వేతనాలు అందవు.. అప్పులు తప్పవు
డిగ్రీ ఒప్పంద అధ్యాపకులకు 6 నెలల నుంచి జీతాలు కరవు
విద్యా వాలంటీర్లకూ సకాలంలో అందని దుస్థితి
పండగ వచ్చిందంటే భయం
ఈనాడు - హైదరాబాద్‌
పండగలు వస్తున్నాయంటే ఎవరికైనా ఆనందమే. అలాంటిది రాష్ట్రంలోని ఒప్పంద అధ్యాపకులు, విద్యావాలంటీర్లు తదితర ఉద్యోగులు మాత్రం భయపడిపోతున్నారు. ఉద్యోగాలు చేస్తున్నా వేతనాలు నెలల తరబడి అందకపోతుండటమే అందుకు కారణం. ఏటా ఇదే పరిస్థితి తలెత్తుతున్నా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో ఒప్పంద అధ్యాపకులకు గత ఏప్రిల్‌ నుంచి వేతనాలు అందలేదు. అధ్యాపకులకు గతానికి భిన్నంగా ఈ విద్యా సంవత్సరం వేసవి సెలవులు కూడా కలుపుకొని 12 నెలల జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం సెప్టెంబరు 5న ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలలుగా వేతనాలు అందకపోవడంతో 12 నెలల వేతనాలు వస్తాయన్న ఆనందం కూడా వారిలో లేకుండాపోయింది. దసరాకు వస్తాయనుకుంటే అందలేదు. కనీసం నవంబరు 7న దీపావళి నాటికైనా అందుతాయా అన్నది వారిని వేధిస్తున్న ప్రశ్న. నెలల తరబడి అందకపోవడం వల్ల పండగలకే కాక..కుటుంబ పోషణకు సైతం ప్రతినెలా అప్పులు చేయాల్సి వస్తోందని అధ్యాపకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు బడ్జెట్‌ విడుదల చేయలేదు. కళాశాల విద్యాశాఖ నుంచి ఎంత మంది పనిచేస్తున్నారు? ఎంత బడ్జెట్‌ అవసరం? తదితర వివరాలను పంపకపోవడం వల్లే బడ్జెట్‌ విడుదల చేయలేదని సమాచారం. ఆర్‌జేడీల నుంచి వివరాలు అందాయని, మరికొద్ది రోజుల్లోనే వేతనాలు అందుతాయని కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయ అధికారి ఒకరు చెప్పారు.

విడుదల చేస్తున్నా అందవు
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 15,661 మంది విద్యా వాలంటీర్లు పనిచేస్తున్నారు. ప్రతినెలా రూ.12 వేల వేతనం అందాలి. ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి బడ్జెట్‌ విడుదల చేస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యాశాఖ సంచాలకుని(డీఎస్‌ఈ) కార్యాలయం నుంచి కొంత ఆలస్యంగానైనా ఆయా జిల్లాలకు అవసరమైన నిధులను పంపిస్తున్నారు. అయినా సరే విద్యా వాలంటీర్లకు మాత్రం వేతనాలు అందటం లేదు. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు వేతనాల బడ్జెట్‌ను ఆగస్టు చివరి వారంలో జిల్లాలకు పంపారు. వాటిని వెంటనే అందించాలని రెండు సార్లు విద్యాశాఖ సంచాలకుడు డీఈఓలకు ఆదేశాలు జారీ చేసినా ఇప్పటికీ జయశంకర్‌ భూపాలపల్లిసహా పలు జిల్లాల్లో అందలేదు. ఖజానా కార్యాలయాల్లో బిల్లులు సమర్పించి వేతనాలు అందేలా చూడటంలో క్షేత్రస్థాయిలో ఎంఈఓలు పట్టించుకోవడం లేదని, వేతనాలు ఇస్తే తమకొచ్చేదేముందని కొందరు డీఈఓలు అనుకుంటుండటం వల్ల తీవ్ర జాప్యం జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు వేతనాల బడ్జెట్‌ రూ.56.37 కోట్లను ఈనెల 16న ప్రభుత్వం విడుదల చేసింది. ఇక అవి విద్యా వాలంటీర్లకు అందేసరికి ఇంకెన్ని నెలలు పడుతుందో వేచిచూడాలి.

ఇదీ పరిస్థితి...
* రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు: 132
* మొత్తం ఒప్పంద అధ్యాపకులు: 898 మంది
నెల వేతనం: రూ.40,270
* వేతనాలు అందాల్సిన ఏప్రిల్‌, మేలో నెలలు: 5 రోజులు,
జూన్‌ 20-30 వరకు(11 రోజులు) జులై, ఆగస్టు, సెప్టెంబరు
* అవసరమైన నిధుల మొత్తం: సుమారు రూ.170 కోట్లు

కథనాలు

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.