ఆయన చరిత్ర అందరికీ తెలుసు

ప్రధానాంశాలు

ఆయన చరిత్ర అందరికీ తెలుసు

 సొంత పార్టీ ప్రజాప్రతినిధిపై ఎంపీ భరత్‌రామ్‌ ధ్వజం

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: తనపై నిరాధార ఆరోపణలు చేయడం తగదని, పురుషోత్తపట్నం రైతులనుంచి చెక్కులు తీసుకున్నట్లు ఆధారాలుంటే నిరూపించాలని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. నీతులు చెప్పే ఆ ప్రజాప్రతినిధి చరిత్ర ఏమిటో అందరికీ తెలుసని.. ఆయన చిటికేస్తే వచ్చేది బ్లేడ్‌ బ్యాచ్‌లు, చెయిన్‌ స్నాచింగ్‌, గంజాయి ముఠాలేనని ఆరోపించారు.  రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో మంగళవారం విలేకరులతో ఎంపీ మాట్లాడారు. ‘సొంత పార్టీలోని ఒక ప్రజాప్రతినిధి నన్ను ఉద్దేశించి పరోక్షంగా ఆరోపణలు, వ్యాఖ్యలు చేశారు. పార్టీ గీసిన లక్ష్మణరేఖను నేనెప్పుడూ దాటలేరు. పార్టీకి నష్టం కల్గించే పనులు చేయలేదు. బీసీ సామాజికవర్గానికి చెందిన నాకు ముఖ్యమంత్రి జగన్‌ అవకాశం కల్పించారు. చీకటి ఒప్పందాలు, స్థాయి దిగజారి వ్యవహరించడం చేతకావు. తెదేపా, జనసేన నాయకులతో కుమ్మకైనట్లు నాపై ఆరోపణలు చేస్తున్నవారు సాక్ష్యాధారాలతో బయటపెట్టాలి. పురుషోత్తపట్నం రైతుల బ్యాంకు ఖాతాల వ్యవహారాన్ని ఆధారాలతో బయటపెడితే మంచిది. ఒకరిపై బురదజల్లితే అది మనకంటుకుంటుందని గ్రహించాలి. ప్రవర్తన తీరుపై ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఓ ప్రారంభ సభకు సీబీఐ విశ్రాంత జేడీ లక్ష్మీనారాయణ కూడా హాజరై పలకరించారు. ఆ సందర్భంగా సీఎం జగన్‌ పాలన తీరును ఆయన ప్రశంసించారు. ఎంపీ నిధుల నుంచి రాజానగరం నియోజకవర్గానికి రూ.60 లక్షలు కేటాయించా. ఆ నిధులతో పనులు చేపట్టేముందు నన్ను పిలవాలని కూడా తెలియనివారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నన్నయ వర్సిటీకి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తే ఎవరో తీసుకొచ్చినట్లు ఫేస్‌బుక్‌లో పెట్టుకున్నారు. ఒకే పార్టీలో ఉన్నామనేది గ్రహించాలి. పార్టీకి చెడ్డపేరు తెచ్చే పనులు మానుకోవాలి’ అని ఎంపీ హితవు పలికారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని