రణరంగాన్ని తలపించింది

ప్రధానాంశాలు

రణరంగాన్ని తలపించింది

పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికల్లో ఘర్షణలు
తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య రాళ్ల దాడులు  
పలుచోట్ల ఎన్నికలు వాయిదా

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల తల్లిదండ్రుల కమిటీకి బుధవారం నిర్వహించిన ఎన్నికలు కొన్నిచోట్ల రణరంగాన్ని తలపించాయి. పార్టీలతో సంబంధం లేకుండా జరిగే ఈ ఎన్నికల్లో రాజకీయ వాతావరణం కనిపించింది. కొన్నిచోట్ల తెదేపా, వైకాపా.. మరికొన్నిచోట్ల వైకాపాలోనే రెండు వర్గాల మధ్య ఘర్షణలు, వాగ్వాదాలు, పరస్పరం రాళ్ల దాడులు జరిగాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఉద్రిక్తత ఉన్నచోట ఎన్నికలను వాయిదా వేశారు. విశాఖపట్నం జిల్లా రావికమతం మండలంలోని గుడ్డిబా ప్రాథమికోన్నత పాఠశాల ఛైర్మన్‌ పదవిని రూ.1.60లక్షలకు వేలం పాటలో ఒకరు దక్కించుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ‘నాడు-నేడు’ కింద రూ.కోట్ల విలువ చేసే పనులను తల్లిదండ్రుల కమిటీల ద్వారా చేయిస్తోంది. దీంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. ‘‘పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు 94.91శాతం పూర్తయ్యాయి. మొత్తం 46,609 పాఠశాలలకు ఎన్నికలు నిర్వహించగా.. 44,237 బడుల్లో జరిగాయి. 19వేల పాఠశాలల్లో కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు’’ అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు.

ఘర్షణలు, రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్తత
కడప:  కమలాపురం మండలంలోని పెద్దచెప్పలి ఉన్నత పాఠశాలలో ఛైర్మన్‌ పదవి కోసం వైకాపాలోని రెండు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. వీరపల్లె మండలం ఉప్పరపల్లె ఉన్నత పాఠశాలలో వైకాపాకు చెందిన ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఎన్నికలు నిలిచిపోయాయి.
అనంతపురం: శింగనమల మండలం ఇరువెందుల పాఠశాల ఎన్నికలో వైకాపాలోని రెండువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో ఇద్దరు గాయపడ్డారు.
కర్నూలు: ఎమ్మిగనూరు మండలంలోని కందనాతి ఆదర్శ పాఠశాల కమిటీ ఎన్నికల్లో గొడవల కారణంగా వాయిదా పడింది. శిరివెళ్ల ఆదర్శ పాఠశాలలో తెదేపా, వైకాపా నాయకుల మధ్య ఘర్షణ జరిగింది.
చిత్తూరు: ఛైర్మన్‌ ఎన్నికకు కోరం లేక 40చోట్ల వాయిదాపడ్డాయి. శాంతిపురంలో ఫలితాలను నిలిపివేయడంపై తెదేపా, వైకాపా వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ప్రకాశం: సింగరాయకొండ మండలం ఊళ్లపాలెంలో వైకాపాలోని రెండు వర్గాల ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. త్రిపురాంతకం మండలం వెల్లంపల్లిలో వైకాపాలోని ఇరు వర్గాలు రాళ్ల దాడికి దిగడంతో 10 మందికి గాయాలయ్యాయి. దీంతో ఎన్నికలను వాయిదా వేశారు. మార్టూరు మండలం కోలలపూడిలో ఓటుకు రూ.5 వేల చొప్పున పంపిణీ చేసినట్లు తెలిసింది. 

తూర్పుగోదావరి: ఏలేశ్వరం మండలం తిరుమాలిలో వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. రౌతులపూడి మండలం ములగపూడిలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య జరిగిన దాడిలో ఓ వ్యక్తికి తలకు గాయమైంది. మారేడుమిల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఎన్నికైన తల్లిదండ్రులను కింద కుర్చోబెట్టి, ఉపాధ్యాయులు కుర్చీల్లో కూర్చోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం: పొందూరు మండల కేంద్రంలో ప్రాథమికోన్నత పాఠశాల ఛైర్మన్‌ ఎన్నిక సమయంలో వైకాపా, భాజపా వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

విశాఖ: మునగపాక గణపర్తి ప్రాథమిక, ఉన్నత పాఠశాలల కమిటీ ఎన్నికల్లో వైకాపాలోని ఇరు వర్గీయుల మధ్య కొట్లాటతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రాళ్ల దాడికి దిగడంతో ఎన్నికలను వాయిదా వేశారు.
* గుంటూరు జిల్లాలో 160 పాఠశాలలో ఎన్నికలు వాయిదాపడ్డాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని