ఎయిడెడ్‌ లేకపోతే ఎక్కడికెళ్లాలి?

ప్రధానాంశాలు

ఎయిడెడ్‌ లేకపోతే ఎక్కడికెళ్లాలి?

విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన
ప్రైవేటుగా మారిపోయిన ఎయిడెడ్‌ విద్యాసంస్థలు
ఫీజులు చెల్లించడం భారమవుతుందని ఆవేదన

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో విద్యాశాఖ నిర్ణయంతో ఎయిడెడ్‌ బడులు అన్‌ ఎయిడెడ్‌గా మారిపోయాయి. ఇప్పటి వరకు ఎయిడెడ్‌ బడుల్లో ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేకపోగా.. ఇప్పుడు ఇవి ప్రైవేటు పాఠశాలలుగా మారడంతో రుసుముల చెల్లింపు తప్పనిసరి కానుంది. దీంతో వీటిలో పిల్లల్ని చదివిస్తున్న చాలామంది తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. విశాఖలో సోమవారం తల్లిదండ్రులు నిర్వహించిన రాస్తారోకో ఇందుకు ఓ ఉదాహరణ మాత్రమే. స్థానికంగా ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తామని తల్లిదండ్రులు సమ్మతి తెలిపితే విద్యార్థులను అక్కడ సర్దుబాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. ఆ మేరకు తల్లిదండ్రుల నుంచి సమ్మతి లేఖలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎయిడెడ్‌లో చదివినవారు ఒక్కసారిగా మరో బడికి వెళ్లాల్సి రావడం విద్యార్థులకు, ఫీజులు చెల్లించాల్సి రావడం తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారుతోంది. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచాక బడులు మార్చడమేమిటన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 1,946 ఎయిడెడ్‌ పాఠశాలలు ఉండగా.. వీటిలో 572 మినహా మిగతా యాజమాన్యాలు గ్రాంటుతోపాటు సిబ్బందినీ వెనక్కి ఇచ్చేందుకు స్వచ్ఛందంగా సమ్మతి తెలిపాయి. వీటిని అన్‌ఎయిడెడ్‌ సంస్థలుగా మార్చుతూ జిల్లా విద్యాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ప్రైవేటుగా మారితే ఫీజులు

సమ్మతి తెలిపిన ఎయిడెడ్‌ పాఠశాలలు ప్రైవేటుగా నిర్వహించుకునేందుకు ఇప్పటికే అనుమతి ఇచ్చారు. ఈ సంస్థలన్నింటికీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఖరారు చేసిన ఫీజులు వర్తించనున్నాయి. నర్సరీ నుంచి అయిదో తరగతి వరకు గ్రామాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.11 వేలు, నగరాల్లో రూ.12 వేలు ఫీజు వసూలు చేసుకోవచ్చు. 6-10 తరగతులకు అయితే ఈ మూడు ప్రాంతాల్లో వరుసగా రూ.12 వేలు, రూ.15 వేలు, రూ.18 వేలు తీసుకోవాలి. వసతిగృహంలో ఉండాలంటే గ్రామాల్లో రూ.18 వేలు, పట్టణాల్లో రూ.20 వేలు, రూ.24వేలు ఖరారు చేశారు. ఎయిడెడ్‌ అన్‌ఎయిడెడ్‌గా మారినందున ప్రైవేటు పాఠశాలలకు వర్తించే అన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులను నియమించుకుని జీతాలివ్వడం, పిల్లల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేయడం కష్టమంటూ.. అన్‌ఎయిడెడ్‌గా మారిన కొన్ని బడులను మూసివేస్తున్నారు. విజయవాడలో ఇప్పటికే మాంటిస్సోరి పాఠశాలను మూసివేశారు. ఇందులో చదువుతున్న విద్యార్థులను సమీప బడుల్లో సర్దుబాటు చేస్తున్నారు.  

ఉన్నతీకరించాలంటే వసతులు ఎలా?

రాష్ట్రంలో అన్ని ఎయిడెడ్‌ పాఠశాలల్లో కలిపి 6,982 మంది ఉపాధ్యాయులున్నారు. వీరిలో దాదాపు 4 వేల మంది వరకు కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నారు. వచ్చే నెలలో పోస్టింగ్‌లు ఇస్తే వీరందరూ ఎయిడెడ్‌ నుంచి రిలీవ్‌ అవుతారు. ప్రకాశం లాంటి జిల్లాల్లో ఎయిడెడ్‌ బడులకు సమీపంలో ప్రభుత్వ బడులు లేవు. ఒకవేళ ప్రభుత్వం కొత్తవి ఏర్పాటు చేయాలన్నా, ఉన్నవాటిని ఉన్నతీకరించాలన్నా ఇప్పటికిప్పుడు మౌలిక సదుపాయాలు కల్పించడం కష్టమే. మరికొన్నిచోట్ల ఎయిడెడ్‌ యాజమాన్యాలకు అద్దె చెల్లించి, పాఠశాలలు కొనసాగిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అన్‌ఎయిడెడ్‌గా మారిన పాఠశాలను యాజమాన్యం పూర్తిగా మూసివేస్తే తప్ప అద్దెకు ఇచ్చే అవకాశం ఉండదు. ఆస్తులతో అప్పగించే పాఠశాలల్లో సిబ్బందిని అక్కడే కొనసాగిస్తామని మొదట్లో అధికారులు ప్రకటించారు.. ఇప్పుడు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ ఉపాధ్యాయులను కూడా కౌన్సెలింగ్‌ జాబితాలో చేర్చడం గమనార్హం.

బలవంతమేమీ లేదు: మంత్రి సురేష్‌

ఎయిడెడ్‌ పాఠశాలల విలీనంలో బలవంతం లేదు. యాజమాన్యాలు స్వచ్ఛందంగా సమ్మతిస్తేనే సిబ్బందిని తీసుకుంటాం. ఆస్తులను అప్పగించాల్సి అవసరం లేదు. లేదంటే ఎయిడెడ్‌గా నిర్వహించుకోవచ్చు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని