తరుగుతున్న రక్త నిల్వలు!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తరుగుతున్న రక్త నిల్వలు!

  అందుబాటులో మూడో వంతు మాత్రమే
  శస్త్రచికిత్సలు పెరిగితే కష్టాలే

ఈనాడు, అమరావతి: కరోనా ప్రభావంతో రక్త నిల్వలు తగ్గిపోతున్నాయి. అత్యవసర సమయాల్లో ఉపయోగించేందుకు అందుబాటులో ఉండాల్సిన రక్తంలో మూడోవంతే కొన్నిచోట్ల ఉంది. వైరస్‌ వ్యాప్తి భయంతో రక్తదాతలు ముందుకు రావట్లేదు. దీని ప్రభావం ప్రస్తుతం తలసేమియా బాధిత చిన్నారులపై కనిపిస్తోంది. ప్రసవ సమయంలో గర్భిణులకూ ఇబ్బంది తలెత్తుతోంది. పరిస్థితులు కుదుటపడితే.. ఆసుపత్రుల్లో వాయిదా పడిన శస్త్రచికిత్సలు మొదలవుతాయి. వాటికి రక్తం తప్పనిసరిగా కావాలి. గతేడాది మార్చిలో వైరస్‌ కేసుల నమోదు మొదలైనప్పటి నుంచి రక్తసేకరణ తగ్గింది. నవంబరు నుంచి కాస్త పర్వాలేదనిపించినా, మళ్లీ ఈ ఏడాది మార్చి నుంచి రక్తసేకరణకు ఆటంకాలు మొదలయ్యాయి. రక్తదాన శిబిరాలు లేకపోవడం, స్వచ్ఛందంగా ఇచ్చే దాతలు రాకపోవడంతో పాటు.. ఫోన్‌ చేయగానే వచ్చి రక్తం ఇచ్చేవారూ వెనకడుగు వేస్తున్నారు. వైరస్‌ సోకిన వ్యక్తులు ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ వచ్చిన 14 రోజుల తర్వాతే రక్తం ఇవ్వాలి. టీకా పొందిన 14 రోజుల తర్వాతే రక్తాన్ని దానం చేయవచ్చని కేంద్రం తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. ఇంతకుముందు 28 రోజుల వరకు రక్తం ఇవ్వకూడదన్న నిబంధన ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్లడ్‌బ్యాంకులు 167 ఉన్నాయి. వీటిల్లో బుధవారం వరకు సుమారు 2,000 యూనిట్లు ఉన్నాయి. ప్రస్తుతం    ఉన్న రక్తం అవసరాలకు సరిపోదు. దీనివల్ల దాతలు ముందుకొచ్చేలా త్వరలో అవగాహన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్‌ గీతాప్రసాదిని తెలిపారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో 18 రక్తనిధి కేంద్రాలు పనిచేస్తున్నాయి. సాధారణంగా నెలకు సగటున 7-8వేల యూనిట్ల రక్తం అందుబాటులో ఉండేది. మే చివరినాటికి 457 యూనిట్లే ఉన్నాయి. మార్చిలో 2,397, ఏప్రిల్‌లో 1,319 యూనిట్లు ఉన్నాయి. విజయవాడలోని ప్రధాన కేంద్రంలో 10 యూనిట్ల రక్తం ఉంది. ఇందులోనూ అరుదైన గ్రూపుల రక్తం లేదు. మిగిలిన కేంద్రాల్లోనూ పరిస్థితి ఇదేనని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఛైర్మన్‌ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. నెగెటివ్‌ గ్రూపులకు కొరత తీవ్రంగా ఉంది. కొన్నిచోట్ల పాజిటివ్‌ గ్రూపు రక్తం కూడా తక్కువగా ఉంది. రక్తదానానికి ముందుండే విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, ఉద్యోగులు కూడా ఇప్పుడు ధైర్యం చేయలేకపోతున్నారని రెడ్‌క్రాస్‌ సొసైటీ సమన్వయకర్త బీవీఎస్‌ కుమార్‌ తెలిపారు. విజయవాడలో రక్తం నిల్వలు తగ్గితే అత్యవసర సమయాల్లో ఇబ్బంది పడకుండా ఉండేందుకు కర్నూలు నుంచి తెప్పించినట్లు చెప్పారు. వైరస్‌ సోకే వారిలో యువకులు పెరిగినా, 18 ఏళ్లు దాటిన వారికి టీకాల పంపిణీ మొదలైతే 14రోజుల విరామం వల్ల దాతలు సంశయించడం మరింత పెరుగుతుందని వ్యాఖ్యానించారు.
తలసేమియా వ్యాధిగ్రస్తులపై ప్రభావం
తలసేమియా, సికిల్‌సెల్‌ వ్యాధిగ్రస్తులపై రక్తనిల్వల కొరత ప్రభావం ఉంది.వయసు, బరువును బట్టి వీరు ఎప్పటికప్పుడు రక్తాన్ని ఎక్కించుకోవాలి. తలసేమియాతో బాధపడే వారికి ప్రతి 21 రోజులకు రక్తం ఎక్కించాలి. రోగి బరువును బట్టి.. కేజీకి 12 ఎంఎల్‌ చొప్పున రక్తాన్ని తప్పనిసరిగా ఎక్కించాలి. అప్పుడే వారి హీమోగ్లోబిన్‌ 10-11 గ్రాములు ఉంటోంది. వీరిలో ‘ఎ’ గ్రూపు వారు మరింత ఇబ్బంది పడుతున్నారు. తెలిసిన వారిని రక్తం ఇవ్వాలని కోరుతున్నా వాయిదా వేస్తున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు