ఆ తెల్లవారూ నల్లవారేనని..

ప్రధానాంశాలు

ఆ తెల్లవారూ నల్లవారేనని..

భారతీయులపై తెల్లదొరల వివక్ష ఒకదశలో బ్రిటిషర్లకే ఆశ్చర్యం కల్గించే స్థితికి చేరింది. ఎంతగా అంటే తమ తోటి తెల్లవారిని సైతం అనుమానించి, అవమానించేంతగా! అలాంటి ఓ సంఘటన చివరకు భారతీయులకు జన్మించిన తెల్లవారికీ కొలువుల్లేకుండా చేసింది.

ఈస్టిండియా కంపెనీలో భాగంగా భారత్‌లో పనిచేయటానికి వచ్చిన అనేక తెల్లవారి కుటుంబాలు తరాలవారీగా ఇక్కడే స్థిరపడ్డాయి. తండ్రి, కుమారుడు, మనవలు... ఇలా అంతా ఈస్టిండియా కొలువుల్లో ఉండేవారు. అలాంటి వారిలో ఒకటి- ట్యూరింగ్‌ కుటుంబం! వీరి వంశానికి చెందిన విలియమ్‌ ట్యూరింగ్‌ 1791లో లండన్‌ పర్యటనకు వెళ్లి తిరిగి వస్తుంటే ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఓడలో భారత్‌కు వస్తున్న జాన్‌ విలియమ్‌ ట్యూరింగ్‌ను ఈస్టిండియా కంపెనీ అధికారులు అడ్డగించారు. వివరాలు అడిగారు. తాను భారత్‌లో ఈస్టిండియా కంపెనీ తరఫున మద్రాసులో మిలిటరీ అధికారిగా చేరానని చెప్పారు. కానీ వారికి నమ్మకం కుదరలేదు. కారణం- విలియమ్‌ రూపురేఖలు భారతీయుడిలా కన్పించటమే. దీంతో ఇతను తెల్లవాడిలా కాకుండా భారతీయుడిలా ఉన్నాడంటూ పై అధికారులకు నివేదించారు. ఆయన తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు భారతీయులై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే ఈస్టిండియా కంపెనీ కోర్టు డైరెక్టర్లు విలియమ్‌ను పిలిపించి పరీక్షించారు. ఇది అవమానంగా భావించిన విలియమ్‌ తన మిలిటరీ పదవి నుంచి వైదొలిగారు. అలా ఆ సమస్య పరిష్కారమైనా, కంపెనీ బోర్డు వెంటనే ఓ తీర్మానం ఆమోదించింది. ‘భారతీయులే కాకుండా తెల్లవారికి-భారతీయులకు పుట్టే పిల్లలు కంపెనీ సివిల్‌, మిలిటరీ, నౌకాదళాల్లో పనిచేసేందుకు అనర్హులు’ అనేది ఆ తీర్మానం సారాంశం! ఆ తర్వాతికాలంలో మిగిలిన కొలువులకు కూడా దీన్ని వర్తింపజేసింది. 1795లో చాలామంది ఆంగ్లో ఇండియన్లను ఈ నిబంధన కింద ఉద్యోగాల్లోంచి తొలగించారు. కేవలం బ్యాండ్‌మేళాలలో, గుర్రాలకు మేతవేయటానికి ఉపయోగించు కునేవారు. అలా తమపాలన తొలి తరంలో భారతీయులనే కాకుండా వారిలా కనిపిస్తే తెల్లవారినీ దూరం పెట్టేవారు.

విలియం ఉదంతం ట్యూరింగ్‌ వంశస్థులను ఏళ్లపాటు మానసికంగా వెంటాడింది. ప్రస్తుత కృత్రిమమేధకు ఆద్యుడిగా చెప్పే ప్రముఖ కంప్యూటర్‌ సైన్స్‌ శాస్త్రవేత్త అలన్‌ ట్యూరింగ్‌ పైన చెప్పిన కుటుంబానికి చెందినవాడే! భారత్‌లో పుడితే తమ ప్రభుత్వం ఎక్కడ వివక్ష చూపుతుందోననే భయంతో ఇంగ్లాండ్‌కు వెళ్లి అక్కడే అలన్‌కు జన్మనిచ్చింది తల్లి సారా.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని