close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పోలీసు యంత్రాంగంలో అవాంఛనీయ పోకడలు

అందుకే నేరగాళ్లు చెలరేగిపోతున్నారు
రాష్ట్రంలో వరుస దుర్ఘటనలే ఇందుకు నిదర్శనం
డీజీపీకి లేఖ రాసిన తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు, అమరావతి: ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు దేశంలోనే గొప్ప పేరుండేదని.. గత 14 నెలలుగా రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో చోటుచేసుకున్న అవాంఛనీయ పోకడలతో నేరగాళ్లు విశృంఖలంగా చెలరేగిపోతున్నారని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ప్రజలకు భద్రత ఇవ్వాల్సిన పోలీసు శాఖలోని కొందరు రాజకీయ ప్రలోభాలు, పైరవీలు, అలసత్వం, ఉదాసీనతతో వ్యవహరించటం, అవినీతికి పాల్పడటం వల్ల అరాచక శక్తులు ఎలా బరితెగిస్తాయో చెప్పేందుకు రాష్ట్రంలో జరుగుతున్న వరుస దుర్ఘటనలే నిదర్శనమని అన్నారు. ఈ మేరకు మంగళవారం డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఆయన లేఖ రాశారు. కర్నూలు జిల్లా వెలుగోడులో గిరిజన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ, గుంటూరు జిల్లా నకరికల్లులో గిరిజన మహిళ రమావత్‌ మంత్రూబాయిని ట్రాక్టరుతో తొక్కించి చంపిన ఘటనల్లో నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. దిశా చట్టం చేశామని, పోలీసుస్టేషన్లు నెలకొల్పామని చెబుతున్నారే తప్ప ఆచరణలో అమలు కావట్లేదని విమర్శించారు.

గతేడాది మే నుంచి నేరాలే..
‘‘రాష్ట్రంలో గతేడాది మే నెల నుంచి నేరాలు-ఘోరాలు పెరిగిపోవటంపై ఇప్పటికే అనేక లేఖల ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చాను. శాంతిభద్రతలు పరిరక్షించాలని, అరాచక శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని అనేకమార్లు విజ్ఞప్తి చేశాం. అయినా నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పడకపోగా.. రోజురోజుకు శృతిమించాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. రక్షాబంధన్‌ రోజే రెండు జిల్లాల్లో ఇద్దరు గిరిజన ఆడబిడ్డల ప్రాణాన్ని, మానాన్ని కాలరాయటం కిరాతకం. రాష్ట్రంలో ఒక వర్గం పోలీసుల్లో పెరిగిన ఉదాసీనతకు ఇది నిదర్శనం. రాజమహేంద్రవరంలో ఎస్సీ వర్గానికి చెందిన మైనర్‌ బాలికపై 12 మంది సామూహిక అత్యాచారం చేసి పోలీసుస్టేషన్‌ వద్ద వదిలేయటం నేరగాళ్ల బరితెగింపును బట్టబయలు చేసింది. రాష్ట్రంలో 14 నెలల్లోనే 400 మందికిపైగా ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చోటుచేసుకున్నాయి. 15 చోట్ల సామూహిక అత్యాచారాలు, 8 మంది మహిళల హత్యలు జరిగాయి. ఆరుగురు మహిళలు అవమానంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇవన్నీ మీడియాలో వచ్చినవే. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికే పరిస్థితి నెలకొంది’’ అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
ఓటమి భయంతోనే స్పందించలేదు
శాసనసభను రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు విసిరిన సవాల్‌కు... ఓటమి భయంతోనే సీఎం జగన్‌ స్పందించలేదని తెదేపా నేతలు పేర్కొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు.. పార్టీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. చంద్రబాబు ఛాలెంజ్‌కి ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని నేతలు పేర్కొన్నారు. మూడు రాజధానుల అంశంపై ప్రజా తీర్పు కోరాలన్న చంద్రబాబు ఛాలెంజ్‌కి వారు మద్దతు ప్రకటించారు. చంద్రబాబు మాట్లాడుతూ... ‘‘రాజధానిని మూడు ముక్కలు చేస్తామన్న విషయాన్ని ఎన్నికల ముందు వైకాపా నాయకులు కావాలనే దాచిపెట్టారు. ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని మోసం చేశారు. ఇది 5 కోట్ల ప్రజలకు జగన్‌ వెన్నుపోటు. రాజధాని మూడు ముక్కల అంశంపై మళ్లీ ప్రజాతీర్పు కోరాలి’’ అని తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.