ఆంధ్రప్రదేశ్‌లో మాఫియా రాజ్యం

ప్రధానాంశాలు

ఆంధ్రప్రదేశ్‌లో మాఫియా రాజ్యం

చంద్రబాబు ధ్వజం

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ మాఫియా రాజ్యంగా మారిపోయిందని.. దేశంలో ఎక్కడ గంజాయి, డ్రగ్స్‌ పట్టుకున్నా దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌ను చెప్పే పరిస్థితి వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. లేసుల ఎగుమతులకు ప్రసిద్ధి పొందిన నర్సాపురం నుంచి ఆస్ట్రేలియాకు మాదకద్రవ్యాలు పంపించే పరిస్థితి తలెత్తిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం దిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిందును కలిసిన అనంతరం చంద్రబాబు విలేకర్లతో మాట్లాడారు. ‘మద్యనిషేధమని చెప్పి మూడు, నాలుగు రెట్లు ధరలు పెంచి సొంత బ్రాండ్లతో వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ మద్యం కంటే గంజాయి, హెరాయిన్‌ తక్కువ రేటుకు వస్తుండటంతో అందులో వాటిని కలుపుకొంటున్నారు. ఇలా రాష్ట్రంలో ఒక మాఫియా తయారైంది. దీన్ని ప్రశ్నించినందుకు మా పార్టీ ప్రధాన కార్యాలయంతోపాటు విశాఖపట్నం, నెల్లూరు కార్యాలయాలపై దాడులు చేశారు. పట్టాభి ఇంటిని ధ్వంసం చేశారు. కాళహస్తి, హిందూపురం, అనంతపురం ఎక్కడ పడితే అక్కడ దాడులు చేశారు. నేను డీజీపీకి ఫోన్‌ చేస్తే ఎత్తరు. సీఎం, డీజీపీ ఇద్దరూ కలిసి మా కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఒక రాష్ట్ర పార్టీ కార్యాలయంపై దాడి జరగడం చరిత్రలో మొదటిసారి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై దాడి చేసి ఆయన్ను ఇంటికి పంపించే వరకు ఒత్తిడి తెచ్చారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌పైనా, శాసనమండలి ఛైర్మన్‌పైనే కాక హైకోర్టుపై దాడి చేశారు. హైకోర్టు జడ్జిలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసే పరిస్థితికి వచ్చారు. ఓ జీవో తీసుకువచ్చి ఎవరైనా వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఆ పత్రికలపై కేసులు పెట్టమని అధికారులను ప్రోత్సహించారు. వీళ్ల తాత రాజారెడ్డి ప్రత్యర్థుల పండ్ల తోటలు నరికేసి, ఇళ్లు కూల్చేసి వారి ఆర్థిక మూలాలను దెబ్బతీసే సంప్రదాయాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్లీ ఈయన అలాంటి స్థితి రాష్ట్రంలో కల్పించారు. ప్రైవేటు సెటిల్‌మెంట్లు, భూకబ్జాలు జరుగుతున్నాయి. ఇవన్నీ రాష్ట్రపతికి వివరించాం. దోషులను కఠినంగా శిక్షించే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతూనే ఉంటాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని, హోం మంత్రులను కూడా కలవాలనుకుంటున్నట్లు చెప్పారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని