close
వైకాపాది రంగులరాజ్యం

ఇక ఏడుకొండలు మాత్రమే మిగిలాయి..
ఎన్నికల్లో ఓడినా నిలబడ్డా
నా వద్ద ధైర్యం, జ్ఞానం అనే ఖడ్గాలున్నాయి
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

ఈనాడు, తిరుపతి: వైకాపాది కేవలం రంగుల రాజ్యమని, అన్నింటికీ రంగులు మారుస్తున్నారని.. ఇక ఏడుకొండలు మాత్రమే మిగిలాయని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. సమాజం, తరాలు, యువత ఆలోచనలు మారినా వైకాపా రంగుల ఆలోచన మారడం లేదని ఆరోపించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం తిరుపతి, చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గాల నేతలతో ఆయన తిరుపతిలో సమావేశమయ్యారు. మానవత్వమే తన మతమని జగన్‌రెడ్డి అంటున్నారని.. మతం మారినప్పుడు కుల ప్రస్తావన ఎందుకని సమావేశంలో పవన్‌ ప్రశ్నించారు. కులం, మతం, ఓట్లు, డబ్బు మాత్రమే వారికి ముఖ్యమని విమర్శించారు. ‘రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు హిందూ నేతలే ప్రజలను విభజిస్తున్నారు. ఏ ధర్మానికి ఇచ్చే గౌరవం దానికివ్వాలి. తిరుమలలో అన్యమత ప్రచారం తప్పు. కడప దర్గాకు వెళ్లి జైభవానీ అనడం కూడా తప్పే. సంప్రదాయాలు, మతాలను పరస్పరం గౌరవించుకోవాలి’ అని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ‘నా వద్ద కత్తులు, బాంబులు లేవు. ధైర్యం, జ్ఞానం అనే ఖడ్గాలున్నాయి. ఎన్నికల్లో ఓడినా నిలబడ్డా. ఆశయ సాధనకు ముందుకెళుతున్నా. 151 మంది ఎమ్మెల్యేలున్నా ప్రభుత్వం మనకు భయపడుతోంది’ అని వివరించారు.

అమ్మాయిల రక్షణను పట్టించుకోవట్లేదు.
‘ముఖ్యమంత్రికి సహనం లేదు. కర్నూలులో ఒక విద్యార్థిని చనిపోతే ఒక్కరూ పట్టించుకోలేదు. అమ్మాయిల రక్షణను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కదలని బత్తాయి చెట్లనే నరికేస్తున్నారు. చెట్టుపైనే సహనం లేని వ్యక్తికి మనుషులపై ఏముంటుంది? నిజమైన మత విశ్వాసముంటే దేనికీ హాని చేయరు. చెట్లను కూడా పార్టీలవారీగా విభజించారు. రాష్ట్రంలో జగన్‌రెడ్డి చెట్టు అయితేనే బతుకుతుంది. దమ్ము, ధైర్యం లేని నాయకత్వం వల్లే ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సిమెంటు పరిశ్రమలు పెట్టుకుని రూ.వేల కోట్లు సంపాదించేందుకు రాజకీయాల్లోకి రాలేదు. రాత్రికి రాత్రే ముఖ్యమంత్రి అయిపోవాలనుకోలేదు. రూ.వేల కోట్లు సంపాదించిన జగన్‌రెడ్డి సీమలో శీతల గిడ్డంగులు కట్టలేరా?’ అని పవన్‌ ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్‌, నాగబాబు, అర్హంఖాన్‌, హరిప్రసాద్‌ పాల్గొన్నారు.

సత్వర న్యాయం కావాలి
‘ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు సత్వర న్యాయం అందించాలి. ఇంటి ఆడబిడ్డలను సంరక్షించలేనప్పుడు మీకు 151 సీట్లు ఎందుకు? ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనే భయం ప్రజల్లో ఉంటే అత్యాచారాలు జరగవు’ అని పవన్‌ పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.