Monday, February 08, 2016


Untitled Document
న్యాయస్థానాల తీర్పులను ప్రభుత్వం గౌరవించాలి
రాంపూర్‌, న్యూస్‌టుడే: సర్వోన్నత, ఉన్నత న్యాయస్థానాల తీర్పులను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించి ప్రభుత్వ యాజమాన్యంలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు పర్యవేక్షణాధికారులు, అధ్యాపకులుగా పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు గాజుల రవీందర్‌ పేర్కొన్నారు. కరీంనగర్‌లో ఆదివారం జరిగిన ఆసంఘం జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. జడ్పీ యాజమాన్యంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులను యాజమాన్యంలోకి, ప్రభుత్వ యాజమాన్యంలో పని చేస్తున్న వారిని జడ్పీ యాజమాన్యంలోకి పంపించే చర్యలను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకవచ్చేందుకు ఈ నెల 13న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించే మహాధర్నాలో జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పింగిళి రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ జీవన్మరణ సమస్యపై పోరాడేందుకు ఉపాధ్యాయులు విధిగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా బాధ్యులు సుధాకర్‌, ప్రధానోపాధ్యాయులు సి.హెచ్‌.ప్రభాకర్‌రెడ్డి, ఎంఈవో భగవంతయ్య, ఎం.రాజేందర్‌, సతీష్‌, సంఘం బాధ్యులు తిరుపతి, కె.లక్ష్మిపతి, ఎం.శ్రీనివాస్‌, అరుణ, ప్రభాకర్‌, కె.రమేశ్‌, డాక్టర్‌ బి.వి.ఎన్‌.స్వామి, ఎస్‌.రత్నాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మతోన్మాదానికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలి
భగత్‌నగర్‌, న్యూస్‌టుడే: మతోన్మాదానికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) రాష్ట్ర కార్యదర్శి రావి శివరామకృష్ణ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో జరిగిన కౌన్సిల్‌ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో దళిత విద్యార్థులపై మతోన్మాద శక్తులు దాడులు చేస్తున్నాయన్నారు. హెచ్‌సీయులో రోహిత్‌ ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. తప్పుడు నివేదికలతో విద్యార్థులు బహిష్కరణకు గురయ్యారు. భాజపా కేంద్రంలో అధికారం వచ్చిన తర్వాత దళిత, గిరిజనులు, రచయితలు, కవులపై దాడులు పెరిగాయన్నారు. రోహిత్‌ ఆత్మహత్యపై సర్వోన్నత న్యాయస్థానం సిట్టింగ్‌ న్యాయమూర్తితో విచారణ జరిపించి, మంత్రులను బర్తరఫ్‌ చేయాలని కోరారు. విద్యాసంస్థల్లో కుల వివక్షత, దాడులు, రాజకీయ జోక్యం, వ్యతిరేకంగా రోహిత్‌ పేరుతో ప్రత్యేకమైన చట్టాన్ని పార్లమెంటులో చేయాలని కోరారు. విద్యా కాషాయికరణకు వ్యతిరేకంగా, ప్రైవేటు, కార్పోరేట్‌ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తున్న డబ్లు్యటీవో గాట్స్‌ ఒప్పందాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. దీనికి సహకరిస్తున్న తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మార్కపురి సూర్య, బోనగిరి మహేందర్‌, జిల్లా ఆఫీస్‌ బేరర్స్‌ కసిరెడ్డి మణికంఠరెడ్డి, జె.జనార్దన్‌, డి.శ్రీనివాస్‌, లెనిన్‌ తదితరులు పాల్గొన్నారు.


నిఘా కెమేరాలతో విద్యార్థులను ఆందోళన పర్చవద్దు
రాంపూర్‌: పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో నిఘా కెమెరాల ఏర్పాటుతో విద్యాప్రమాణాలకు వచ్చే ప్రయోజనం ఏమి లేదని, పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఈ విధానంతో విద్యార్థులను ఆందోళనకు గురి చేయవద్దని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు చందూరి రాజిరెడ్డి పేర్కొన్నారు. ఎస్టీయూ భవన్‌లో ఆదివారం జరిగిన ఆసంఘం జిల్లా శాఖ మూడో కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. మూల్యాంకనం, ఇన్విజిలేషన్‌ విధుల్లో ఉపాధ్యాయులుంటే నూతన అకాడమిక్‌ పాఠ్యాంశాలు చెప్పడం ఏలా సాధ్యమన్నారు. రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు నందికొండ విద్యాసాగర్‌, జి.శ్రీనివాస్‌గౌడ్‌లు మాట్లాడుతూ ప్రభుత్వం పుస్తకాలు ముద్రించకుండా, పంపిణీ చేయకుండా నూతన విద్యాసంవత్సరం అమలు సాధ్యమని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేశ్‌, రవీంద్రచారిలు మాట్లాడుతూ కరీంనగర్‌ నియోజకవర్గంలో 2014 సాధారణ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు విధుల నిర్వహణ ధ్రువపత్రాలు అందించాలని కోరారు. ఆరోగ్య కార్డులు, రీఎంబర్స్‌మెంట్‌లు మంజూరు చేయాలన్నారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌రావు, అదనపు ప్రధాన కార్యదర్శి పి.సత్యనారాయణ రావు, కార్యదర్శులు దేవయ్య లక్ష్మణ్‌, బాధ్యుడు సత్యనారాయణ రెడ్డి, కృష్ణప్రసాద్‌, జిల్లా కోశాధికారి ఎన్‌.కిరన్‌కుమార్‌, బాధ్యులు దయాకర్‌, బాలాజీ, కృష్ణ, అశోక్‌, శ్రీనివాసరెడ్డి, ఎన్‌.రమేశ్‌, వెంకట్రాంరెడ్డి, మధుకుమార్‌, చిన్నయ్య, రవి పాల్గొన్నారు.


అంజన్నా.. నీ భూములు కాపాడేదెవరన్నా!
విలువైన స్థలాలు గాలికొదిలేసిన అధికారులు
రాజకీయ ఒత్తిళ్లతో చర్యలు శూన్యం
మల్యాల, న్యూస్‌టుడే: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి చెందిన విలువైన భూములు అన్యాక్రాంతమైనా అధికారులు వాటిని స్వాధీనం చేసుకోవడానికి చర్యలు చేపట్టడంలేదు. కొందరు వ్యక్తులు ఆలయ భూములను ఆక్రమించుకొని దుకాణాల నిర్మించుకున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. కొందరు వ్యక్తులు ఆలయ భూమిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టినా.. పోయింది అంజన్న స్థలమే కదా.. అన్న భావనతో నిర్లక్ష్యంగా వ్యవరించారు. కొండగట్టు అంజన్న ఆలయ భూముల ఆక్రమణపై గతంలో అధికారులు పలుమార్లు సర్వే నిర్వహించినప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వెనక్కితగ్గడంతో ఆక్రమణదారుల హవా నడుస్తోంది.


జిల్లా స్థాయి గ్రామీణ క్రీడల విజేత చెక్కపల్లి
సిరిసిల్ల గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామీణ యువతలో నైపుణ్యం వెలికితీసేందుకు క్రీడా పోటీలు దోహదపడతాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షులు చల్మెడ లక్ష్మీనర్సింహారావు అన్నారు. సిరిసిల్ల మండలం తాడూరులో మూడు రోజుల పాటు స్వామి వివేకానంద జిల్లా స్థాయి గ్రామీణ కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ యువత క్రమశిక్షణ, పట్టుదలతో ఏధైనా సాధించవచ్చన్నారు. జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించి విజయవంతం చేసిన నిర్వహణ కమిటీ సభ్యులను, అధ్యక్షుడు గుర్రం రాజలింగంగౌడ్‌ను అభినందించారు. అనంతరం లీగ్‌మ్యాచ్‌ల్లో ప్రతిభ కనబర్చి మొదటి స్థానంలో నిలిచిన చెక్కపల్లి జట్టుకు రూ.10 వేల నగదు, జ్ఞాపికను, రెండో స్థానంలో నిలిచిన కాటారం జట్టుకు రూ.7 వేలు, మూడో స్థానంలో నిలిచిన భీమదేవరపల్లి జట్టుకు రూ.3 వేలు, నాలుగో స్థానంలో నిలిచిన గంగారం జట్టుకు రూ.2 వేల నగదుతో పాటు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో సహకార శాఖ వరంగల్‌ రిజిస్ట్రార్‌ వి.చక్రధర్‌రావు, కరీంనగర్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ రాజేశ్వర్‌రావు, తహసీల్దార్‌ గంప శంకరయ్య, సీఐ విజయ్‌కుమార్‌, సర్పంచి గుర్రం వెంకటలక్ష్మి, కబడ్డీ అసోసియేషన్‌ కార్యదర్శి సంపత్‌రావు, తిరుపతి, గజభీంకార్‌ రాజన్న, కందుకూరి రామాగౌడ్‌, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


నూతన పోరాటాలకు సిద్ధంగా ఉండాలి
మంకమ్మతోట, న్యూస్‌టుడే: నూతన పోరాటాలకు కార్మికవర్గం సిద్ధంగా ఉండాలని శాతవాహన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ డాక్టర్‌ సూరపెల్లి సుజాత అన్నారు. ఆదివారం పాత్రికేయుల భవనంలో జరిగిన ఇఫ్ట్‌ జిల్లా కౌన్సిల్‌ సమావేశాలకు ఆమె హాజరై మాట్లాడారు. అనేక పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న చట్టబద్ద హక్కులను ఒక్కొక్కటిగా రద్దు చేసే ఆలోచనలో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు స్వదేశీ, విదేశీ బడా కార్పొరేట్‌ సంస్థల ఆర్థిక శక్తుల ప్రయోజనాల కోసమేనన్నారు. ప్రభుత్వ పరిశ్రమలో వాటాలను విక్రయించడం, పెట్టుబడులను ఉపసంహరించడం ద్వారా ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఈ విధానాలను ప్రతిఘటిస్తూ సమరశీల పోరాటాలను ఎంచుకోవడం ద్వారానే పరిశ్రమలను రక్షించుకోగలుగుతామన్నారు. అనంతరం ఇఫ్ట్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కార్మిక వర్గ డిమాండ్లయినా మాతపడిన పరిశ్రమలను పునరుద్ధరించడం, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను క్రమబద్ధీకరించడం, నూతన ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పనకు చర్యలు చేపట్టాలన్నారు. కాని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలకు భిన్నంగా సాగుతుందని విమర్శించారు. పోడు భూముల కోసం ఉద్యమిస్తే రాజద్రోహం, ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఇఫ్ట్‌ జిల్లా అధ్యక్షుడు కె.విశ్వనాథం అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఎ.కృష్ణ, ఆనందం, ఐ.కృష్ణ, ఖాజామోహినోద్దిన్‌, రాజన్న, శంకర్‌, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


అక్షరాస్యతలో అగ్రభాగాన నిలవాలి: ఎంపీ
రాంపూర్‌, న్యూస్‌టుడే: తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, రాబోయే రోజుల్లో వందశాతం అక్షరాస్యతను సాధించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కరీంనగర్‌ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. కరీంనగర్‌ శివారులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో తెలంగాణ కేరళ పాఠశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన స్కూల్‌ ఫెస్ట్‌ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కేరళ నుంచి ఇక్కడికి వచ్చి విద్యార్థులకు మంచి విద్యాబోధన కోసం కృషి చేస్తున్న కేరళ ఉపాధ్యాయుల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారం కోసం తాము అండగా ఉంటామన్నారు. కరీంనగర్‌, పెద్దపల్లి, మంథని శాసనసభ్యులు గంగుల కమలాకర్‌, దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధులు మాట్లాడుతూ నర్సింగ్‌, విద్యాబోధన సేవల్లో కేరళ వాసులు ఇక్కడి వారికి ఉత్తమ సేవలు అందిస్తున్నారని చెప్పారు. తెలంగాణ కేరళ పాఠశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు అంథోని, ప్రధాన కార్యదర్శి సుదేశ్‌ రవీంద్రన్‌లు మాట్లాడుతూ నాణ్యమైన విద్యను ఇక్కడి విద్యార్థులకు అందించి ఈప్రాంతాన్ని విద్యారంగంలో అగ్రభాగాన నిలుపడంలో కేరళ పాఠశాలలు, ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మేయర్‌ సర్ధార్‌ రవీందర్‌ సింగ్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎంపీపీ వి.రమేశ్‌, కార్పొరేటర్‌ పెద్దపల్లి రవీందర్‌, తెరాస నాయకులు సుదర్శన్‌, జె.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కేరళ ఫెస్ట్‌ సందర్భంగా విద్యార్థులు ఆప్రాంత కట్టు, బోట్టు వేషధారణలతో చేసిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


క్రమశిక్షణతోనే బంగారు బాటలు
అల్గునూర్‌,న్యూస్‌టుడే : విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రమశిక్షణ అంతే ముఖ్యమని, క్రమశిక్షణతోనే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని జ్యోతిష్మతి కళాశాల ఛైర్మన్‌ జువ్వాడి సాగర్‌రావు అన్నారు. తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణకాలనీలోని జ్యోతిష్మతి యంత్ర కళాశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కళాశాలలో 1997 నుంచి ఇప్పటి వరకు ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని గత స్మృతులను నెమరువేసుకున్నారు. గతంలో జరిగిన సంఘటనలను, మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. కళాశాల ఛైర్మన్‌ సాగర్‌రావు మాట్లాడుతూ.. పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులకు ఆదర్శంగా ఉండి మార్గదర్శనం చేయాలన్నారు. వీలైనంత మేర సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని సమాజానికి తమ వంతు సేవ చేయాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ వెంకట్రావు, ప్రిన్సిపల్‌ ఏ.ఆర్‌ నసీర్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ బుగ్గారావు, ఆయా విభాగాధిపతులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.


ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో బహుమతుల ప్రదానం
కరీంనగర్‌ క్రీడలు, న్యూస్‌టుడే: ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగంటి అనిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన జట్లకు ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బహుమతులు అందజేశారు. జిల్లా డీసీసీ కార్యాలయంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్‌లు హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. సాహితి సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటే అనేక సాంకేతిక అంశాలపై పట్టు సాధించవచ్చని చెప్పారు. ఎన్‌ఎస్‌యూఐ నాయకులు జిల్లా స్థాయి క్రీడాపోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ, పెద్దపల్లి జితేందర్‌, పులి కృష్ణ, క్రాంతి, సాయిదీలిప్‌, రూప్‌సాయి తదితరులు పాల్గొన్నారు.


ప్రభుత్వ వైద్య కళాశాలకు ప్రతిపాదనలు
వెయ్యి పడకలతో బోధనాసుపత్రి, నర్సింగ్‌ కళాశాల!
సీఎంతో మాతా శిశుసంరక్షణ వార్డు ప్రారంభానికి సన్నాహాలు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం
జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు విషయంలో అధికారులు మళ్లీ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాకు మొదటిసారిగా పర్యటనకు వచ్చినప్పుడు కరీంనగర్‌లో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు అది అమలుకాలేదు. ప్రభుత్వం మొదటి దశ కింద మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదించి మొదట మహబూబ్‌నగర్‌లో ప్రకటించారు. నల్గొండలోనూ ఈ ఏడాది ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండో దశ కింద 2017లో ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో ప్రకటిస్తారని అధికారవర్గాల సమాచారం. ఈ మేరకే రెండు నెలల కిందట కరీంనగర్‌లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన వనరులతో కూడిన ప్రతిపాదనలు సిద్ధంచేసి పంపించారు. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన జడ్పీ స్థాయీ సంఘ సమావేశంలో వైద్య విధాన పరిషత్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ ప్రకటించారు. కళాశాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పంపిన ప్రతిపాదనలో భాగంగా శాతవాహన పీజీ కళాశాల పాత స్థలం 40 ఎకరాలను వినియోగించుకోవచ్చని ప్రతిపాదనలో సూచించారు. ఇతర ఏర్పాట్ల గురించీ ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు అవుతున్న ఆశలు వ్యక్తమవుతున్నాయి..

వేయి పడకలతో బోధనాసుపత్రి
ప్రస్తుతం కరీంనగర్‌ ప్రధాన ఆస్పత్రి 350 పడకలతో కొనసాగుతోంది. మరో 150 పడకల భవనం కూడా సిద్ధమవుతోంది. ఈ 500కు తోడు మరో 500 పడకల ఆస్పత్రిని మొత్తం వెయ్యి పడకల ఆస్పత్రిగా కరీంనగర్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ ఆస్పత్రి ఏర్పాటు జరిగితే అత్యంత అధునాతన సౌకర్యాలతోపాటు 15 మంది సూపర్‌ స్పెషాలిటీ వైద్య నిపుణులు వచ్చే అవకాశం ఉంది. ఈ ఆస్పత్రినే వైద్య కళాశాలకు బోధనాసుపత్రిగా వినియోగించుకోవచ్చని రెండు నెలల కిందట ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలో పేర్కొన్నారు.

నర్సింగ్‌ కళాశాల
కరీంనగర్‌లో ప్రస్తుతం నర్సింగ్‌ స్కూల్‌ మాత్రమే ఉంది. జిల్లాలో ప్రభుత్వపరంగా జగిత్యాలలోనే నర్సింగ్‌ కళాశాల కొనసాగుతోంది. వైద్య కళాశాలకు అనుబంధంగా నాలుగేళ్ల కోర్సుతో కూడిన గ్రాడ్యుయేట్‌ నర్సింగ్‌ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. ఈ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోనే స్థలాన్ని కేటాయిస్తామని ప్రతిపాదనలో సూచించారు.

ప్రారంభానికి సిద్ధం
150 పడకలతో కూడిన మూడు అంతస్థులు గల మాతా శిశు సంరక్షణ భవన కేంద్రం మార్చి నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధుల ద్వారా ఆహ్వానింపజేసి దీన్ని ప్రారంభోత్సవం చేయించాలని జిల్లా వైద్యవిధాన పరిషత్‌ అధికారులు భావిస్తున్నారు. గత కేంద్ర ప్రభుత్వం మంజూరుచేసిన రూ.20 కోట్ల నిధులతో ఈ భవనాన్ని పూర్తి చేశారు. ఆధునిక వసతులతో కూడిన ఈ భవనంలో ప్రసవాలు, మాతా శిశు సంరక్షణ సౌకర్యాలు, వైద్య సౌకర్యాలను కల్పించనున్నారు.

సింగరేణి ఆస్పత్రిపై ఆశలు
హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న ఉస్మానియా, గాంధీ, కింగ్‌కోఠి ఆస్పత్రుల మాదిరిగానే మరో రెండు పెద్ధ ఆస్పత్రులను నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. అందులో సింగరేణి కార్మికుల కొరకు కోల్‌బెల్ట్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలని ఈ నెల 5న ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గోదావరిఖనిలో ఆస్పత్రిని ఏర్పాటు చేస్తారన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ మొదటి పర్యటనకు వచ్చినప్పుడు సింగరేణి సంస్థ సహకారంతో గోదావరిఖనిలో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని ప్రస్తుతం ఉన్న ఆస్పత్రిని నిమ్స్‌ తరహాలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకే గోదావరిఖనిలో వేయి పడకల ఆస్పత్రి ఏర్పాటుపై ఆశలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల సరిహద్దుగా గోదావరిఖని కోల్‌బెల్ట్‌ కేంద్రంగా ఉండడం దీనికి దోహదపడుతోంది..

ప్రతిపాదనలు పంపాం..
వైద్య కళాశాల, నర్సింగ్‌ కళాశాల, వెయ్యి పడకల ఆస్పత్రి వంటి వాటి విషయంలో ప్రభుత్వానికి రెండు నెలల క్రితమే ప్రతిపాదనలు పంపామని వైద్య విధాన పరిషత్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తామని వివరించారు.నేతన్నల ఉపాధిపై ‘ముద్ర’ కరవు
లక్ష్యం 1300.. దరఖాస్తులు 772
పరిశీలనలో మరో వంద దరఖాస్తులు
న్యూస్‌టుడే, సిరిసిల్ల: జిల్లాలోని మరమగ్గాలు(పవర్‌లూం) కార్మికులు, ఆసాముల ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా జిల్లా అధికార యంత్రాంగం ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. 1300 కుటుంబాలకు ఈ ప్రయోజనాన్ని వర్తింపజేయాలని జిల్లా పాలనాధికారి ఆధ్వర్యంలో జరిగిన బ్యాంకర్లు, అధికారుల సమావేశంలో నిర్ణయించారు. అయినప్పటికీ ఇప్పటివరకు 772 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇందులో అర్హులెందరనేది పరిశీలనలో తేలనుంది. దీంతో పాటు మరో వంద దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో పెట్టుబడి కోసం వచ్చిన దరఖాస్తుల్లో 80 శాతం ఉన్నాయి. మిగిలిన దరఖాస్తులు మరమగ్గాల కొనుగోళ్లు, ఆధునికీకరణ కోసం ఉన్నాయి. లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అధికారులు తంటాలు పడుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో అర్హులైన వారు ఎందరుంటారని కూడా తేల్చడం ప్రధాన సమస్యగా ఉంది.

ముద్ర యోజన కోసం దరఖాస్తులు చేసుకోవాలని సిరిసిల్ల వస్త్రోత్పత్తి కేంద్రంతో పాటు చంద్రంపేట, తంగళ్లపెల్లి, రాజీవ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో మైకుల ద్వారా అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రావడం లేదు. దాదాపు 3 వేల మంది దరఖాస్తులు చేసుకుంటే అందులో 1300 మంది కార్మిక కుటుంబాలు ఆసాములు అర్హులుగా తేలుతారనే అభిప్రాయంతో అధికారులున్నారు. ముద్ర యోజన కింద దరఖాస్తులు విపరీతంగా వస్తాయని అనుకున్నప్పటికీ అనేక కారణాల వల్ల లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. దరఖాస్తుతో పాటు దాదాపు 14 రకాల ధ్రువీకరణ పత్రాలు జత చేయాలని నిబంధనలో పేర్కొనడం సమస్యగా మారింది. ఇందులో ఒకటి రెండింటిని మినహాయించినప్పటికీ స్పందన లేదు.

రుణమాఫీ అమలు లేక 876 మంది అనర్హులు
మరమగ్గాల కార్మికులకు వ్యక్తిగత రుణాల మాఫీకి 876 మంది కార్మికులను గుర్తించారు. ఇందుకోస రూ.3.76 కోట్లు కేటాయించారు. అయినప్పటికీ బ్యాంకర్ల నిబంధనల వల్ల ఇది అమలుకు నోచుకోలేదు. దీంతో 876 కుటుంబాలు ముద్ర రుణాలకు అర్హత కోల్పోయారు. ఇప్పటికీ బ్యాంకుల్లో వాయిదా మీరిన అప్పులే ఉండటంతో వీరు అర్హులు కాలేకపోతున్నారు. ఇప్పటికీ రుణమాఫీ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు, సవరణ ఉత్తర్వు కూడా జారీ చేసింది. జిల్లా స్థాయిలో బ్యాంకర్ల సమావేశం కూడా జరిగింది. రాష్ట్ర స్థాయిలో బ్యాంకర్ల సమావేశం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. త్వరితగతిన రుణమాఫీ జరిగితే కొత్త రుణాలు పొందడానికి మరమగ్గాల కార్మికులు, ఆసాములు అర్హత పొందుతారు. ఇది ప్రధాన సమస్యగా మారింది. రుణమాఫీ కోసం చాలా కాలంగా కార్మిక కుటుంబాలు నిరీక్షిస్తున్నాయి. ఇది అమలులోకి వస్తే అనేక కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది.నాకూ బతకాలని ఉంది..
కిడ్నీలు చెడిపోయి మంచంపట్టిన మౌనిక
ఖరీదైన వ్యాధితో 13 నెలలుగా మౌనవేదన
హుజూరాబాద్‌, న్యూస్‌టుడే: ‘బాగా చదువుకోవాలని ఉంది. మంచి ఉద్యోగం చేసి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలని ఉంది. ఆ దేవుడు నాకీ రోగాన్ని ఇచ్చాడు. మంచానికే పరిమితం చేశాడు. నేనేం పాపం చేశానో అర్థం కావడం లేదు’ అని ఆమె కుమిలిపోతోంది. రెండు కిడ్నీలూ పనిచేయక మరణానికి చేరువవుతోంది.

హుజూరాబాద్‌కు చెందిన జక్కుల సమ్మయ్య-కోమల దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. పెద్ద కూతురు మౌనిక(21) స్థానిక కళాశాలలో డిగ్రీ(బీపీసీ) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అప్పుడప్పుడు ఆరోగ్యం బాగోలేకపోతే తల్లిదండ్రులు స్థానిక వైద్యులకు చూపించేవారు. మందులు వేసుకుంటే తగ్గిపోతుందని వైద్యులు చెబితే సంతోషించింది. ఖరీదైన వ్యాధి వచ్చిందని మాత్రం వూహించలేదు. 05.01.2015న వరంగల్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా, రెండు కిడ్నీలు చెడిపోయాయని వైద్యులు నిర్ధారించారు. మౌనిక తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. వారానికి రెండుసార్లు డయాలసిస్‌(రక్తశుద్ధి) చేస్తే తప్ప మౌనిక బతకదని వైద్యులు తేల్చి చెప్పారు. 13 నెలలుగా రక్తశుద్ధి చేయిస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు రూ.6 లక్షలకుపైగా ఖర్చు చేశారు. సమ్మయ్య హమాలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆస్తిపాస్తులేమీ లేవు. అందినకాడల్లా అప్పులు చేసి కూతురు వైద్యానికే ఖర్చు చేశాడు. ఇక చేతిలో చిల్లిగవ్వ లేదు. మౌనిక ఆరోగ్యం మాత్రం రోజురోజుకు క్షీణిస్తోంది. ఈ పరిస్థితుల్లో తొందరగా కిడ్నీ మార్పిడి చేస్తే మంచిదని వైద్యులు సూచించారు. అందుకు సుమారు రూ.20 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. అంత డబ్బు ఖర్చు చేసి కిడ్నీ మార్పిడి చేయించే స్తోమత తల్లిదండ్రులకు లేదు. తన తల్లి కోమల తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చినా ఆమె వికలాంగురాలు. రెండు కాళ్లు సరిగ్గా పనిచేయవు. ఆమె కిడ్నీ పనిచేయదని వైద్యులు నిర్ధారించారు. తమ కూతురిని ఎలా కాపాడుకోవాలో తెలియక తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మంచానికి పరిమితమైన మౌనిక పరిస్థితి చూస్తూ తల్లడిల్లిపోతున్నారు. తమ కూతురు వైద్య చికిత్సలకు సాయం చేయాలని ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేశారు. అక్కడినుంచి ఇంకా ఎలాంటి జవాబు రాలేదు. మరోవైపు కిడ్నీ మార్పిడి చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధాతలు స్పందించి తనకు ప్రాణభిక్ష పెట్టాలని మౌనిక చేతులు జోడించి వేడుకుంటుంది.


పట్టుదలతోనే ఉద్యోగ సాధన
మార్కండేయకాలనీ: పట్టుదల ఉంటే ఏ ఉద్యోగమైనా సాధించవచ్చని గోదావరిఖని ఒకటో పట్టణ సీఐ వెంకటేశ్వర్‌ అన్నారు. గోదావరిఖనిలోని ఇండియన్‌ ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ శిక్షణ కేంద్రంలో ఆదివారం కానిస్టేబుల్‌ అభ్యర్థులకు
ఉచితంగా నమూనా రాత పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ శిక్షణ కేంద్రం నిర్వాహకులు శివకృష్ణ, సాయిచరణ్‌ మాట్లాడుతూ పోటీ పరీక్షలను ఎప్పటికప్పుడు నిర్ణయించిన సమయాన్ని పెట్టుకుని ప్రతి అభ్యర్థి
రాత పరీక్షలు రాస్తే ఉద్యోగ ఎంపిక పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంటుందన్నారు.


పరిశోధనకు.. మార్గదర్శనం
శాతవాహన విశ్వవిద్యాలయంలో జాతీయ కార్యశాల
న్యూస్‌టుడే, శాతవాహన యూనివర్సిటీ
పరిశోధన ఒక సవాలు.. ఎంచుకున్న అంశంలో ప్రత్యేకత చాటాలి. తరగతి గదిలో పాఠాలు వింటే సరిపోదు. పరిశోధన పత్రం రూపకల్పనే పెద్ద పరీక్ష.. దానికి అనుసరించాల్సిన క్రమానుగతం, గణాంక సేకరణ, విశ్లేషణ, క్రోడీకరణకు ఎంతో ఓర్పు నేర్పు అవసరం. అందుకు నిపుణుల సలహాలు, మార్గదర్శకాలు వాటి అనుభవాలు తోడైతే పరిశోధన పట్టాలెక్కుతుంది. గమ్యం చేరుతుంది. అందుకు ప్రత్యేక శిక్షణ అవసరం. ప్రస్తుతం ఆ బాధ్యతను శాతవాహన విశ్వవిద్యాలయం సామాజిక శాస్త్రం విభాగం నిర్వహిస్తోంది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ రీసెర్చ్‌, న్యూదిల్లీ సహకారంతో పరిశోధన విద్యార్థులకు ఈనెల 3 నుంచి సోషల్‌ సైన్స్‌లో పరిశోధన పద్ధతులపై పది రోజుల శిక్షణ కొనసాగిస్తోంది. సాంఘికశాస్త్రంలో వివిధ భాగాలను అధ్యయనం చేస్తున్న పరిశోధక విద్యార్థులను ‘న్యూస్‌టుడే’ పలకరించింది.

12 విశ్వవిద్యాలయాలు 34 మంది విద్యార్థులు
శాతవాహనలో జరుగుతున్న కార్యశాలలో దేశంలోని 21 విశ్వవిద్యాలయాల నుంచి 150 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. తుదకు 12 విశ్వవిద్యాలయాల నుంచి 34 మందిని ఎంపిక చేశారు. పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ, లా, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, జర్నలిజం, మేనేజ్‌మెంటు, సోషల్‌ వర్క్‌, ఎకనామిక్స్‌, రూరల్‌ మేనేజ్‌మెంటు, థియేటర్‌ ఆర్ట్స్‌, కామర్స్‌ వంటి 12 సబ్జెక్టుల్లో పరిశోధన పద్ధతులపై తర్ఫీదు పొందుతున్నారు. పరిశోధన విద్యార్థులకు కీలకమైన మెథడాలజీ జాతీయ స్థాయి కార్యశాలకు ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు ఎంపికై లబ్ధి పొందుతున్నారు. హెచ్‌సీయూ, సెస్‌, టిస్‌, అజీం ప్రేమ్‌జీ, కాకతీయ, ఉస్మానియా, శాతవాహన, తెలంగాణ వంటి విశ్వవిద్యాలయాల నుంచి నిపుణులు పరిశోధన పద్ధతులపై తమ మార్గదర్శనం అందిస్తున్నారు.

విశ్లేషణ పద్ధతులపై వివరణ
ఎ.సోమేశ్వర్‌ రావు, ఆంధ్రా విశ్వవిద్యాలయం
అర్థశాస్త్రంలో పీహెచ్‌డీ విద్యార్థిగా ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది. కార్యశాలలో ఆచార్యుల సలహాలు మా కెరీర్‌కు ప్రయోజనకరంగా ఉన్నాయి. అర్థశాస్త్ర పరిశోధనకు గణాంకాలే కీలకం. వాటిని సేకరించడంలో క్షేత్ర స్థాయిలో అనుసరించే పద్ధతులను వివరిస్తున్నారు. అన్నింటికంటే సేకరించిన సమాచారాన్ని విశ్లేషించే పద్ధతిపై సంపూర్ణ అవగాహన లభించింది. ప్రత్యేకంగా నాకు విశ్లేషణ విధానంపై అనేక సందేహాలు ఉండేవి. ఇప్పుడు ఒక స్పష్టత వచ్చింది. నిపుణులంతా ఒక్కచోట చేరి విలువైన సమాచారం అందిస్తున్నారు. ‘గిరిజనులపై ఇందిరా క్రాంతి పథం’ ప్రభావంపై నా పరిశోధన సాగుతోంది. ప్రజలతో మమేకమై సందేశాత్మక పరిశోధన పత్రం సమర్పించాలనే లక్ష్యం నాది.

ప్రభుత్వం గుర్తించాలి : పరిశోధన విద్యార్థుల సమర్పించే విషయాలను పాలకులు అధ్యయనం చేయాలి.. అందులోని విషయాలను గుర్తించి ప్రజల కష్టాలను తొలగించేందుకు ఉపయోగించుకోవాలి. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టే పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకునే అవగాహన రావాలి.

మార్కెట్‌ స్పందనపై స్పష్టత - ఎ.డి మానవి, పాండిచ్చెరి విశ్వవిద్యాలయం
వినియోగదారులు సంతృప్తి చెందితేనే మార్కెలో కంపెనీల మనుగడ.. ఇదే అంశంపై పరిశోధన చేస్తున్నా.. మేనేజ్‌మెంట్‌ విద్యార్థిగా ప్రజల జీవన విధానాలపై ఒక స్పష్టత అవసరం. ఇక్కడ అనుసరించే పద్ధతి, వినియోగదారులను సంప్రదించి వారి నుంచి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడంపై సందేహాలు ఉండేవి. కంపెనీలు వినియోగదారుల ఆదరణ పొందాలంటే వారి స్పందన గుర్తించాలి. మార్కెట్‌లో లభించే వస్తువులపై అన్ని వర్గాల స్పందన తెలుసుకునేందుకు కావాల్సిన అవగాహన లభించింది. బిజినెస్‌ ఫిర్మ్స్‌ లెవల్‌ ఆఫ్‌ సాటిస్‌ఫాక్షన్‌ ఆఫ్‌ కస్టమర్‌ ది ఎక్స్‌ప్రెస్‌ ఇండస్ట్రీ అనే అంశంపై పరిశోధన సాగుతోంది. ప్రస్తుత తరుణంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ పెరిగింది. అందులో అనుసరించాల్సిన వైఖరి, మెరుగైన సేవలపై అధ్యాయనం చేయాలని ఉంది..

సేవే మార్గం:
ఆన్‌లైన్‌ అమ్మకాల్లో మెరుగైన సేవలతోనే ఆదరణ లభిస్తోంది.. అందుకే పారదర్శకత, భద్రత ఇవ్వడంతో వినియోగదారుడు సంతృప్తి పొందే అవకాశం ఉంది. అలాగే వినియోగదారుల్లో అవగాహన అవసరం.

అనుభవాలే పాఠాలు
జి.మనీషా, ఉస్మానియా విశ్వవిద్యాలయం
పీహెచ్‌డీలో ప్రవేశం తీసుకున్నా.. మొదట పరిశోధనపై పెద్దగా దృష్టి సారించలేదు. ప్రాధాన్యతను గుర్తించలేక పోయా. ఇక్కడికి వచ్చాక స్పష్టమైన లక్ష్యం ఏర్పడింది. ‘మహిళా సాధికారత’ అనే అంశంపై పరిశోధన చేయాలని ముందే అనుకున్నా.. కావాల్సిన సమాచార సేకరణ క్రమానుగత పద్ధతి గురించి నిపుణులు అనుభవాలను వివరించారు. అవే మాకు పాఠాలు. వందకు వంద శాతం ఉపయోగకరమైన ప్రభుత్వ శిక్షణ. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. ఇంకా అసమానతకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి అక్కడి స్థితి, గతులను తెలుసుకోవాల్సి ఉంది. పనిలో పనిగా వారిని చైతన్యవంతులను చేస్తాం.

ఆసక్తిని గమనించాలి : మహిళలు రాణించాలంటే మొదట వారి ఆసక్తిని గమనించండి. అప్పుడే వారు ఎంచుకున్న రంగంలో అద్భుతాలు సృష్టిస్తారు. ప్రభుత్వ పరంగా అధికారం, ఆర్థిక భరోసా కల్పిస్తూ సమానత్వ హోదాను అందివ్వాల్సి ఉంది.

శాస్త్రీయ అధ్యయనంపై అవగాహన: - యావర్‌ గుల్జార్‌, హెచ్‌సీయూ
మాది జమ్ముకాశ్మీర్‌ హెచ్‌సీయూలో పొలిటికల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ ప్రవేశం పొందా. సంకీర్ణ రాజకీయాలపై పరిశోధన చేయాలని ఉంది. 2002 నుంచి జమ్ము, కాశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితుల వరకు రాజకీయాలను అధ్యయనం చేసే పనిలో ఉన్నా. ప్రస్తుత తరుణంలో ఏ రాజకీయ పక్షం సంపూర్ణ మెజారిటీని సాధించే పరిస్థితి లేదు. ఒక వేళ సాధించినా అది మొత్తం ఓటర్లలో 50 శాతం కూడా మద్దతు ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో సంకీర్ణ రాజకీయాల పాత్ర పెరుగుతోంది. అయితే సాంఘికశాస్త్రాన్ని శాస్త్రీయంగా రుజువు చేయడం ఒక సవాలు. రాజనీతి విషయాలను గణితశాస్త్రంగా వివరించాలి. అందుకు కావాల్సిన నైపుణ్యతను కార్యశాల నాకిచ్చింది. విస్తృత పరిధి గల సబ్జెక్టును పరిశోధనకు సరిపడేలా ఎంపిక చేసుకుని సమాచార సేకరణతో పాటు ఓటర్ల అభిప్రాయాలు, ఎన్నికల ఫలితాలకు ముడి పెట్టి విశ్లేషణ చేసే పద్ధతులను తెలుసుకున్నాం.

సంకీర్ణమే ఉత్తమం
ప్రస్తుత పరిస్థితుల్లో భావ సారూప్యం గల పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంతో ప్రజలకు మెరుగైన పాలన అందుతోంది. దశాబ్ద కాలంలో చక్కని ఫలితం వస్తోంది. ఇక్కడ సుస్థిర పాలనకు ఎక్కువ అవకాశం ఉండాలి.

పద్ధతులే పరిశోధనకు వెన్నెముక: తాహీద్‌, కర్ణాటక విశ్వవిద్యాలయం
అర్థశాస్త్రం విద్యార్థిగా ఆపిల్‌ ఉత్పత్తి, ఎగుమతి ఉపాధి అవకాశాలు - జమ్ముకాశ్మీర్‌ అనే అంశం తీసుకొని పరిశోధన సాగిస్తున్నా. ప్రవేశాల నుంచి పత్ర సమర్పణ వరకు అనుసరించే పద్ధతులే (మెథడాలజీ) వెన్నుముక. అలాంటి పద్ధతులను బోధించి మాలో సందేహాల నివృత్తి చేస్తున్నారు. సబ్జెక్టు ఏదైనా పరిశోధన పద్ధతులు అవసరమే.. బృంద చర్చలు, ఒకరి ప్రశ్నలకు విభిన్న సమాధానాలు.. వాటిపై వివరణతో పూర్తి స్థాయిలో కావాల్సిన విషయం లభిస్తోంది. అంతేకాకుండా విభిన్న రాష్ట్రాలు, వేర్వేరు విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులంతా ఒక్కచోట చేరి అభిప్రాయ వ్యక్తీకరణ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది.

ఆర్థిక స్థితి మారాలి :
ప్రజల జీవన శైలి మారడంతో ప్రమాణాలు పెరిగినట్లు కాదు. పేదల ఆర్థిక స్థితి మారాల్సి ఉంది. అప్పుడే దేశం మరింత ప్రగతి సాధిస్తోంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలను విస్తరించడంలో ప్రభుత్వాలు మరింత కృషి చేయాల్సి ఉంది.రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్త జనం
వేములవాడ, న్యూస్‌టుడే: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకొని వెళ్లడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కొద్ది రోజులుగా రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం దాదాపు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో మహాలఘుదర్శనం ఏర్పరిచారు. ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి రూ.16 లక్షల ఆదాయం సమకూరింది. ఆలయంలో వసతులు కరవై భక్తులు ఇబ్బందులు పడ్డారు. సోమవారం స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ఆదివారం రాత్రి వేములవాడ చేరుకున్నారు.


భర్త కిరాతకం
అదనపు కట్నం కోసం భార్య, కుమారుడిని గొంతునులిమి హత్య చేసిన వైనం
మృతురాలు అయిదు నెలల గర్భిణి
చొప్పదండి,న్యూస్‌టుడే: కంటికి రెప్పలా కాపాడాల్సిన ఇంటి పెద్దనే కిరాతకుడిగా మారాడు.. అదనపు కట్నం కోసం వారి గొంతు నులిమి హత్య చేశాడు. తనకే పాపం తెలియదన్నట్లు నటిస్తూ బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషాద ఘటన ఆదివారం చొప్పదండి మండలం చాకుంట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. చాకుంట గ్రామానికి చెందిన నీలం రమేష్‌(32)కు కొలిమికుంట గ్రామానికి చెందిన అనిత(25)తో మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. రూ.10లక్షల కట్నం, పదితులాల బంగారం, కానుకలు ఇచ్చేందుకు అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. వివాహ సమయంలో రూ.5లక్షల కట్నం, బంగారం, ఇతర కానుకలు ఇచ్చారు. కొంతకాలం సంసారం సాఫీగా జరిగాక ఏడాది క్రితం బాబు చరణ్‌తేజ(చెర్రి) జన్మించిన అనంతరం మిగిలిన రూ.5లక్షల కట్నం కావాలని శారీరకంగా వేధించడంతో బాబు బారసాల రోజు బంధువుల సమక్షంలో పూర్తి కట్నం అందించారు. మళ్లీ కొద్ది రోజుల తర్వాత విద్యుత్తు సహాయకుడిగా పనిచేసే తన తండ్రి నారాయణ అనారోగ్యంగా ఉండటంతో స్వచ్ఛంద విరమణతో తన తండ్రి ఉద్యోగం తనకు వస్తుందని ఖర్చుల కోసం మరింత కట్నం తీసుకురావాలని భర్త రమేష్‌, అత్తమామలు కనుకమ్మ, నారాయణ, మరిది వెంకటరమణ, భర్త అమ్మమ్మ వెంకమ్మలు తనను తీవ్రంగా వేధిస్తున్నారని అనిత తల్లిదండ్రులకు తెలపడంతో డబ్బులకు బదులు 14గుంటల భూమిని అత్త కనుకమ్మ పేరున రిజిస్ట్రేషన్‌ చేయించారు. భూమి ఇచ్చాక కూడా మరింత కట్నం కావాలని వేధించడంతో పాటు ఈనెల 4న గురువారం కుమారుడు చరణ్‌తేజ పుట్టినరోజు వేడుకలలో అనిత బంధువుల సమక్షంలోనే అత్తమామలు గొడవ చేయడంతో పాటు భర్త చేయిచేసుకున్నాడు. శనివారం సాయంత్రం కట్నం విషయమై గొడవ కావడంతో అనిత పుట్టింటి వారికి సమాచారం ఇచ్చింది. ఆదివారం ఉదయం ఇంటికి రావాలని సూచించారు. రాత్రి పడుకున్నాక కట్నం విషయంలో కోపంతో మంచంలో పడుకున్న భార్యను, కుమారుడిని గొంతునులిమి హత్యచేశాడు. కేసును తప్పుదోవ పట్టించేందుకు హత్య అనంతరం ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగి ఇంటికి తాళం వేసి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఆదివారం ఉదయం పుట్టింటికి వస్తానని తెలిపిన అనిత చరవాణి స్విచ్‌ఆఫ్‌ రావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్న సమయంలో అనితను, చరణ్‌తేజను హత్యచేసి ఇంటికి తాళం వేసి రమేష్‌ చొప్పదండి శివారులో బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించాడని తెలియడంతో చాకుంటలో ఇంటితాళం పగల గొట్టి చూడగా మంచంలో ఇద్దరు శవాలుగా పడి ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న మృతురాలి బంధువులు తన కూతురు, మనవడి హత్యకు కారకులైన వారిని ఇక్కడికి తీసుకువచ్చే వరకు శవాలను ఇంట్లోంచి తీయనీయకుండా ఇంటి ముందు తీవ్ర రోదనలతో ఆందోళన నిర్వహించారు. వలయాధికారి లక్ష్మిబాబు, ఎస్సై రవీందర్‌లు చేరుకుని సంఘటన స్థలంలోని ఆధారాలను సేకరించి పోస్ట్‌మార్టం నిమిత్తం కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్యను, కుమారుడిని హత్య చేసిన భర్తను పోలీసులు విచారించగా భార్యపై అనుమానంతో హత్య చేసినట్లు పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం అయిదు నెలల గర్భిణిగా ఉన్న తన చెల్లి అనిత, చరణ్‌తేజను హత్యకు కారకులైన భర్త, అత్తమామలు, మరిది, భర్త అమ్మమ్మలను చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని మృతురాలి అన్నయ్య చొక్కాల అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు.


మామిడి తోట దగ్ధం.. రూ.12 లక్షల ఆస్తి నష్టం
ఎల్లారెడ్డిపేట, న్యూస్‌టుడే: ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌ శివారులో మామిడి తోటకు ఆదివారం ప్రమాదవశాత్తు నిప్పంటుకోగా దాదాపు రూ.12 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. స్థానికుల కథనం ప్రకారం మొడుసు రాజిరెడ్డి తనకున్న 1.10 ఎకరాల విస్తీర్ణంలో ఎనిమిదేళ్ల కిందట మామిడి మొక్కలు నాటాడు. బిందు సేద్యం ద్వారా వాటికి నీరందిస్తుండగా ప్రస్తుతం చెట్లు పూత దశలో ఉన్నాయి. ఆదివారం ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో మంటలు దావానంలా వ్యాపించాయి. 253 మామిడి చెట్లు, మోటారు, విద్యుత్తు తీగలు, బిందు సేద్యానికి సంబంధించిన పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. పక్క పొలం రైతులు మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.


ఇంట్లోకి దూసుకెళ్లిన కారు: నలుగురికి గాయాలు
ధర్మపురి గ్రామీణం: ధర్మపురిలోని లక్ష్మీనరసింహా కాలనీ వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న ఆనందాస్‌ లక్ష్మీనర్సు ఇంట్లోకి కారు దూసుకెళ్లి బోల్తా పడింది. స్థానికుల సమాచారం మేరకు వివరాలివి.. కోరుట్లకు చెందిన నారంభట్ల శ్రీధర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి గూడెం దేవస్థానానికి వెళ్లి వస్తుండగా తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నారంభట్ల శ్రీధర్‌ (35), ప్రణిత (32), పిల్లలు హాసిని (8) కార్తీక్‌ (6) గాయపడ్డారు. ఇంట్లోనే ఆరు బయట బీడీలు చేసుకుంటున్న లక్ష్మీనర్సుకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారు ఒక్క సారిగా దూసుకెళ్లడంతో ఇంటి ముందర ఉన్న రేకుల షెడ్డు పూర్తిగా కూలిపోయింది.


మనసున్న మారాజులు సమాజ హితమే
అభిమతంగా యువోద్యోగి సేవాభావం
మెట్‌పల్లి పట్టణం, న్యూస్‌టుడే: తాను కష్టపడి సంపాదించిన దానిలో ఎంతో కొంత ఇతరులకు సాయం చేయాలనే ఆలోచన చిరు వ్యాపారి మనసులో వచ్చింది. తన ఆలోచనకు కార్యరూపమిచ్చి ఎంతో మందికి దాహాన్ని తీర్చుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడా వ్యాపారి. మెట్‌పల్లి పట్టణంలోని సుల్తాన్‌పురకు చెందిన అబ్దుల్‌ రహీం 30 ఏళ్ల నుంచి పట్టణంలోని కూరగాయల మార్కెట్‌ సమీపంలో బజ్జీల విక్రయం ద్వారా చిరు ఉపాధి పొందుతున్నాడు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు బజ్జీలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ప్రతి మంగళవారం మార్కెట్‌ కావడంతో వందల సంఖ్యలో ప్రజలు, రైతులు, అమ్మకం దారులు వస్తుంటారు. దీంతో ఎంతో మంది ఇక్కడి వీధిలో తిరుగుతుంటారు. ఈ వీధిలో పలు బంగారు దుకాణాలు, కిరాణ దుకాణాలున్నాయి. ఇక్కడకు వచ్చిన వారికి నీటి కటకట ఎదురయ్యేది. కూరగాయల విక్రేతలకు నిత్యం నీటి కష్టాలే. గత కొన్నేళ్లుగా వారి ఇబ్బందులను గమనిస్తున్న రహీం చలించి పోయాడు. వెంటనే రూ.1.40లక్షలు వెచ్చించి బోరు వేయించాడు. నీటి నిల్వకు ప్రత్యేక ట్యాంకును నిర్మించి, పైపులైన్‌ వేసి ఆరు కుళాయిలు ఏర్పాటు చేసి మార్కెట్‌కు వచ్చే వారి దాహార్తి తీరుస్తున్నాడు. నిత్యం బజ్జీలు అమ్ముతూ కష్టపడి సంపాదించిన డబ్బులో కొంతైన ఇతరులకు సాయం చేయాలనే ఆలోచనతో రహీం ఆదర్శంగా నిలుస్తున్నాడు. మండుతున్న ఎండలకు బోర్లలో నీరు అడుగంటి పోతున్న సమయంలో ఇలా బోరు వేసి తాగునీరందిస్తున్న రహీంను అందరూ అభినందిస్తున్నారు.

ఇబ్రహీంపట్నం,న్యూస్‌టుడే: ఉద్యోగిగా స్థిరపడ్డాక తాను పుట్టి, పెరిగిన గ్రామానికి ఎంతో కొంత మేలు చేయాలని తలచాడా యువకుడు. అమ్మక్కపేట్‌కు చెందిన బద్దం భరత్‌రెడ్డి గత అయిదేళ్లుగా హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజినీరుగా చేస్తున్నాడు. గ్రామంలో తాగునీటికి, అంతిమ సంస్కారాల అనంతరం శ్మశానవాటిక వద్ద స్నానాలు చేసేందుకు గ్రామస్థులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్నాడు. తాగు నీటి సమస్య పరిష్కారానికి గ్రామ శివారులో రూ1.50 లక్షలతో బోరు వేయించి, మోటారు బిగించి, కిలోమీటర్‌ మేర గ్రామంలోకి పైపులైన్‌ వేయించాడు. తద్వారా అక్కడి నుంచి అధిక సంఖ్యలో గ్రామస్థులు నీటిని తీసుకెళ్తున్నారు. అలాగే సిమెంట్‌ రింగ్‌లను ఏర్పాటుచేసి పశువుల దాహార్తి తీరుస్తున్నాడు. గ్రామ శివారులో సాంబశివ ఆలయానికి రూ1.50లక్షలతో ప్రహరీ, ఆలయం లోపల ప్లాట్‌ఫామ్‌, తలుపులను చేయించాడు. భక్తుల దాహార్తి తీర్చడానికి బోరు వేయించి చేతిపంపును ఏర్పాటుచేశారు. ఇదే బోరుకు మరో పైపులైన్‌ను ఏర్పాటుచేయించి, ఆలయానికి సమీపంలో గల భారీ హనుమాన్‌ విగ్రహం గుట్టపైకి నీటిని సరాఫరా చేస్తున్నారు. అంత్యక్రియలు నిర్వహించాక శ్మశాన వాటికలో స్నానం చేయడానికి నీరులేక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నాందున అక్కడ 10వేల లీటర్ల నీటి ట్యాంకును, పశువులు నీరు తాగేందుకు తొట్టిని రెండు కలిపి నిర్మించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వీటిని ప్రభుత్వ భూమిలో నిర్మించేందుకు రెవెన్యూ అధికారులు అనుమతికి ఏడాదిగా నిరీక్షిస్తున్నానని, అనుమతి ఇవ్వగానే వీటిని నిర్మించనున్నట్లు భరత్‌రెడ్డి తెలిపారు.ప్రాంగణ నియామకాల్లో 26 మంది ఎంపిక
అల్గునూర్‌,న్యూస్‌టుడే : తిమ్మాపూర్‌ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని శ్రీ చైతన్య యంత్ర కళాశాలలోని కెరియర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో వర్టెక్స్‌ కస్టమర్‌ మేనేజ్‌మెంట్‌ ఇండియా సంస్థ ఆదివారం నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 26 మంది ఎంపికయినట్లు కళాశాల సెక్రెటరీ, కరస్పాండెంట్‌ ముద్దసాని రమేష్‌రెడ్డి తెలిపారు. ఈ నియామకాల్లో కళాశాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొనగా బృంద చర్చలు, ముఖాముఖితో పాటు పలు పరీక్షలు నిర్వహించారని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపళ్లు డాక్టర్‌ చలం, ప్రసాద్‌రాజు, సీడీసీ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు, కోఆర్డినేటర్లు రమేష్‌, చారి, అశోక్‌, సాయికృష్ణ, రవిచైతన్య, కుమారస్వామి, సదానందం తదితరులు పాల్గొన్నారు.


సాహిత్యంపై లోతైన పరిశోధన అవసరం
సాహిత్య అకాడమి అవార్డు గ్రహిత భాస్కర్‌
ధర్మపురి గ్రామీణం: తెలుగు సాహిత్యంపైన లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహిత నలిమెల భాస్కర్‌ అన్నారు. ధర్మపురిలోని ఎస్‌ఆర్‌ఆర్‌ గార్డెన్‌లో జరిగిన ధర్మపురి సాహితీ సాంస్కృతిక వేదిక ఆవిర్భావ సమావేశంలో భాస్కర్‌ ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడారు. సాహితీవేత్తలకు నిలయమైన ధర్మపురిలో వేదిక ఆవిర్భావం అభినందించగిన విషయమన్నారు. పరిశోధన విధ్యార్థులు వాళ్ల శక్తి సామర్థ్యాలను భాషకోసం, చరిత్ర కోసం మళ్లించడం అభినందించదగ్గ విషయమన్నారు. అనేక సాహితీ సంస్థలు కనుమరుగవడానికి కారణం నిబద్దత, అంకిత భావం లేకపోవడమేనని తెలిపారు. పేరు ప్రఖ్యాతుల కోసం సాహిత్యాన్ని ఉపయోగించుకుంటే ముందుకు వెళ్లలేమన్నారు. పేదరికం నుండి వచ్చిన వారికే సాహిత్యం పట్ల లోతైన అవగాహన ఉంటుందన్నారు. ప్రముఖ చరిత్రకారుడు జితేంద్రబాబు మాట్లాడుతూ మన ప్రాంతంలో వేయి సంవత్సరాల క్రితమే హేమాద్రి అనే వ్యక్తి చతురు వర్గ చింతామణి పుస్తకంలో అనేక వైజ్ఞానిక విషయాలను గుర్తించి రాశాడని తెలిపారు. కోటి లింగాల దగ్గర మునుల గుహలో దిగ్నాగుడు అనే బౌద్ధ తార్కికుడు ఉండేవాడని మేఘ సందేశంలో కూడా ఈ ప్రస్తావన ఉందని తెలిపారు. ఆయనపై విదేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు. చీఫ్‌ విప్‌ ఈశ్వర్‌ మాట్లాడుతూ సంస్కృతాంధ్ర కళాశాలలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. వసతి గృహ మంజూరు కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ చరిత్రకారుడు జైకిషన్‌, నాయకులు బాదినేని రాజెందర్‌, శ్రీకాంత్‌ రెడ్డి, కిశోర్‌ రావు, పరిశోధక విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Untitled Document
న్యాయస్థానాల తీర్పులను ప్రభుత్వం గౌరవించాలి
మతోన్మాదానికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలి
నిఘా కెమేరాలతో విద్యార్థులను ఆందోళన పర్చవద్దు
అంజన్నా.. నీ భూములు కాపాడేదెవరన్నా!
జిల్లా స్థాయి గ్రామీణ క్రీడల విజేత చెక్కపల్లి
నూతన పోరాటాలకు సిద్ధంగా ఉండాలి
అక్షరాస్యతలో అగ్రభాగాన నిలవాలి: ఎంపీ
క్రమశిక్షణతోనే బంగారు బాటలు
ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో బహుమతుల ప్రదానం
ప్రభుత్వ వైద్య కళాశాలకు ప్రతిపాదనలు
నేతన్నల ఉపాధిపై ‘ముద్ర’ కరవు
నాకూ బతకాలని ఉంది..
పట్టుదలతోనే ఉద్యోగ సాధన
పరిశోధనకు.. మార్గదర్శనం
రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్త జనం
భర్త కిరాతకం
మామిడి తోట దగ్ధం.. రూ.12 లక్షల ఆస్తి నష్టం
ఇంట్లోకి దూసుకెళ్లిన కారు: నలుగురికి గాయాలు
మనసున్న మారాజులు సమాజ హితమే
ప్రాంగణ నియామకాల్లో 26 మంది ఎంపిక
సాహిత్యంపై లోతైన పరిశోధన అవసరం
 
  తాజా వార్తలు
  ప్రధాన వార్తలు
  ప్రత్యేక కథనాలు
Untitled Document
 
 
Untitled Document
 
 
 
Untitled Document
Copyright © 2015 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Marketing@eenadu.net