దావానలంలో వనాలు

సంపాదకీయం

దావానలంలో వనాలు

దేశంలో క్షీణిస్తున్న అటవీ విస్తీర్ణం

ప్రకృతి వైపరీత్యాలకు మానవ తప్పిదాలు తోడవుతూ ఉండటంతో దేశవ్యాప్తంగా అటవీ ప్రాంతం గణనీయంగా తగ్గిపోతోంది. ఫలితంగా పర్యావరణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోంది. కొన్నేళ్లుగా అడవులకు కార్చిచ్చులు శాపంగా పరిణమించాయి. మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఒడిశా, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ తదితర రాష్ట్రాల్లో కార్చిచ్చులు గణనీయంగా అడవులను హరించివేస్తున్నాయి. 2020 నవంబరు నుంచి 2021 జూన్‌ వరకు దేశవ్యాప్తంగా సుమారు 3.45 లక్షలకు పైగా కార్చిచ్చు ఘటనలు సంభవించినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయంటే నష్టం ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. ఈ సమస్యను నివారించేందుకు తక్షణ చర్యలు అవసరమని నిపుణులు గళమెత్తుతున్నారు. అత్యధికంగా ఉత్తరాఖండ్‌లో దావానలాలతో అటవీ విస్తీర్ణం వేగంగా క్షీణిస్తోంది. ఆ రాష్ట్రంలో 53,483 చదరపు కిలోమీటర్ల భూభాగంలో 46,035 చదరపు కి.మీ.లు పర్వత ప్రాంతానికి చెందినవే. మొత్తంగా 71శాతం అటవీ భూమి ఉంది. ఇక్కడి జీవవైవిధ్యం, ఆర్థికరంగం అడవులపైనే అధికంగా ఆధారపడి ఉంటుంది. ఉత్తరాఖండ్‌కు అభివృద్ధి కార్యకలాపాలే పెనుశాపంగా పరిణమించాయి. పెద్దయెత్తున సాగుతున్న రోడ్డు, భవన నిర్మాణాల కారణంగా అటవీ ప్రాంతం రోజురోజుకు తరిగిపోతోంది.  రాష్ట్రంలో రెండు దశాబ్దాలుగా రోడ్లు, భవన నిర్మాణాలు నిరాటంకంగా సాగుతున్నాయి. వీటికి తోడు రాష్ట్రవ్యాప్తంగా పొడవైన సొరంగాల నిర్మాణానికి కేంద్ర రవాణాశాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఆయా ప్రాజెక్టుల విలువ రూ.3,675 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా.

మానవ తప్పిదాలు, ప్రకృతి వైపరీత్యాలు ఉత్తరాఖండ్‌ అటవీ సంపదను నాశనం చేస్తున్నాయి. భూకంపాల ముప్పు ఆందోళనకరంగా ఉంది. ఆకస్మిక వరదలు కుదిపేస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. ఇవన్నీ హిమాలయ రాష్ట్రంలోని పర్యావరణ వ్యవస్థకు హాని తలపెడుతున్నాయి. వేసవిలో కార్చిచ్చు అడవులను దహించి వేస్తోంది. ఫిబ్రవరి-జూన్‌ మధ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంటుంది. అధికారిక గణాంకాల ప్రకారం 2000 సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 44,554 హెక్టార్ల అటవీ భూమి అగ్నికి ఆహుతైంది. 2019లో 2,981 హెక్టార్ల అడవులు నాశనమయ్యాయి. 2020 అక్టోబర్‌- 2021 ఏప్రిల్‌ మధ్య కాలంలో 1,100 అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్‌లో నైనిటాల్‌, తెహ్రీ, అల్మోరా, పౌరి తదితర జిల్లాల అటవీ ప్రాంతాల్లో పెద్దయెత్తున కార్చిచ్చులు చెలరేగి విస్తరించాయి. మూగజీవాల పాలిట దావానలం శాపంగా మారింది. ఏటా అగ్నికి ఆహుతవుతున్న వన్యప్రాణుల సంఖ్య కలవరపాటుకు గురిచేస్తోంది. అంతరించిపోతున్న జీవజాతులపై ఐయూసీఎన్‌ (అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సమాఖ్య) రూపొందించే జాబితా ఎప్పటికప్పుడు పెరిగిపోతోంది. ఎగిరే ఉడతలు, ఎర్ర నక్క, హిమాలయాల్లో కనిపించే అరుదైన ఎలుగుబంటి జాతి, బర్మీస్‌ కొండచిలువ ఇప్పటికే కనుమరుగయ్యాయి. అరుదైన పక్షి జాతులు కూడా దాదాపు అంతరించిపోయాయి. దావానలంతో పది రకాల అల్పైన్‌ చెట్లు కనుమరుగైనట్లు దెహ్రాదూన్‌లోని అటవీ పరిశోధన సంస్థ (ఎఫ్‌ఆర్‌ఐ) పరిశోధనల్లో వెలుగు చూసింది. ఉత్తరాఖండ్‌ అటవీ భూముల పరిరక్షణ, నిర్వహణ లక్ష్యాలు విఫలమయ్యాయన్నది సుస్పష్టం. విధానాల అమలులో లోపాలపై ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాలతో అటవీ సంపదకు గండిపడుతున్నట్లు ప్రత్యక్షంగా కనిపిస్తున్నా, ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడం బాధాకరం. అడవులు సమృద్ధిగా ఉంటేనే పర్యావరణ వ్యవస్థకు శ్రేయస్కరం. అందుకని అడవుల పరిరక్షణ కోసం రూపొందించిన చట్టాలను కఠినంగా అమలు చేయాలి.  
కార్చిచ్చు నియంత్రణ వ్యవస్థ, అటవీ, వన్యప్రాణుల సంరక్షణ చట్టాలు, పులులు, ఏనుగుల పరిరక్షణ కోసం చేపట్టిన ప్రాజెక్టులు అక్కరకు రాకుండా పోయాయి. అటవీ మాఫియా గంధపుచెక్క, టేకును విచ్చలవిడిగా నరికేసి సొమ్ము చేసుకొంటోంది. వన్యప్రాణుల్నీ విడిచిపెట్టడం లేదు. దీంతో దిగువ హిమాలయ ప్రాంతాల్లో వృక్షజాలం, జీవజాతులు అదృశ్యమవుతున్నాయి. దావానలాన్ని గుర్తించేందుకు 2004లో దెహ్రాదూన్‌లో ఏర్పాటు చేసిన వ్యవస్థనే ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. ఈ వ్యవస్థలో అనేకమార్లు లోపాలు బయటపడ్డాయి. కార్చిచ్చుకుగల కారణాలను లోతుగా అన్వేషించి, తగిన చర్యలు చేపట్టాల్సిన సమయం ఇది. ఇప్పుడున్న నిబంధనలు, ప్రాజెక్టులు, ప్రణాళికల అమలులో లోపాలున్నట్లు స్పష్టమవుతోంది. వాటిని తక్షణమే తొలగించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ కార్యాచరణతో కదలాలి. నూతన పరిశోధనలకు నిధులు అందించి జీవజాతుల పరిరక్షణకు తోడ్పడాలి. అప్పుడే అత్యంత సున్నిత ప్రాంతమైన ఉత్తరాఖండ్‌లో అటవీ సంపద వృద్ధి చెంది పచ్చదనం పరిమళిస్తుంది.

- ఆర్‌.పి.నైల్వాల్‌ (ఉత్తరాఖండ్‌ వ్యవహారాల నిపుణులు)


జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo