
తెలంగాణ
డిసెంబరు 1న ధ్రువీకరణపత్రాల పరిశీలన
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్షల తుది ఫలితాల్ని శనివారం విడుదల చేశారు. 151 పోస్టుల కోసం గత జులై 4న నోటిఫికేషన్ విడుదల చేయగా, గత అక్టోబరు 24న జరిగిన రాతపరీక్ష జరిగింది. దీనికి 2741 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పారదర్శకత కోసం మూల్యాంకనం చేసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లతోపాటు పరీక్ష ఫలితాలను మండలి వెబ్సైట్ www.tslprb.in. లో, వ్యక్తిగత లాగిన్లలో అందుబాటులో ఉంచారు. అర్హత సాధించిన అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన లేఖనూ పొందుపరిచారు. ఆ లేఖను డౌన్లోడ్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలని మండలి వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంలో ఏవైనా సాంకేతిక సమస్యలుంటే support@tslprb.in కు ఈమెయిల్ చేయాలని, లేదా 93937 11110లో సంప్రదించాలని మండలి ఛైర్మన్, అదనపు డీజీపీ వి.వి.శ్రీనివాసరావు సూచించారు. అర్హత సాధించిన అభ్యర్థులు డిసెంబరు 1న హిమాయత్‌సాగర్‌లోని ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాలన్నారు. ఒరిజినల్ ధ్రువీకరణపత్రాలతోపాటు నకలు ప్రతుల్ని వెంట తెచ్చుకోవాలని సూచించాయి. 2014 జూన్ 2 తర్వాత పొందిన కుల ధ్రువీకరణపత్రాన్ని మాత్రమే అంగీకరిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులు కొవిడ్ నిబంధనలను పాటించాలన్నారు.