
ఆంధ్రప్రదేశ్
మాట్లాడుతున్న సోము వీర్రాజు.చిత్రంలో రావెల కిశోర్‌బాబు, దేవానంద్, కన్నా
ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రాయోజిత పథకాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన పేరు పెట్టుకోవటం విడ్డూరమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఇప్పటిదాకా 36 పథకాలకు జగన్ తన పేరు పెట్టుకున్నారని తెలిపారు. ఆదివారం గుంటూరులో పార్టీ ఎస్సీ మోర్చా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ ఆమోద ఉత్సవాల్లో సోము వీర్రాజు మాట్లాడారు. ప్రధాని మోదీ గతంలో రాష్ట్రానికి వచ్చినప్పుడు చంద్రబాబుకు ‘స్టిక్కర్ బాబు’ అని పేరు పెట్టారని, అదే జగన్‌కైతే తాము ‘డబుల్, ట్రిపుల్ స్టిక్కర్ జగన్’ అని పెడతామన్నారు. ‘చంద్రబాబు హయాంలో నిర్మించిన ఇళ్లకు కేంద్రం రూ.10 వేల కోట్లు మంజూరు చేస్తే.. అవే ఇళ్లకు ప్రస్తుతం జగన్ తన పేరు పెట్టుకొని డబ్బులు కట్టించుకుని రిజిస్ట్రేషన్ చేస్తామనడం ఏంటని ప్రశ్నించారు. అంబేడ్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ తదితరులు పాల్గొన్నారు.