గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌,మ్యుటేషన్‌

ప్రధానాంశాలు

గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌,మ్యుటేషన్‌

విధివిధానాలు రూపొందించాలి
రికార్డుల నవీకరణకు ఏటా ఒక వారం
వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్షపై సీఎం జగన్‌ సమీక్ష

ఈనాడు, అమరావతి: గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌తోపాటు మ్యుటేషన్‌ జరగాలని, భూవిక్రయం జరిగిన వెంటనే ఈ ప్రక్రియ పూర్తికావాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. మ్యుటేషన్‌ జరిగితేనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయినట్లు భావించాలన్నారు. భూ రికార్డుల్లో, న్యాయపరమైన అంశాల్లో నిపుణులైన వారితో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియకు అనుసరించాల్సిన విధానాన్ని రూపొందించాలని సూచించారు. ఏడాదిలో ఒక వారం రికార్డుల్ని నవీకరించేందుకు కేటాయించాలని ఆదేశించారు.
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో గురువారం వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై సమీక్షించారు. నిర్దేశిత లక్ష్యంలోగా సమగ్ర సర్వే పూర్తి చేయాలని, దీని కోసం డ్రోన్లు, సాంకేతిక పరికరాలన్నింటినీ సమకూర్చుకోవాలని సీఎం సూచించారు.  సర్వే డేటా భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిషేధిత భూములపై రికార్డుల్లో చోటుచేసుకున్న వ్యవహారాలు పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు. 22ఏకి సంబంధించి అనేక విషయాలు బయటికి వస్తున్నాయని, వాటన్నింటిని సరిచేయాలని, దీనికోసం ఒక విధానాన్ని తీసుకురావాలని ఆదేశించారు. నిషేధిత భూముల జాబితాలో ఏదైనా భూమిని చేర్చాలన్నా, తొలగించాలన్నా లోపం లేని విధానం ఉండాలని, దీనికోసం అధీకృత వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం ముఖ్యసలహాదారు అజేయ కల్లం, ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, సీసీఎల్‌ఏ ప్రసాద్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు శ్రీలక్ష్మి, రజత్‌ భార్గవ, అజయ్‌జైన్‌, ముఖ్యకార్యదర్శులు రావత్‌, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

51 గ్రామాల్లో సర్వే పూర్తి
శాశ్వత భూహక్కు, భూరక్ష కార్యక్రమం కింద ఇప్పటి వరకు 51 గ్రామాల్లో సర్వే పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. డిసెంబర్‌ నాటికి మరో 650 గ్రామాల్లో పూర్తవుతుందని వెల్లడించారు. వారు సీఎంకి వివరించిన అంశాలివీ..
*2022 జూన్‌ నాటికి 2,400 గ్రామాల్లో, ఆగస్టు నాటికి మరో 2,400 గ్రామాలు, అక్టోబర్‌కి మూడు వేల గ్రామాలు, డిసెంబర్‌కి ఇంకో 3వేల గ్రామాలు, 2023 మార్చి నాటికి 3వేల గ్రామాలు, జూన్‌ నాటికి మరో 3వేల గ్రామాల చొప్పున రాష్ట్రమంతటా సర్వే పూర్తవుతుంది.
* ప్రయోగాత్మకంగా చేపట్టిన 51 గ్రామాల్లో 30,679 కమతాల సర్వే పూర్తి. 3,549 మంది పట్టాదారుల వివరాల నవీకరణ.
* రెవెన్యూ విభాగానికి వచ్చిన 572, సర్వే విభాగానికొచ్చిన 1,480 అభ్యర్థనలు సహా 235 సరిహద్దు వివాదాల పరిష్కారం. రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తి.


కరెంటు కోతల్లేకుండా చర్యలు తీసుకోండి: సీఎం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణపట్నం, వీటీపీఎస్‌ల్లోని కొత్త యూనిట్లలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించి 1600 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తేవాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ రంగ పరిస్థితులపై అధికారులతో సీఎం గురువారం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. రాష్ట్రంలోని వివిధ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లోని బొగ్గు నిల్వలు, విద్యుదుత్పత్తి పరిస్థితిని అధికారులు వివరించారు. థర్మల్‌ కేంద్రాలను పూర్తి సామర్థ్యంతో నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడున్నా కొని తెప్పించుకోవాలని, ఇందుకు ఎలాంటి నిధుల కొరతా లేదని ఆయన స్పష్టం చేసినట్టు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సింగరేణి సంస్థతో సమన్వయం చేసుకుని అవసరం మేరకు బొగ్గు తెప్పించుకోవాలని.. కేంద్రంలోని వివిధ శాఖలు, సంస్థలతోనూ నిరంతరం సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించినట్లు వెల్లడించింది.


 

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని