వివరాలివ్వకపోతే తీవ్ర పరిణామాలు
close

తాజావార్తలు

వివరాలివ్వకపోతే తీవ్ర పరిణామాలు
హైదరాబాద్‌: ఈనెల 31వ తేదీలోపు ఖాతాల వివరాలను పంపని బ్యాంకులు తీవ్రపరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆదాయపన్నుశాఖలోని నిఘా నేర పరిశోధన విభాగం డైరెక్టర్‌ బి.వి.గోపీనాథ్‌ హెచ్చరించారు. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులకు తావులేదన్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో ..లావాదేవీల వివరాలను ఆదాయపన్నుశాఖకు ఎలా సమర్పించాలన్న వ్యవహారంపై చైతన్యం కలిగించేందుకు బుధవారం వివిధ బ్యాంకుల ప్రతినిధులతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గోపీనాథ్‌ మాట్లాడుతూ.. గత ఏడాది నవంబరు 9 నుంచి డిసెంబరు 30 వరకూ వివిధ ఖాతాల్లో జమ అయిన లావాదేవీల వివరాలు తమకు అందించాలన్నారు. పెద్దమొత్తంలో నల్లధనం బ్యాంకుల్లో జమ చేసినట్లు తెలుస్తోందని, దీన్ని రట్టు చేసే ప్రయత్నం ఇప్పుడు జరుగుతోందన్నారు. ఎవరైనా ఖాతాదారుడికి చెందిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కరెంటు ఖాతాల్లో రూ.12.5 లక్షలకు మించి జమ చేసిన వాటి వివరాలు పంపాలన్నారు. అలాగే సేవింగ్స్‌ ఖాతా అయితే రూ.2.5 లక్షలకు మించి జమ చేసిన వాటి వివరాలన్నీ పంపాలని ఆయన కోరారు. ఒకేవ్యక్తి వేర్వేరు ఖాతాలు నిర్వహిస్తుంటే వాటన్నింటినీ ఒకే ఖాతాగా పరిగణిస్తామని, నోట్ల రద్దు తర్వాత రకరకాల పద్దతుల్లో నగదు బదిలీ జరిగిందని గోపీనాథ్‌ వివరించారు. మొత్తం ఐదు దశల్లో జరిగిన లావాదేవీలను రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌.బి.ఐ.) విశ్లేషించి ఆ వివరాలను తమకు పంపుతోందని, ఎవరు ఎన్ని రకాలుగా మభ్యపెట్టాలని చూసినా పట్టుబడతారని ఆయన హెచ్చరించారు. అయితే ఈ విషయంలో బ్యాంకులు జాగరూకతతో వ్యవహరించాలని, ఖచ్చితంగా లావాదేవీల వివరాలన్నీ పంపి తీరాల్సిందేనని, ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.