ఎమ్మెల్సీలుగా నలుగురు!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎమ్మెల్సీలుగా నలుగురు!

మోషేను రాజు, తోట త్రిమూర్తులు, రమేశ్‌ యాదవ్‌, లేళ్లఅప్పిరెడ్డి పేర్లతో గవర్నర్‌కు దస్త్రం..
నేడో రేపో ఆమోదం!

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో శుక్రవారం ఖాళీ కానున్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను (గవర్నర్‌ కోటా) భర్తీ చేసేందుకు అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. ఈ మేరకు నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు దస్త్రం పంపినట్లు తెలిసింది. శుక్ర లేదా శనివారం గవర్నర్‌ ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లలో మోషేను రాజు (పశ్చిమ గోదావరి), లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), ఆర్వీ రమేశ్‌ యాదవ్‌ (కడప ప్రస్తుతం ప్రొద్దుటూరు పురపాలక సంస్థలో కౌన్సిలర్‌), తోట త్రిమూర్తులు (తూర్పుగోదావరి) ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో ఒకసారి చివరి నిమిషంలో ఎమ్మెల్సీ అవకాశం కోల్పోయినందుకు మోషేను రాజుకు ఇప్పుడు అవకాశం ఇచ్చినట్లు వైకాపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వలేకపోయిన లేళ్ల అప్పిరెడ్డికి ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఛైర్మన్‌ పదవికి రమేశ్‌ యాదవ్‌కు దాదాపు ఖరారైనా అప్పట్లో సామాజికవర్గాల సమీకరణలో భాగంగా ఆ అవకాశాన్ని ఆయన కోల్పోయారు. ఆయనకు ఇప్పుడు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారని చెబుతున్నారు. తోట త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని ఆయన పేరు పలుమార్లు ప్రచారంలోకి వచ్చింది, ఇప్పుడు ఆయనకు అవకాశం ఇచ్చారంటున్నారు. దాదాపు ఈ నలుగురి పేర్లు గవర్నర్‌ కోటాలో ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు వైకాపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. శుక్రవారంతో పదవీకాలం పూర్తి కానున్న ఎమ్మెల్సీల్లో టీడీ జనార్దన్‌, బీద రవిచంద్ర, గౌనిగారి శ్రీనివాసులు, పి.శమంతకమణి ఉన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని