
తెలంగాణ
నారా భువనేశ్వరి ఆవేదన
ఈనాడు, అమరావతి: ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఏపీ శాసనసభలో తనకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకూడదని ఆకాంక్షించారు. అసెంబ్లీలో తనకు జరిగిన అవమానంపై నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘చిన్నతనం నుంచి అమ్మ, నాన్న మమ్మల్ని విలువలతో పెంచారు. నేటికీ వాటిని పాటిస్తున్నాం. శాసనసభలో నాపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ ధన్యవాదాలు. నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకు, కూతురుకి జరిగినట్టుగా భావించి నాకు అండగా నిలవడం జీవితంలో మర్చిపోలేను’ అని భువనేశ్వరి పేర్కొన్నారు. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలనీ.. కష్టాల్లోనూ, ఆపదలోనూ ఉన్న వారికి అండగా నిలబడాలని ఆమె ఆకాంక్షించారు.