
ఆదివార అనుబంధం
కొత్త రంగులు దూసుకెళ్తున్నాయ్!
రోడ్లమీద వేగంగా దూసుకుపోతున్న కార్లని గమనించండి... వాటిల్లో మూడు వంతులకు పైగా తెలుపు రంగువే కనిపిస్తాయి. అక్కడక్కడా నలుపూ గ్రే షేడ్స్ కూడా ఉంటుంటాయి. కానీ ఇటీవల ఎన్నింటి మధ్య ఉన్నా టకీమని గుర్తుపట్టేలా మిరుమిట్లు గొలిపే సరికొత్త రంగులూ కనిపించడం విశేషం.
కారు... కొనుక్కుందామన్న ఆలోచన రాగానే బడ్జెట్‌ని బట్టి ముందుగా ఏ కంపెనీ అనేది ఆలోచిస్తాం... ఆపై అందులోని ఫీచర్లకు ప్రాధాన్యం ఇస్తుంటాం. ఆ తరవాతే రంగుని ఎంపిక చేసుకుంటాం. అందుకే కార్ల కంపెనీలన్నీ కూడా క్లాసిక్ లుక్ అనిపించే తెలుపూ నలుపూ రంగుల్లోనూ గ్రే షేడ్‌లో మాత్రమే ప్రధానంగా కార్లను తీసుకొచ్చేవి. గతేడాది మార్కెట్లో అమ్ముడు పోయిన వాటిల్లోనూ 64 శాతం ఈ మూడు రంగులే ఉన్నాయట. వాటిల్లో మళ్లీ తెలుపు రంగు కార్లదే హవా. ఇక, అడపాదడపా ఎరుపూ మెరూన్ కనిపిస్తుంటాయి. అయితే అదంతా ఒకప్పుడు... ఇప్పుడు ట్రెండ్ మారింది. అది పెళ్లికి వేసుకునే డ్రెస్సయినా నడిపే కారైనా తమదైన ప్రత్యేకతతో ఉండాలని కోరుకుంటోంది ఈతరం. అంటే- ముందు కళ్లను ఆకర్షించాలి. ఆ తరవాతే మిగిలిన ఫీచర్లన్నీ అనుకుంటోందన్నమాట. అందుకే ఇప్పుడు ఆయా కంపెనీలు సైతం బడ్జెట్‌తో సంబంధం లేకుండా సాధారణ స్థాయి నుంచి లగ్జరీ వాహనాల వరకూ అన్నింటినీ వైబ్రంట్ కలర్స్‌లో తీసుకొస్తున్నాయి.
మనదేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ అయిన మారుతి, సెలీరియా ఎక్స్ మోడల్ని ప్యాప్రికా ఆరెంజ్ షేడ్తోనూ, జెన్ ఎస్టిలో మోడల్ని వంగపండు రంగులోనూ మార్కెట్లోకి తీసుకొచ్చింది. హోండాసిటీ- ఎమరాల్డ్ గ్రీన్ పెరల్ కలర్‌తో చమక్మనిపిస్తే; మహీంద్రా థార్- ఆక్వామెరైన్, టాటా ఇండికా ఈ-జీటా- ఆపిల్ గ్రీన్, ఫియట్ పేలియో- క్యానరీ ఎల్లో, టాటా టియాగో- విక్టరీ ఎల్లో రంగులతో వినియోగదారుల్ని ఆకర్షిస్తున్నాయట. ఇక, లగ్జరీ బ్రాండ్ అయిన బిఎండబ్ల్యు ఎం3, ఎం4 సిరీస్‌కి అద్దిన ‘ఐలె ఆఫ్ మ్యాన్ గ్రీన్’ షేడ్ కళ్లను కట్టిపడేస్తోంది. అలాగే షెవర్లె కర్వెటె నారింజ వర్ణంలో మెరిస్తే; నిసాన్ కంపెనీ కిక్స్, సెంట్రా మోడల్స్‌ని మోనార్క్ ఆరెంజ్, సూపర్ బ్లాక్ మేళవించిన రంగులతో తీసుకొస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే- మెర్సిడెజ్ బెంజ్ ఈమధ్య హరివిల్లు రంగులతో ‘ప్రైడ్’ మోడల్‌ను డిజైన్ చేసి అందరినీ ఆకర్షించింది. ఆమధ్య బెంట్లీ కంపెనీ కరోనా నేపథ్యంలో పెట్టిన ఆన్లైన్ పోటీలో హరివిల్లు రంగులతో డిజైన్ చేసిన మోడల్ మొదటి బహుమతిని గెలుచుకుందట. పోస్టర్ కారుగా పేరొందిన లాంబొర్గిని కస్టమర్లకి వందకి పైగా రంగుల ఛాయిస్ ఇచ్చింది. అయినా లాంబొర్గిని గెలార్డొ కారుని సైతం హరివిల్లు రంగుల్లోకి మార్చుకున్నాడో రంగుల ప్రియుడు. చూశారుగా మరి... మోడల్స్మీదే కాదు, రంగుల మీద పెరుగుతోన్న మోజునీ దృష్టిలో పెట్టుకునే ఆయా కంపెనీలు కార్లకు సరికొత్త వైబ్రంట్ కలర్స్‌ని అద్దేస్తున్నాయన్నమాట.