రాజకీయాలకు నమస్కారం!

ప్రధానాంశాలు

రాజకీయాలకు నమస్కారం!

 కేంద్ర మాజీ మంత్రి  బాబుల్‌ సుప్రియో ప్రకటన

  ఎంపీ పదవికీ రాజీనామా

కోల్‌కతా: కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ బాబుల్‌ సుప్రియో (50) రాజకీయాల నుంచి వైదొలిగారు. ఎంపీ పదవికీ రాజీనామా చేశారు. మంత్రిపదవిని కోల్పోవడం, భాజపా రాష్ట్ర నాయకత్వంతో విభేదాలు ఏర్పడడమే ఇందుకు కారణం. 2014 నుంచి కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖలకు సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన గత నెలలో పదవి పోయిన దగ్గర నుంచి నిరుత్సాహంతో ఉన్నారు. అసన్‌సోల్‌ నుంచి ఆయన రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. రాజకీయాల నుంచి తప్పుకోవడంపై శనివారం ప్రకటన విడుదల చేశారు. ‘‘అల్విదా. తల్లిదండ్రులు, భార్య, స్నేహితులతో మాట్లాడాను. వారి సలహా తీసుకున్న మేరకు రాజకీయాలను విడిచిపెడుతున్నా. ఏ పార్టీలోనూ చేరడం లేదు. ఎవరూ నన్ను సంప్రదించలేదు. నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. ఏక సభ్య జట్టుగా ఉంటా. సామాజిక సేవలో పాల్గొంటా. సమాజ సేవకు రాజకీయాలే అవసరం లేదు’’ అని పేర్కొన్నారు.

ఎందుకీ నిర్ణయం?

ఇందుకుగల కారణాలను సుప్రియో ఆ ప్రకటనలోనే వివరించారు. ‘‘ఎన్నికల ముందు కొన్ని విషయాలపై రాష్ట్ర నాయకుల మధ్య విభేదాలు పొడసూపాయి. ఇందుకు కొంతవరకు నేను కూడా కారణమే. క్రమశిక్షణను ఉల్లంఘించి ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టాను. నా కన్నా ఇతర నాయకులే ఎక్కువ కారకులు. ఇందుకు బాధ్యులెవరన్నది చెప్పను. సీనియర్‌ నాయకుల మధ్య ఉన్న గొడవల కారణంగా పార్టీకి క్షేత్ర స్థాయిలో నష్టం జరుగుతోంది’’ అంటూ వివరణ ఇచ్చారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ బేరసారాల కోసం కాదని కూడా సుప్రియో తెలిపారు. దీనిపై వ్యాఖ్యానించడానికి భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ తిరస్కరించారు. పార్టీలోకి ఎందరో వస్తుంటారు, పోతుంటారు అని అన్నారు. తృణమూల్‌ మాత్రం పదవుల కోసమే సుప్రియో నాటకాలాడుతున్నారని విమర్శించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని