికా వ్యాపార దిగ్గజాల్లో ఒకరైన టిమ్‌ కుక్‌ గురువారంనాడు ‘నేను స్వలింగ సంపర్కుడినే! అందుకు నేను గర్వపడుతున్నా!’ అని బహిరంగంగా ప్రకటించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా రకరకాలుగా లింగపరమైన వివక్షను ఎదుర్కొంటూ మనసులోనే మథన పడుతున్న ఎంతో మందికి వూరటనిచ్చేందుకు, అలాగే తమ హక్కుల కోసం పోరాడేందుకు వారికి కొత్త స్ఫూర్తినిచ్చేందుకే తానిలా బహిరంగంగా ప్రకటించుకుంటున్నట్టు ఆయన వివరించారు. ఈ మేరకు ఆయన ‘బ్లూమ్‌బెర్గ్‌ బిజినెస్‌ వీక్‌’ పత్రికకు ప్రత్యేక వ్యాసం రాశారు. తన లైంగిక ధోరణి గురించి టిమ్‌ ఇలా బయటపడటం, బహిరంగంగా అంగీకరించటం ఇదే ప్రథమం. అలాగే ఆపిల్‌ వంటి ఒక ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలో సీఈవో స్థాయి ఉన్నతోద్యోగి ఇలా తన లైంగిక స్వభావాన్ని గురించి బహిరంగంగా చర్చించటం కూడా ఇదే మొదలు. ‘‘నా లైంగిక ధోరణి గురించి వినవచ్చే వార్తలను నేనెన్నడూ ఖండించలేదు. అలాగని ఇప్పటి వరకూ బహిరంగంగా అంగీకరించనూ లేదు. ఇప్పుడీ విషయాన్ని స్పష్టంగా చెప్పనీయండి.. నేను స్వలింగ సంపర్కుడిని. అందుకు నేనెంతో గర్వపడుతున్నాను. స్వలింగసంపర్కమనేది దేవుడు నాకిచ్చిన అతి గొప్ప వరమని కూడా భావిస్తున్నా’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

టిమ్‌ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా స్వలింగ సంపర్కులు, వారి హక్కులపై పెద్దఎత్తున చర్చ ఆరంభమైంది. ఆపిల్‌ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ మరణానంతరం 2011లో కంపెనీ సీఈవో పగ్గాలు స్వీకరించిన 53 సంవత్సరాల కుక్‌ తాను వ్యక్తిగత గోప్యతను వీడి ఇలా బయటకు వస్తుండటం వెనక ఒక స్పష్టమైన కారణం, బలమైన లక్ష్యం ఉన్నాయని వివరించారు. ‘‘కొన్నాళ్లుగా వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యమిస్తూ నేను.. అంతకన్నా ముఖ్యమైన పని చెయ్యలేకపోతున్నాను. పురుష స్వలింగ సంపర్కుడిని (గే) కావటం వల్ల ఒక మైనారిటీ వర్గానికి చెందటమంటే ఏమిటో నాకు స్వానుభవంతో తెలిసివచ్చింది. మిగతా మైనారిటీ సభ్యులంతా అనునిత్యం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకునేందుకు ఇది నాకు గొప్ప అవకాశాన్నిచ్చింది. వారి పట్ల నాలో రేగే సహానుభూతి.. జీవితంలోని గాఢతను, చిక్కదనాన్ని అర్థం చేసుకునేలా చేసింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ‘‘ఈ అనుభూతుల వల్ల నా చర్మం కొంత బండబారిన మాట కూడా నిజం. ఆపిల్‌ కంపెనీ సీఈవోగా అది నాకెంతో కలిసొచ్చింది కూడా’’ అని ఆయన సరదా వ్యాఖ్యలు కూడా చేశారు. ఎంతో గౌరవప్రదమైన, ఉన్నతమైన నేపథ్యం నుంచి వచ్చిన తనకు వ్యక్తిగత విషయాలను ఇలా బహిరంగంగా చర్చించటం ఇబ్బందికరంగానే ఉందంటూ ‘‘ప్రతిష్ఠాత్మక ఆపిల్‌ కంపెనీని ప్రపంచ వ్యాప్తంగా అంతా గమనిస్తూనే ఉంటారని తెలుసు. ఆపిల్‌ ఉత్పత్తుల మీది నుంచి, వీటితో మా వినియోగదారులు సాధించే అద్భుతాల మీది నుంచి అందరి దృష్టీ వేరేవాటి మీదకు మళ్లటం నాకు ఇష్టం కూడా లేదు. అయితే ఆపిల్‌ కంపెనీ సీఈవో అంతటి వాడు కూడా స్వలింగ సంపర్కుడేనని తెలియటం వల్ల కొందరికైనా మేలు జరుగుతుందని భావిస్తున్నాను. తమ లైంగిక ధోరణులను తెలుసుకునేందుకు, తామెవరమో, ఏ వర్గానికి చెందుతామో గుర్తించేందుకు ఇది కొందరికైనా దోహదపడొచ్చు. తాము ఒంటరివాళ్ల మన్న భావన కొందరికైనా పోవచ్చు. అలాగే తమ హక్కుల కోసం గద్దించి అడిగేందుకు కొందరికైనా స్ఫూర్తినివ్వచ్చు. అందుకే నేను గోప్యత వీడుతున్నా’’ అని ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. తన కార్యాలయంలో ఉంచిన హక్కుల ఉద్యమకారులు మార్టిన్‌ లూథర్‌కింగ్‌, రాబర్ట్‌ కెనడీల చిత్రపటాల నుంచి నిత్యం తానెంతో స్ఫూర్తిపొందుతానని పేర్కొంటూ ‘‘అంత మాత్రాన నేనేమీ ఉద్యమకారుడినని అనుకోవటం లేదు. ఇతరుల త్యాగాల నుంచి నేనెంత లబ్ధిపొందానో గుర్తెరిగిన వాడిని నేను. నా వంతు ఉడతసాయం నేను చెయ్యాలనుకుంటున్నాను. న్యాయ సాధన కోసం మనం కలిసికట్టుగా ఇటుకా ఇటుకా పేర్చుకుంటూ వెలుగుల బాట నిర్మించుకుంటూ వెళతాం. ఇందుకు నేను సమర్పిస్తున్న ఇటుక ఇది’’ అని సవినయంగా రాసుకున్నారు. ఈ సందర్భంగా అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వం ఇటీవల స్వలింగ సంపర్కుల విషయంలో వివక్షను నిషేధిస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకోవటాన్ని ప్రస్తుతించారు.

ఉద్యోగాల్లోనూ వివక్ష ఎందుకు?
ఇప్పటికే ఫుట్‌బాల్‌ క్రీడాకారులు, ఆర్థిక వేత్తల వంటి భిన్న రంగాలకు చెందిన వారంతా తమతమ లైంగిక స్వభావాల గురించి బహిరంగంగా ప్రకటించుకున్నారుగానీ.. అమెరికా సమాజాన్ని ప్రభావితం చేసే ప్రముఖ కార్పొరేట్‌ కంపెనీ సీఈవోల వంటివారు మాత్రం చాలా కాలంగా బయటకు రావటం లేదు. దీన్ని ఎత్తిచూపిస్తూ కొద్ది నెలల క్రితం న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ‘‘వేర్‌ ఆర్‌ ద గే సీఈవోస్‌?’ అంటూ ఒక ప్రత్యేక వ్యాసం కూడా రాసింది. ఈ నేపథ్యంలో కుక్‌ వంటి ప్రతిభావంతమైన వ్యక్తి ఇలా బహిరంగంగా ప్రకటించుకోవటానికి ప్రపంచవ్యాప్తంగానూ, అమెరికాలో కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. నిజానికి కుక్‌ లైంగిక స్వభావాన్ని గురించి ఆపిల్‌ కంపెనీలో అందరికీ తెలుసు. స్టీవ్‌ జాబ్స్‌ హయాంలో ఆపిల్‌ కంపెనీ తమ వ్యాపారానికి సంబంధించిన విషయాలు తప్పించి ఇతరత్రా అంశాలపై ఎన్నడూ దృష్టి పెట్టలేదు. అంత మాత్రాన ఆపిల్‌ కంపెనీలో తన పట్ల సహోద్యోగులు ఎవరూ ఎటువంటి వివక్షా చూపించలేదని కుక్‌ తాజాగా వ్యాఖ్యానించారు. అయితే అమెరికాలోని చాలా చోట్ల పరిస్థితి ఇలా లేదు. వివాహాలు, విడాకులు, హక్కుల వంటి విషయాల్లో అమెరికా సమాజం ఎంతో సంయమనాన్ని పాటిస్తున్నా, ఎన్నో మార్పులు వచ్చినా కూడా ఇప్పటికీ స్వలింగ సంపర్కుల విషయంలో మాత్రం పెద్దగా వివక్ష పోవటం లేదు. కేవలం ఒక్క లైంగిక స్వభావం ఆధారంగానే చాలా రాష్ట్రాల్లో వ్యక్తులను ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉంది. చాలా రాష్ట్రాల్లో చట్టాలు వీరికి వ్యతిరేకంగా ఉన్నాయి. స్వలింగ సంపర్కులకు ఇళ్లు అద్దెకివ్వకపోవటం, ఇచ్చినా తెలిసిన తర్వాత ఖాళీ చేయించటం వంటివి జరుగుతున్నాయి. ఇటువంటి వివక్షలు తొలగిపోవాలంటే తనలాంటి వారు బయటకురావటం, వీరిలో ఉన్నత స్థానాల్లో గౌరవప్రదంగా జీవించే వారు కూడా ఉంటారన్న సందేశం పంపటం ముఖ్యమని కుక్‌ అభిప్రాయపడుతున్నారు. అందుకే కుక్‌ తన ప్రకటనలో ‘‘ఒక వ్యక్తిని కేవలం లైంగిక ధోరణ ఆధారంగానో, జాతి ఆధారంగానో అంచనా వేయటం సరికాదు. నేను కేవలం ఒక గేని మాత్రమే కాదు. ఒక ఇంజినీరును. ఒక ప్రకృతి ప్రేమికుడిని. ఒక మంచి మామయ్యను, ఒక క్రీడాభిమానిని. ఇంకా చాలాచాలా. అంతా నాలోని మెరుపుల వైపు, మెరుగులవైపు చూస్తారని ఆశిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. ఏ కంపెనీ అయినా.. వ్యక్తులను వారివారి గుణగణాలతో సహా గుర్తించి, ఆదరించి అక్కునచేర్చుకుంటే వాళ్లు తమ శక్తియుక్తులు, సర్వస్వం ధారపోస్తారని తాను ఆపిల్‌ కంపెనీకి రాకముందే గుర్తించినట్టు ఆయన చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. లైంగికంగా వివక్షలు ఎదుర్కొంటున్న స్వలింగ సంపర్క బృందాలైన లెస్బియన్‌, గే, బైసెక్సువల్‌, ట్రాన్స్‌జెండర్‌ (ఎల్‌జీబీటీ) వ్యక్తులందరికీ అమెరికా ప్రభుత్వం కంటే కూడా తామే ఎక్కువ రక్షణలు కల్పిస్తున్నట్టు ఆపిల్‌ కంపెనీ గతంలోనే ప్రకటించింది. ఉద్యోగాల్లో ఇటువంటి వివక్షలు తొలగిపోయేలా చేసేందుకు అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం ‘ఎంప్లాయ్‌మెంట్‌ నాన్‌డిస్క్రిమినేషన్‌ యాక్ట్‌’ను పరిశీలిస్తోంది. కేవలం పై అధికారుల వివక్షలకు భయపడి ప్రస్తుతం ఈ ఎల్‌జీబీటీ వర్గాలకు చెందిన కనీసం 83 శాతం మంది ఆఫీసుల్లో తమ గురించి తెలియకుండా చూసుకుంటున్నారని డెలాయిట్‌ కంపెనీ ఒక నివేదిక వెలువరించింది. ఈ నేపథ్యంలో ఆఫీసుల్లో, పని ప్రదేశాల్లో వీరి పట్ల వివక్షలను రూపుమాపటం అవసరమని భావిస్తున్నారు. మన దేశంలో కూడా హిజ్రాలు, స్వలింగ సంపర్కుల హక్కుల పట్ల పెద్ద చర్చే జరుగుతోందిగానీ వివక్షలు వీడటానికి ఎంతకాలం పడుతుందో, మనం దీనికి ఎంత దూరంలో ఉన్నామో ప్రస్తుతానికి వూహించటం కూడా కష్టం.
-ఈనాడు ప్రత్యేక విభాగం

మా వూరికి మంచి నీళ్లు...

బాగా ఆస్తిపాస్తులున్న వాళ్లని శ్రీమంతులంటారు.మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చూశాక ఆ అర్థం మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కడ పెరిగినా, స్థిరపడినా సొంతూరి...

ప్రేమలు మెరిసే.. తారలు మురిసే!

ప్రేమ ఓ అనీర్వచనీయమైన అనుభూతి. ప్రేమలో పడితేనే దాని మాధుర్యం ఏంటో తెలిసేది. నిజ జీవితాల్లోనే కాదు వెండితెరపైనా ప్రేమ అద్భుతమైన విజయాలు అందించింది....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net