లక్ష ఎకరాల సాగునీరు కడలి పాలు!

ప్రధానాంశాలు

లక్ష ఎకరాల సాగునీరు కడలి పాలు!

వరదలు లేకుండానే ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదల

ఈనాడు, అమరావతి: కృష్ణా నది నుంచి ప్రకాశం బ్యారేజీ ద్వారా గత 18 రోజుల్లో సముద్రంలోకి వదిలిన నీరు.. 11.3 టీఎంసీలు. ఈ నీటిని నిల్వ చేయగలిగితే దాదాపు లక్ష ఎకరాలకు పైగా సాగు అవసరాలు తీర్చే అవకాశం ఉండేది. భారీ వర్షాలు లేవు. వరద పోటెత్తలేదు. ఎగువన ప్రాజెక్టులు నిండలేదు. అయినా ఇంతనీరు సముద్రం పాలైంది. మున్ముందు ఆశించిన వర్షాలు పడకపోతే ఈ ప్రభావం కృష్ణా డెల్టాపై తీవ్రంగా పడనుందని నిపుణులు చెబుతున్నారు.

పట్టిసీమ నుంచి ఎత్తిపోయకుండానే..
ప్రకాశం బ్యారేజీ కింద కృష్ణా డెల్టా పరిధిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గోదావరి, కృష్ణాను అనుసంధానిస్తూ నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం అందుబాటులోకి రాకముందు జులైలో ప్రకాశం బ్యారేజీకి వరద వచ్చిన సందర్భాలు చాలా అరుదు. డెల్టా కాల్వలకు ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో నీళ్లు వదిలేవారు. ఖరీఫ్‌ సాగు జాప్యమై, అక్టోబర్‌, నవంబర్‌లో కురిసే తుపానుల ధాటికి పంటలు తీవ్రంగా దెబ్బతినేవి. గత ప్రభుత్వ హయాంలో పట్టిసీమ నిర్మించాక జూన్‌/ జులైలోనే గోదావరి నుంచి ప్రకాశం బ్యారేజీలోకి నీటిని తరలించారు. నాలుగేళ్లుగా పట్టిసీమ నీరు కృష్ణా డెల్టాకు వరంగా మారింది. ముందస్తు ఖరీఫ్‌కు వీలు కలిగింది. దిగుబడులూ పెరిగాయని అన్నదాతలు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో కాకుండా.. జులై 5 నుంచి నీరు విడుదల చేస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. గోదావరి నీటిమట్టం పెరగలేదన్న కారణంగా పట్టిసీమ నుంచి నీటి తరలింపును వాయిదా వేస్తూ వచ్చారు.

ఈలోగా శ్రీశైలం, పులిచింతల వద్ద తెలంగాణ ప్రభుత్వం జల విద్యుదుత్పత్తి చేయడంతో దిగువకు వరద చేరింది. డెల్టా కాలువలకు జులై 2 నుంచి సుమారు 2వేల క్యూసెక్కులు వదులుతుండగా.. దాదాపు 8,500 క్యూసెక్కుల చొప్పున బ్యారేజీ దిగువకు విడుదల చేస్తున్నారు. జులై 2 నుంచి 20వ తేదీ వరకు 18 రోజుల్లో మొత్తం 11.3 టీఎంసీల నీరు సముద్రంలోకి చేరింది. ఎగువన ప్రాజెక్టులు నిండటం వల్లనో, స్థానిక పరివాహక ప్రాంతంలో వర్షాలు కురవడం వల్లనో వచ్చిన వరద కాదిది. సమన్వయలేమి, నిర్వహణలేమి వల్ల 1.13 లక్షల ఎకరాలకు సరిపడా సాగుజలాలు వృథా అయ్యాయి. ప్రస్తుతం పులిచింతల వద్ద అవుట్‌ ఫ్లో తగ్గింది. మంగళవారం 500 క్యూసెక్కులు మాత్రమే ఉంది. మునేరు, పాలేరు వాగుల నుంచి కూడా వరద తగ్గింది. ప్రస్తుతం బ్యారేజీ నుంచి 10,500 క్యూసెక్కులు సముద్రంలోకి, 2,535 క్యూసెక్కులు కాలువలకు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది పట్టిసీమ సహకారం లేకుండానే జులైలో డెల్టాకు నీళ్లివ్వడం రికార్డుగా చెబుతున్నారు. జలవనరుల శాఖ ఎస్‌ఈ మురళీకృష్ణారెడ్డి ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబరులో బ్యారేజీ నుంచి నీరు సముద్రంలోకి వదిలేసేవారమని, జులైలో వదలడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమమని పేర్కొన్నారు. ఎగువ నుంచి ప్రవాహం రావడం వల్ల తప్పలేదన్నారు. ప్రస్తుతం పట్టిసీమ అవసరం పడలేదని, భవిష్యత్తులో పరిశీలిస్తామని చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని