ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమే

ప్రధానాంశాలు

ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమే

సీఎం, డీజీపీ కుమ్మక్కై చేయించిన దాడులివి
లేకుంటే వారుండే ప్రాంతంలో కర్రలు, సుత్తులతో వస్తారా?
దాడికి వస్తున్నారని చెప్పేందుకు ఫోన్‌ చేసినా డీజీపీ తీయలేదు.. ఆయన అపరాధి కాదా?
నేడు రాష్ట్ర బంద్‌.. అందరూ సహకరించాలి: చంద్రబాబు

ఈనాడు, అమరావతి: తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి.. ప్రభుత్వం, పోలీసులు కలసిచేసిన టెర్రరిజమని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. ‘రాష్ట్రపతి పాలనకు నేను వ్యతిరేకం. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయంతోనే దాడులు జరిగాయి. శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమయ్యారనేందుకు ఇంతకంటే తీవ్రమైన పరిస్థితులు ఏముంటాయి? 356 అధికరణం ప్రయోగించి రాష్ట్రపతి పాలన విధించాలి’ అని డిమాండు చేశారు. ‘దాడులపై చెప్పేందుకు ప్రయత్నించినా డీజీపీ ఫోన్‌ తీయలేనంత తీరికలేకుండా ఉన్నారా? అత్యవసరం కాకుంటే ఎందుకు ఫోన్‌ చేస్తాం? డీజీపీ అపరాధి కాదా?’ అని నిలదీశారు. ‘దాడులను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి. ఎప్పుడూ బంద్‌కు పిలుపివ్వని నేను.. బుధవారం రాష్ట్ర బంద్‌ పాటించాలని కోరామంటే ప్రజలంతా అర్థం చేసుకోవాలి. ఏకపక్షంగా కార్యాలయాలు, విద్యాలయాలు మూసేసి నిరసన తెలపాలి. రాజకీయ పార్టీలూ మద్దతివ్వాలి’ అని విజ్ఞప్తి చేశారు.

మంగళవారం రాత్రి తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘విజయవాడలో పట్టాభి, హిందూపురంలో బాలకృష్ణ ఇంటిపై, కడపలో అమీర్‌బాబుతోపాటు విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, నెల్లూరుల్లోనూ దాడులు జరిగాయి. శాంతిభద్రతల రక్షణలో విఫలమయ్యారనేందుకు ఇంతకంటే ఏం కావాలి? దీనిపై విచారణ చేయించాలి’ అని డిమాండు చేశారు. ‘తెదేపా కార్యాలయంపై దాడి జరుగుతుంటే డీజీపీకి తెలియలేదంటే ఆయన ఆ పదవికి తగినవారేనా? సంయమనం పాటించాలంటూ తెలివిగా మాట్లాడుతున్నారు. ప్రజలు చెల్లించే పన్నుల నుంచి జీతం తీసుకుంటున్న ఆయన.. మమ్మల్ని చంపే సమయంలో ఎక్కడున్నారు? ఎక్కడికి పోయారు? చేతనైతే శాంతిభద్రతలను రక్షించండి.. లేదంటే ఇంటికి పోండి’ అని మండిపడ్డారు. ‘దాడి జరుగుతోందని.. ఎంతమంది చనిపోతారో తెలియదని గవర్నర్‌కు ఫోన్‌లో వివరించా. నియంత్రించాలని కోరా. డీజీపీకి ఫోన్‌ చేసినా తీయలేదని చెప్పా’ అని పేర్కొన్నారు. ‘కొందరి కారణంగా పోలీసువ్యవస్థ భ్రష్టు పట్టింది. పోలీసులే మాకెందుకీ ఖర్మ అనుకుంటున్నారు’ అని వివరించారు.

తెలంగాణ పోలీసు కమిషనరే చెప్పారు..

మాదకద్రవ్యాల మాఫియాకు ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా తయారైందని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘విద్యుత్‌ ఛార్జీలు ఇష్టానుసారం పెంచేశారు. గంజాయి ఉత్పత్తితోపాటు ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. హెరాయిన్‌ దిగుమతి చేసుకుంటూ దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఇలా జాతిని నిర్వీర్యం చేస్తుంటే.. అది మంచిది కాదని మాట్లాడే స్వేచ్ఛ మాకు లేదా? రాష్ట్ర పౌరుడిగా అడిగే హక్కు లేదా?’ అని నిలదీశారు. ‘తెలంగాణలో గంజాయి లేదు. ఆంధ్రప్రదేశ్‌లో సీలేరు, పాడేరు, నర్సీపట్నం ప్రాంతాల్లో సాగవుతోందని తెలంగాణ పోలీసు కమిషనర్‌ చెప్పారు. మహారాష్ట్ర, తమిళనాడులోనూ గంజాయి పట్టుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. ‘వీటిపై మేం మాట్లాడితే ఆధారాలు ఇవ్వండి.. లేదంటే జైల్లో పెడతామని అంటున్నారు. సీనియర్‌ ఎస్సీ నాయకుడి ఇంటికి అర్ధరాత్రి పోలీసులు వెళ్తారా? గంజాయి పెంచుతున్నారనడమే ఆయన తప్పా?’ అని ప్రశ్నించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో 28.5% మంది ప్రజాప్రతినిధులపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని జాతీయ స్థాయి సర్వేలో తేలింది’ అని పేర్కొన్నారు.

మాట్లాడేవారిని అణచివేసే ధోరణి

‘అడ్డు వస్తే గృహనిర్బంధాలు చేస్తున్నారు. బయటకు వచ్చి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా?’ అని చంద్రబాబు మండిపడ్డారు. ‘ప్రజాసమస్యలపై పోరాడేది రాజకీయ పార్టీలే. వాటి కార్యాలయాలపై దాడులు చేసి భయభ్రాంతులను చేయాలనుకుంటున్నారు’ అని విరుచుకుపడ్డారు. ‘ఇది తెదేపా సమస్య కాదు. 5 కోట్ల ప్రజలకు సంబంధించిన అంశం’ అని పేర్కొన్నారు.


ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమే. లేదంటే ముఖ్యమంత్రి ఇల్లు, డీజీపీ కార్యాలయమున్న ప్రాంతంలో కర్రలు, సుత్తులతో వచ్చి దాడి చేస్తారా? బీరు సీసాలతో వస్తారా? రౌడీమూకలకు మద్యం తాగించి వారితో వచ్చి దాడికి పాల్పడ్డారు. గాయపడిన ముగ్గురు ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉన్నారు.


‘‘తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడికి వస్తున్నారని చెప్పేందుకు మంగళవారం సాయంత్రం 5.03 గంటలకు డీజీపీకి ఫోన్‌ చేస్తే తీయలేదు. 5.16 గంటలకు దాడి జరిగింది. గవర్నర్‌కు ఫోన్‌ చేస్తే ఆయన మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఫోన్‌లో వివరించా.


డీజీపీ కార్యాలయానికి వంద గజాల దూరంలో తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. ఇది డీజీపీ, ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగింది కాదు. ఇద్దరూ లాలూచీ పడి పథకం ప్రకారమే ఒకే సమయంలో రాష్ట్రంలో పలు చోట్ల దాడి చేయించారు.
‘ప్రజాస్వామ్యం కోసమే అన్ని వేధింపులను సహించాం. అయినా భయపడలేదనే తెదేపా కార్యాలయంపై దాడి చేసి ఒకరిద్దరిని చంపేసి మూసేయించాలని ప్రయత్నించారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని