భలే బొమ్మలోచ్‌! పిల్లలే చేశారోచ్‌!!
అరిస్తే ఫొటో తీసే కెమెరా... వాటికవే నీళ్లు పోసుకునే మొక్కలు... ప్రతికూల పరిస్థితుల్లో రక్షించే ఇళ్లు... ఇంటిల్లిపాదీ పట్టేంత పెద్ద స్కూటరు... ఇవన్నీ చేసింది ఏ శాస్త్రవేత్తలో కాదు...చిన్నపిల్లలే!
పిల్లలకు ఆటబొమ్మలతో ఆడుకోవడమే తెలుసనుకుంటాం. కానీ అవకాశమిస్తే ఎన్నో కొత్త ఆవిష్కరణలు కూడా చేయగలరు. కావాలంటే అలాంటి పిల్లల గురించి మీరే చదవండి. ఎంతో మంది పిల్లలు గీసిన బొమ్మలే నిజమైన వస్తువులయ్యాయి.
* మనకు టూత్‌ బ్రష్‌, పేస్ట్‌ వేరువేరుగా ఉంటాయి. కానీ ఈ పిల్లలు బ్రష్‌కింద నొక్కగానే టూత్‌పేస్ట్‌ బ్రష్‌పైకి చేరేలా ‘టూత్‌ ఒమాటిక్‌’ని డిజైన్‌ చేశారు. వేళకు తినమంటూ చెప్పే ‘టాకింగ్‌ లంచ్‌ క్లాక్‌’కి రూపం ఇచ్చారు. అంతేకాదు చెట్ల ఆకుల్ని పట్టుకునే లీఫ్‌ క్యాచర్‌, కావాల్సినట్టు కాంతిని పంచే షేడీ ల్యాంప్‌ ఇలా ఒక్కటనేంటీ ఎన్నో ఆలోచనలతో తమ మెదడుకు పదునుపెట్టి కొత్త వస్తువులకు సృష్టికర్తలయ్యారు.
* ఎలాగో ఏంటో అంటే... కళాకారుడు, డిజైనర్‌ డోమినిక్‌ విల్‌కోక్స్‌ అనే ఆయన ఇంగ్లండ్‌లోని సుండర్‌ల్యాండ్‌లో నాలుగు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లలకు ‘ఇన్వెంటర్స్‌ ప్రాజెక్ట్‌’ పేరిట ప్రత్యేకంగా వర్క్‌షాప్‌ నిర్వహించాడు. తన ఆవిష్కరణలు చూపించి ‘మీ చిట్టి బుర్రలో వచ్చే ఆలోచనల్ని బొమ్మల రూపంలో గీసుకురండి’. అని చెప్పాడు. అప్పుడు పిల్లలంతా కలిసి ఆరువందల డిజైన్లతో వచ్చారు. వాటిల్లో 60 ఎంపిక చేశారు. స్థానికంగా ఉన్న కళాకారులతో, తయారీదారులతో వాటికి రూపం ఇచ్చి నిజమైన వస్తువులుగా తీర్చిదిద్దారు.
* చిన్నారులు బొమ్మపై ఉంచిన సూచనల ఆధారంగా అచ్చుగుద్దినట్టుగా ఆవిష్కరణల్ని చేశారు. ఇబ్బందుల్లో రక్షించుకోవడానికి ఏర్పాటు చేసిన ‘లిఫ్టోలేటర్‌’(వార్‌ అవైడర్‌), వంటివి మినియేచర్‌ రూపంలో చేస్తే టెలిఫోను పెట్టుకోవడానికి వీలుగా ఉండే ‘ఫోన్‌ ఫ్రెండ్‌’, పసిపిల్లల కోసం చేసిన బేబీ స్లీపర్‌ లాంటివి ఉపయోగించుకునే వస్తువుల్లానే చేశారు. చిన్నారులఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న ఈ నిజమైన బొమ్మలను ప్రదర్శనకు పెడితే మంచి ఆదరణ లభించింది!

  • alaya300-50.gif
  • cinema-300-50.gif
  • sthirasthi_300-50.gif