మూడు అడుగుల నేల కథ

అంతర్యామి

మూడు అడుగుల నేల కథ

లోకంలో మనిషి జీవించడానికి ఎంత నేల కావాలని ప్రశ్నిస్తే ఆరు అడుగుల నేల ఉంటే చాలు అంటారు తత్త్వవేత్తలు. ఇదే ప్రశ్నను భగవంతుణ్ని అడిగితే, ఆయన ‘మూడు అడుగుల నేల చాలు’ అంటాడు.

పూర్వం దానవ రాజైన బలిచక్రవర్తి ఇంద్రపదవి కోసం ‘విశ్వజిత్‌’ యాగం చేశాడు. దానివల్ల త్రిలోకాధిపత్యం లభించింది. పదవీ గర్వంతో చెలరేగిన బలిచక్రవర్తి, దేవతలను స్వర్గం నుంచి తరిమికొట్టాడు. ఎలాగైనా దైత్యులనుంచి తన పుత్రులను కాపాడమని భర్త కశ్యపుణ్ని అదితి ప్రార్థించింది. అదితి భర్త చెప్పినట్లు విష్ణువుకోసం తపస్సు చేసి, ఆయనను ప్రసన్నం చేసుకొన్నది. ఆమె ప్రార్థన విని విష్ణువు దేవతలకు రాక్షసుల బాధ తప్పించడం కోసం అదితి గర్భంలో వామనుడిగా జన్మిస్తానని వరం ఇచ్చాడు. వర ప్రభావంతో భాద్రపద శుద్ధ ద్వాదశినాడు శ్రవణ నక్షత్రంలో అభిజిన్ముహూర్తంలో వామనుడు జన్మించాడు. చిన్ననాటనే ఉపనయనం చేసుకొని, వేదవేదాంగాలను చదువుకొన్నాడు. ఒకనాడు నర్మదానదీ తీరంలో ‘భృగుకచ్ఛం’ అనే పవిత్ర ప్రదేశంలో బలిచక్రవర్తి అశ్వమేధయాగం చేస్తున్నాడని విని, వామనుడు అక్కడికి వెళ్లాడు. దివ్యతేజస్సుతో వెలిగిపోతున్న బ్రహ్మచారిని సాదరంగా ఆహ్వానించి, ఉచితా సనంపై కూర్చోబెట్టి- ‘ఓ మహానుభావా నీకు ఏమి కావాలో కోరుకో! దానం ఇస్తాను’ అన్నాడు. వామనుడు సంతోషించి- మూడు అడుగుల నేలను దానంగా ఇవ్వు. అదే నాకు చాలు’ అన్నాడు. వటువు కోరిన కోరికను విని బలి ‘నేను తలచుకుంటే సమస్త భూమండలాన్నే నీకు ఇవ్వగలను’ అన్నాడు. వామనుడు చిరు నవ్వుతో ‘దానవరాజా! నాకు నిలవడానికి మూడడుగుల నేల చాలు. అదే నాకు ఇవ్వు’ అన్నాడు. బలి చక్రవర్తి ‘సరే’ అని ఇస్తానని వాగ్దానం చేశాడు. మహా విష్ణువే కపట బ్రహ్మచారి రూపంలో వచ్చాడని రాక్షస గురువు శుక్రాచార్యుడు గ్రహించి, బలిచక్రవర్తిని హెచ్చరించాడు. బలి తాను ఇచ్చిన మాటను తప్పనని, తన ప్రాణం పోయినా సరే వామనుడికి మూడడుగుల నేలను దానం చేస్తాననీ అంటాడు. వెంటనే వామనుడు (పొట్టివాడు) త్రివిక్రముడిగా(విశ్వవ్యాపిగా) రూపొంది, బ్రహ్మాండమంతా నిండిపోయాడు. భూమండలం అంతా ఆక్రమిస్తూ ఒక పాదం మోపాడు. స్వర్గలోకాన్ని ఆక్రమిస్తూ రెండో పాదం మోపాడు. మూడో పాదం ఎక్కడ పెట్టాలని బలిని అడిగాడు వామనుడు. తన తలపై పెట్టమన్నాడు బలి. మూడో పాదంతో బలిని పాతాళానికి అణగదొక్కి ధన్యుణ్ని చేశాడు.

ఈ కథ వల్ల తెలిసే పరిమార్థం ఎంతో గొప్పది. లోకంలో ఎవరూ శాశ్వతులు కారు. దైవయోగాన్ని అనుసరించి సంపదలు వస్తూ, పోతూ ఉంటాయి.  పదవులూ వరిస్తుంటాయి. అవన్నీ తమవే అనుకుంటే అవి శాశ్వతంగా మిగలవు. ఈ ప్రపంచంలో ఎందరో రాజులు పుట్టారు, గిట్టారు. వారు ఆర్జించిన సంపదలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. వాటి నామరూపాలు కూడా ఇప్పుడు కనిపించవు. కనుక మనిషి దురాశను వదలాలి. లభించిన దానితో సంతృప్తి చెందాలి. పదవులు లభించాయనే గర్వంతో విర్రవీగితే పతనం తప్పదు. ఈ భూమిపై ఎవరూ శాశ్వతం కాదు. కొంతకాలం ఉండి వెళ్ళిపోయేవారే!

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ


మరిన్ని కథనాలు

జిల్లా వార్తలు

మరిన్ని

దేవ‌తార్చ‌న