‘మందబయలు’లో నిర్మాణాలకు వీల్లేదు: హైకోర్టు

ప్రధానాంశాలు

‘మందబయలు’లో నిర్మాణాలకు వీల్లేదు: హైకోర్టు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ రికార్డుల్లో పశువులను మేపుకొనేందుకు ఉద్దేశించిన ‘మందబయలు’ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ భూమిలో రైతు భరోసా కేంద్రం, గ్రామసచివాలయం, వెల్‌నెస్‌ కేంద్రాల నిర్మాణాలు సరికాదని తేల్చిచెప్పింది. ఈ భూమిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. మందబయలుగా పేర్కొన్న భూమిని బోర్డ్‌ స్టాండింగ్‌ ఆర్డర్‌ (బీఎస్‌వో)కు అనుగుణంగా ‘అసెస్డ్‌ వేస్ట్‌ డ్రై’గా రెవెన్యూ రికార్డుల్లో మార్పు చేయకుండా ఇతర అవసరాలకు వినియోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. బీఎస్‌వో ప్రకారం మందబయలు భూమి స్వభావాన్ని మార్చినప్పటికీ.. స్థలాన్ని పంచాయతీకి బదలాయిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వనంత వరకు దానిపై పంచాయతీకి కూడా హక్కులు ఉండబోవని తెలిపింది. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లెలో సర్వేనంబరు 74/3లో మందబయలుగా పేర్కొన్న భూమిలో గ్రామసచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ కేంద్రం ఏర్పాటు చట్టవిరుద్ధమని ప్రకటించింది. అక్కడ నిర్మాణాలు చేపట్టవద్దని అధికారులను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి ఇటీవల ఈమేరకు తీర్పునిచ్చారు. డీకేటీ పట్టాల ద్వారా తమకు కేటాయించిన 24సెంట్లలో పంచాయతీ అధికారులు గ్రామసచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మిస్తున్నారంటూ కె.ఏడుకొండలు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ రికార్డుల్లో భూమి స్వభావాన్ని మార్చి తమను ఖాళీ చేయించడానికి చూస్తున్నారని అన్నారు. దీనిపై విచారించిన న్యాయమూర్తి.. అధికారులు కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం సర్వేనంబరు 74/3లో భూమిని మందబయలుగా పేర్కొన్నారని వివరించారు. పిటిషనర్లు ఫోర్జరీ సంతకాలతో పట్టాలు సృష్టించారన్న వారి ఆరోపణలకు తగిన ఆధారాలు చూపలేదన్నారు. ఈ సర్వేనంబరులోని 24 సెంట్ల భూమి పిటిషనర్ల స్వాధీనంలో ఉందని తెలిపారు. పిటిషనర్ల స్థలం విషయంలో జోక్యం చేసుకోవద్దని అధికారులను ఆదేశించారు. పిటిషనర్లకు ఇచ్చిన డీఫాం పట్టాలు ఆవాస్తవమైనవని తేలితే వారిని చట్ట ప్రకారం ఖాళీ చేయించడానికి ఈ తీర్పు తహశీల్దార్‌కు అడ్డంకి కాబోదని పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని