ఏమారుతున్న బియ్యం

ప్రధానాంశాలు

ఏమారుతున్న బియ్యం

రీసైక్లింగ్‌ కొంత.. విదేశాలకు మరికొంత
రూ.8-10కి కొంటున్న వ్యాపారులు
నామమాత్ర కేసులతో కనిపించని ఫలితం
ఈనాడు - అమరావతి

కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామంలో వాహనంలో ఇంటింటికీ బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఆ వెనకే ద్విచక్ర వాహనంపై మరో ఇద్దరు తిరుగుతూ అవే బియ్యం తిరిగి సేకరించారు. కిలో రూ.8 చొప్పున లబ్ధిదారులకు చెల్లించారు. ఈ బియ్యం గోదాముకు చేరి, రాత్రికి రాత్రి కాకినాడ పోర్టుకు వెళ్తోంది. నందిగామ నియోజకవర్గంలో ఓ ప్రముఖ వ్యాపారి ఈ వ్యాపారం పెద్దఎత్తున చేస్తున్నారు. అతడికి రాజకీయ అండ ఉండటంతో, తెలంగాణ నుంచి కూడా రేషన్‌ బియ్యం సేకరించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కిలో బియ్యం రూ.8 నుంచి రూ.10కి కొని, రూ.25 చొప్పున విక్రయిస్తున్నారు. స్థానికంగా పౌల్ట్రీ పరిశ్రమతో పాటు కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా విదేశాలకూ పంపుతున్నారు. నిరుపేదలకు ఆహారభద్రత కింద ఇచ్చే రేషన్‌ బియ్యం ఇలా పక్కదారి పడుతోంది. గత ఏడాది నుంచి రేషన్‌ బియ్యం రెండు కోటాలు రావడంతో వ్యాపారులు కొనుగోలు ధర తగ్గించేశారు. గతంలో కిలో రూ.10కి కొనేవారు ఇప్పుడు రూ.6, 8 చొప్పున ఇస్తున్నారు. ప్రభుత్వానికి ఈ రేషన్‌ బియ్యం సరఫరాకు కిలోకు రూ.30 వరకు ఖర్చవుతోంది. విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నా, రాజకీయ ఒత్తిడితో నామమాత్రంగా 6ఏ కేసులు నమోదు చేస్తున్నారు. వ్యాపారులు అవి రేషన్‌ బియ్యం కావని, లేదా ప్రభుత్వం వేసిన వేలంలో కొన్నవని రసీదులు సృష్టిస్తున్నారు.  

ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే బియ్యం తిరిగి రీసైక్లింగ్‌ పేరుతో ప్రభుత్వ గోదాములకు చేరుతోంది. కొంత అక్రమరవాణా అవుతోంది. కొంతమంది వీటిని ఇంటింటికీ తిరిగి సేకరిస్తుండగా కొన్నిచోట్ల ఏకంగా ఎంఎల్‌ఎస్‌పీ పాయింట్‌ నుంచే తప్పిస్తున్నారు. మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్‌ బియ్యం ఇలాగే ఇస్తున్నారు. కృష్ణాజిల్లాలో పది మిల్లులు రేషన్‌ బియ్యంతోనే వ్యాపారం చేస్తున్నాయి. వీరులపాడు మండలంలో అక్రమ రవాణాకు సిద్ధం చేసిన 959 బస్తాల బియ్యం ఇటీవల పట్టుకున్నారు. తాను వేలంలో కొన్నానని వ్యాపారి వాదిస్తున్నారు. ఇలాగే నూజివీడు, మచిలీపట్నాల్లోనూ పట్టుకున్నా ఏమీ చేయలేకపోయారు. జిల్లాలో నెలకు దాదాపు 32వేల టన్నుల రేషన్‌ బియ్యం సరఫరా అవుతోంది. ఇందులో 80% తిరిగి వ్యాపారుల చేతికి వెళ్తోంది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో ఒక లారీ బియ్యం పట్టుకున్నారు. ఈ జిల్లా కోటా 43,800 టన్నుల్లో సగానికిపైగా పక్కదారి పడుతున్నాయి. గుంటూరు జిల్లాలో ఒక వైపు సేకరించిన బియ్యం కాకినాడ పోర్టుకు, పల్నాడులో సేకరించిన బియ్యం తెలంగాణ వైపు అక్రమంగా తరలిస్తున్నారని తెలిసింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కాకినాడ పోర్టుకు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, రాయలసీమ జిల్లాల నుంచి కృష్ణపట్నం పోర్టుకు రేషన్‌ బియ్యం వెళ్తున్నాయి.

వ్యాపారుల సిండికేట్‌

రేషన్‌ బియ్యం తరలించే వ్యాపారులు సిండికేట్‌గా మారారు. స్థానికంగా సేకరించేవారు ఆ జిల్లాలోని ఒకిరిద్దరికే విక్రయించాలి. ఈ వ్యాపారులు జాతీయ రహదారి వెంట తనిఖీలు లేకుండా మామూళ్లు ఇస్తారు. పోర్టుల వద్దా ఇదే పరిస్థితి. కొన్నిసార్లు పట్టుబడినా, 6ఏ కేసులు పెట్టడంతో జరిమానాలతో తప్పించుకుంటున్నారు.

అక్రమ రవాణాపై నిఘా పెట్టామని కృష్ణాజిల్లా సంయుక్త కలెక్టర్‌ కె.మాధవీలత చెప్పారు. లబ్ధిదారులకే బియ్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వాటిని ఎవరూ తిరిగి విక్రయించకూడదని హెచ్చరించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని