
తెలంగాణ
బ్రోంకస్-2021 సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఈనాడు, హైదరాబాద్: వైద్యం, పర్యాటక రంగాలకు భారత్ కేంద్రంగా మారుతోందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. చాలా దేశాల నుంచి వైద్య సేవల కోసం భారత్‌ను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో అత్యాధునిక ఆసుపత్రులు అందుబాటులోకి వస్తున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాటిలైట్ ఆధారిత చికిత్స కేంద్రాలను ప్రారంభించడం ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని అభిప్రాయం వ్యక్తంచేశారు. యశోద ఆసుపత్రుల ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్స్‌లో రెండు రోజులు జరిగే ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ సదస్సు (బ్రోంకస్-21)ను ఆయన శనివారం దిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించి మాట్లాడారు. ‘‘సమాజంపై కరోనా తీవ్ర ప్రభావం చూపినప్పటికీ మన ఆరోగ్య వ్యవస్థలు, మౌలిక సదుపాయాల తీరు.. ఇలా చాలా విషయాల్లో పాఠాలను నేర్పింది. ప్రధాన నగరాల్లో గాలి నాణ్యత క్షీణించడంతో ఊపిరితిత్తుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వాహన కాలుష్యం, మానవ తప్పిదాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత వరకు కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలి’’ అని వెంకయ్యనాయుడు అన్నారు. యశోద ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. వైద్యులకు విధానపర నైపుణ్యాలను అందించడం, కొత్త చికిత్స విధానాల ఆవిష్కరణ, కరోనా సమయంలో పల్మనాలజిస్టులు ఎదుర్కొన్న సవాళ్లపై చర్చించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని చెప్పారు.