ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

ఈనాడు, కాకినాడ: గోదావరి ప్రవాహం దాదాపుగా నిలకడగా ఉంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 6 గంటలకు బ్యారేజీలో నీటిమట్టం 14.90 అడుగులు ఉంటే.. సముద్రంలోకి 14,62,217 క్యూసెక్కుల జలాలు వదిలారు. సాయంత్రం 5 గంటలకు నీటిమట్టం 14.80 అడుగులకు చేరగా... కడలిలోకి 14,44,414 క్యూసెక్కులు విడిచిపెట్టారు. గోదావరి వరద ఉద్ధృతికి కోనసీమలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీపాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, సఖినేటిపల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాలపై వరద ప్రభావం చూపింది.. కాజ్‌వేలు, లోతట్టు ప్రాంతాల్లోని రహదారులు జలమయం అయ్యాయి. ఆయా మండలాల్లోని లంక భూములతో పాటు తూర్పుగోదావరి జిల్లా పెరవలి, తాళ్లపూడి, నిడదవోలు, కొవ్వూరు మండలాల్లోని లోతట్టు ప్రాంతాల పంట భూములు ముంపునకు గురయ్యాయి.


మరిన్ని

ap-districts
ts-districts