ఉపాధి... కల్పనే!
close

సంపాదకీయం

ఉపాధి... కల్పనే!

‘ఉన్నమాట అంటే ఉలుకెక్కువని, ఆ మంత్రిగారు సరిగ్గానే చెప్పారు- చదువుకున్న అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కావూ అని, తప్పేముందిరా ఇందులో?’

‘అన్నన్నా, ఎంత మాటనేశావ్‌!’

‘అవున్రా. పంట నూర్పిళ్ల కాలంలో దొరికే ఉపాధిని ఉపయోగించుకొమ్మంటే అంత కోపమెందుకు? అదే మన పిల్లలు ఏ అమెరికానో, ఆస్ట్రేలియానో వెళ్ళి, అక్కడ పెట్రోల్‌ బంకుల్లో, సూపర్‌ బజార్లలో, రెస్టారెంట్లలో ఖాళీ టైములో పనిచేస్తే అది మనకు గొప్ప! అదే పనిని మనదేశంలో చేయమంటే తప్పెందుకవుతుందీ?’

‘ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగాలిప్పిస్తామని అన్నారు గదా!’

‘ఉపాధి కల్పిస్తామన్నారుగానీ, ఉద్యోగమే ఇస్తామని అనలేదు కదా’

‘కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పింది కదా. ఏవన్నా... అవి ఎక్కడా?’

‘అదేమిట్రా అంత మాటనేశావ్‌? ప్రతి పట్టణంలోనూ, చిన్న చిన్న ఊళ్లలోనూ  పెరిగిపోతున్న సూపర్‌ బజార్లు, మాళ్లు, చైన్‌ షాపులు ఎన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయో ఆలోచించావా? నేను అనడం కాదురా, ఎంతగా వ్యాపారం     చేయకపోతే, జొమాటో పబ్లిక్‌ ఇష్యూ ముప్ఫై ఎనిమిది రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అవుతుంది. నువ్వే చెప్పు?’

‘నువ్వే అలాగంటే ఇకనేనేం చెప్పనన్నా?’

‘అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నుంటాయని అనుకొంటున్నావురా నువ్వు? నూటా ముప్ఫై కోట్ల జనాభాలో, కేంద్రం, రాష్ట్రాలు అన్నింటిలో కలిపితే మూడు కోట్ల ఉద్యోగాలు కూడా ఉండవు. వాటిల్లోనూ సగం ఖాళీగానే ఉంటాయి- ఎందుకంటే ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఎన్నో కొన్ని ఖాళీలు ‘నింపినట్టు’ చూపించాలి కదా! మరి ఇంత తక్కువ దాని కోసం అంత గోల ఎందుకూ అంట?’

‘నువ్వు ఎన్నయినా చెప్పన్నా, ప్రభుత్వ ఉద్యోగమంటే అదొక హోదా. అదొక క్రేజ్‌. అదంతే, మాటల్లో చెప్పలేను’

‘అవసరమే ఆవిష్కరణలకు పురుడు పోస్తుందని ఊరికే అనలేదురా. మనమందరం ఎంతో గొప్పగా ఊహించుకొని పిల్లలను చేర్పించే ప్రైవేటు విద్యా వ్యవస్థ మన దగ్గరైతే ఫీజులు వసూలు చేసిందిగానీ, వాళ్ల దగ్గర పనిచేసే ఎంతోమంది టీచర్లను కరోనా పేరుతో ఎలా ఎండగట్టిందో గమనించావా? ఆ టీచర్లందరూ వేరే దారి లేక రకరకాల ఉపాధి మార్గాలు వెతుక్కొన్నారు. కూరగాయలమ్మడం నుంచి కూలి పనుల దాకా, బజ్జీల బండి నుంచి బాడుగకు బండ్లు నడపడం దాకా ఎన్నెన్ని పనులు వెతుక్కొన్నారో చెప్పనలవి కాదు! మా కాలనీలో కూరల షాపు నడిపే ఓ ప్రైవేటు టీచరైతే బళ్లు తెరచినా వెళ్ళనంటున్నాడు! ఇప్పుడు చేస్తున్నదాంట్లోనే డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌, స్వేచ్ఛ, సంపాదన ఉన్నాయట. పైపెచ్చు, ఇన్నేళ్లూ అనవసరంగా ఉద్యోగమంటూ వెంపర్లాడాననీ వాపోయాడు!’

‘నేననేదీ అదే అన్నా. మంత్రి గారు చెప్పలేదనో, గవుర్మెంటు సలహా ఇవ్వలేదనో ఎవరూ ఉపాధి వెతుక్కోకుండా కూర్చోలేదు. పుల్లట్లు, పునుగులు వేసుకొంటూనో; పానీపూరీలు, పావ్‌భాజీలు అమ్ముకొంటూనో గడిపేస్తున్నారు. అంతెందుకన్నా, చాలా మంది సెల్‌ఫోన్లు రిపేరు చేస్తూ బతికేస్తున్నారు. ఇవేవీ కుదరనివాళ్లు చిన్నాచితకా పనుల్లో కుదురుకొంటున్నారు’.

‘అసలు ఈ ఉద్యోగాల గోలంతా మన దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువరా. మన దగ్గరే చూడు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసేవాళ్లు ఎంత మంది లేరు! వాళ్ల పిల్లలూ చదువుకొంటారు, కానీ ఉద్యోగాలు లేవని ఎవరినీ నిందించరు. వాళ్లకు ఎంతసేపూ, వ్యాపారాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం’.

‘నిజమే అన్నా. ఈ రోజుల్లో కిరాణాకొట్లు సైతం వాళ్లే నడుపుతున్నారు. అంతలా విస్తరించారు వాళ్లందరూ. ఇంతకీ నువ్వు అనేదేంటి. చదువుకోవద్దంటావా?’

‘ఛ ఛ... ఆ మాట నేనెందుకంటానురా? ఇంజినీరింగులు, పీజీలు చదివి రైల్వే గ్యాంగ్‌మెన్‌, గుమాస్తాలుగా మిగిలిపోతున్న ఎంతో మంది, ఆ చట్రంలోంచి బయటికి రాలేక, ఎదుగూ బొదుగూ లేకుండా అలా ఉండిపోతున్నారనేదే నా బాధ’

‘నువ్వు ఎన్నైనా చెప్పు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండే మజాయే వేరన్నా. అది గనక వస్తే ‘జిందగీ బన్‌జాతా’... కాలుమీద కాలేసుకొని బతికేయవచ్చు. అందుగ్గాదూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగమని వెంపర్లాడేది!’
‘అవుననుకో... కానీ...?’

‘ఇంకా కానీ గీనీ ఏంటన్నా, ఏదో మన ప్రభుత్వాలు చల్లగా ఉండి, రెండు మూడేళ్లకోసారైనా ఉద్యోగాలు భర్తీ చేస్తే అంతకంటే ఇంకేం కావాలి? అసలే నోటిఫికేషన్లు వచ్చే కాలం ఇది. ఎవరెవర్ని పట్టుకోవాలో, ఎంతెంత ప్రయత్నం చేయాలో... ఆ పన్లో ఉంటా మరి!’

- శారద


జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo