
తెలంగాణ
డిపాజిట్లన్నీ ఏపీ ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషన్‌కు మళ్లించాల్సిందే..
సంస్థలు, బోర్డులకు ఆ రాష్ట్రం ఉత్తర్వులు
ఈనాడు - అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంబంధిత సంస్థలు ఇక తమ వద్ద ఉన్న ప్రజాధనాన్ని వేరే ఏ బ్యాంకుల్లోనూ డిపాజిట్ చేయడానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. కంపెనీ చట్టం కింద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషన్లోనే ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. ప్రజాధనం రక్షణకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. దీని ప్రకారం ప్రభుత్వ కార్పొరేషన్లు, సొసైటీలు, బోర్డులు, ట్రస్టులు, సంస్థలు, యూనివర్సిటీలు, ప్రత్యేక ప్రయోజనార్థం ఏర్పాటు చేసిన సంస్థలు మొదలైనవన్నీ తమ దగ్గరున్న మిగులు నిధులు, ఇతరత్రా వసూలు చేసిన ఏ రకమైన సొమ్మునైనా సరే ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషన్లోనే డిపాజిట్ చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు, ఇతర దేవాలయ సంస్థలకు మాత్రం ఈ ఉత్తర్వుల నుంచి మినహాయింపు లభించింది.
కంపెనీ చట్టం కింద ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రిజర్వు బ్యాంకు వద్ద బ్యాంకింగేతర ఫైనాన్షియల్ కంపెనీగా దీన్ని నమోదు చేసింది. ప్రభుత్వ సంస్థలు తమ నిధులను ఈ కార్పొరేషన్లో కూడా డిపాజిట్ చేయవచ్చని 2020 మార్చి నెలలో ఉత్తర్వులిచ్చింది. దీంతోపాటు ఇతర వాణిజ్య షెడ్యూలు బ్యాంకుల్లోనూ సొమ్ములు జమ చేయడానికి వెసులుబాటు ఇచ్చింది. ఇప్పుడు ఆ వెసులుబాటును తొలగించి కేవలం ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషన్లో మాత్రమే నిధులు జమ చేయాలని, అప్పుడే ఆ నిధులకు రక్షణ ఉంటుందని పేర్కొంది.
ఇటీవల కాలంలో ప్రభుత్వ కార్పొరేషన్ల నిధులు అక్రమంగా మళ్లించిన అంశాలను జీవోలో ఉదహరించింది. ఏపీ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ నిధులు రూ.9.60 కోట్లలో కొన్నింటిని ప్రైవేటు ఖాతాకు మళ్లించారని ఉదహరించింది. ఏపీ ఆయిల్ సీˆడ్ కార్పొరేషన్ నిధులు రూ.5 కోట్లు కూడా ఆ కార్పొరేషన్‌కు తెలియకుండా మళ్లించారని పేర్కొంది. ఇలాంటి అవకతవకలు జరగకుండా ఉండటానికే ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన ఆదేశాల్లో వివరించారు. అయితే ఇటీవల కొన్ని సంస్థలపై ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషన్‌కు నిధులు మళ్లించాలని ఒత్తిడి వచ్చినా వారు వినలేదు. తమ పాలకవర్గ సమావేశాల్లో వ్యతిరేకించారు. ఆ నేపథ్యంలోనే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయనే చర్చ సాగుతోంది.