
బస్సు కాదు బుస్సు
తుక్కు చేయాల్సినవి రోడ్డెక్కిస్తున్నారు
ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం..
చక్రాలు, స్టీరింగ్ ఊడుతున్నా పట్టింపే లేదు
12 లక్షల కి.మీ. పైగా తిరిగినవి 3,777
సూపర్ లగ్జరీల్లోనూ ఇదే పరిస్థితి
ఛార్జీల మోత సరే.. కొత్త బస్సులేవీ?
ఏలూరు జిల్లాలో ఇటీవల జంగారెడ్డిగూడెం నుంచి తాడేపల్లిగూడెం వెళ్తున్న పల్లెవెలుగు బస్సుకు నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం సమీపంలో స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది. రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని పొలాల్లోకి దూసుకుపోయింది. అందులో ఉన్న 27 మంది ప్రయాణికులు కొద్దిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఇటీవలే ఆ విద్యుత్ స్తంభానికి ఉండే వైర్లను తొలగించారు. లేకపోతే ఘోరం జరిగి ఉండేది!
ఆర్టీసీలో కాలంచెల్లిన బస్సులు నిత్యం ఎక్కడోచోట ప్రమాదానికి గురవుతున్నాయి. అదుపుతప్పి పొలాల్లోకో, పిల్లకాల్వల్లోకో దూసుకుపోవడం, రన్నింగ్‌లోనే చక్రాలు ఊడిపోవడం వంటి సంఘటనలు చోటుచేసకుంటున్నాయి. ప్రయాణం మధ్యలో రోడ్లపై ఆగిపోతున్నవి మరికొన్ని. అసలే అడుగుకో గుంతతో అధ్వానంగా ఉన్న రహదారులపై బస్సుల్లో ప్రయాణం ప్రహసనంగా మారింది. వీటికితోడు అత్యధిక కిలోమీటర్లు తిరిగేసిన బస్సులను పక్కనపెట్టకుండా నిత్యం పరుగులు పెట్టిస్తుండటంతో అవి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆర్టీసీ ఇటువంటి బస్సులను రోడ్డెక్కించి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందనే విమర్శలు వస్తున్నాయి. సెస్సుల పేరుతో పదేపదే ఛార్జీలు పెంచి ప్రయాణికులపై కోట్లాది రూపాయల భారం వేస్తున్న ఆర్టీసీ.. కొత్త బస్సుల్ని అందుబాటులోకి తీసుకు రావడంపై మాత్రం దృష్టిపెట్టడంలేదు. ఛార్జీలు ఎక్కువైనా డొక్కు బస్సుల్లోనే ప్రయాణించండి అనేలా వ్యవహరిస్తోంది.
ఏపీఎస్ ఆర్టీసీలో జులై నెల లెక్కల ప్రకారం 9,004 సొంత బస్సులు ఉన్నాయి. వీటిలో 12 లక్షల కి.మీ.కు పైగా తిరిగేసినవి 3,777 ఉంన్నాయి. ఇవి నిత్యం పరుగులు పెడుతూనే ఉన్నాయి. సాధారణంగా తిరుమల ఘాట్‌లో తిరిగే సప్తగిరి బస్సులను 7 లక్షల కి.మీ.లు, సూపర్‌లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ వంటి సర్వీసులు 10 లక్షల కి.మీ. తిరిగిన తర్వాత వాటిని బాడీ మార్పు చేసి పల్లెవెలుగు సర్వీసులుగా నడుపుతుంటారు. అవి కూడా 12 లక్షల కి.మీ. వరకే నడపాలి. ఆ తర్వాత తుక్కు చేయాలి. కానీ కొత్త బస్సుల కొనకపోవడంతో ఈ కాలం చెల్లిన బస్సులనే రోడ్డెక్కిస్తున్నారు. ఇవి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి.
పల్లెవెలుగుల్లో మూడొంతులు ఇవే
* ఆర్టీసీ సొంత బస్సుల్లో పల్లెవెలుగు సర్వీసులు 4,121 ఉండగా, వాటిలో 12 లక్షల కి.మీకు పైగా నడిచినవి 3,053 ఉన్నాయి. అంటే ప్రతి నాలుగింట మూడు కాలం చెల్లినవి కిందే లెక్క. 15 లక్షల కి.మీ.కు పైగా తిరిగినవి సైతం 548 ఉండటం గమనార్హం.
* సిటీ ఆర్డినరీ సర్వీసుల్లోనూ దాదాపు సగం కాలం చెల్లినవే. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 703 సిటీ సర్వీసులు ఉన్నాయి. వాటిలో 12 లక్షల కి.మీ.కు పైగా నడిచినవి 341 ఉన్నాయి. 15 లక్షల కి.మీ. కంటే ఎక్కువ తిరిగినవి 51 బస్సులు ఇంకా పరుగులు పెడుతూనే ఉన్నాయి.
* ప్రైవేటు ట్రావెల్స్తో పోటీ పడాలంటే.. దూర ప్రాంతాలకు తిరిగే సూపర్ లగ్జరీ సర్వీసులు మంచి కండిషన్లో ఉన్నవి నడపాలి. 10 లక్షల కి.మీ. దాటిపోతే, వాటి స్థానంలో కొత్తవి తీసుకోవాలి. కానీ మొత్తం 1,254 సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 లక్షల కి.మీ.కు పైగా తిరిగినవి 439 ఇంకా నడుస్తూనే ఉన్నాయి.
వాటాకు సిద్ధమైన ప్రభుత్వం
ఉద్యోగుల జీతాలు ప్రభుత్వం ఇస్తున్నందున.. ఆర్టీసీ రాబడిలో తమకు వాటా ఇవ్వాలని చాలాకాలంగా ప్రభుత్వం అడుగుతోంది. ఇందులో భాగంగా 25 శాతం ఆర్టీసీ యాజమాన్యం ఇవ్వనుంది. టికెట్ ఛార్జీలు పెరగడంతో ప్రస్తుతం నెలకు సగటున రూ. 500 కోట్ల వరకు రాబడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో రూ. 125 కోట్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. యాజమాన్యం కొత్త బస్సుల కొనుగోళ్లపై దృషి ్టపెట్టడం లేదు. 2020లో హడావిడిగా 300 బస్సులు కొన్నారు. తర్వాత కొత్త బస్సుల ఊసు లేదు. పల్లెవెలుగు బస్సులైతే పాతవాటికే సీట్లు మార్చి, రంగులు వేసి, లైటింగ్ వంటి లోపాలు సరిచేసి నడుపుతున్నారు. అలాగే అద్దె బస్సుల సంఖ్యను పెంచుకోవడంపైనే ఎక్కువ దృష్టిపెడుతున్నారు. కొద్దినెలల కిందట 998 అద్దె బస్సులు తీసుకోడానికి టెండర్లు పిలిస్తే.. 339 బస్సులకే ప్రైవేటు యజమానులు ముందుకొచ్చారు. తర్వాత 659 బస్సులకు టెండర్లు పిలిచారు. ఇటీవలే 372 సూపర్‌లగ్జరీ, 82 అల్ట్రా డీలక్స్, 152 సప్తగిరి సర్వీసులు (తిరుమల ఘాట్‌లో తిరిగేవి), 11 ఏసీ బస్సులు కలిపి మొత్తం 617 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీనికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంది.
క్షేమంగా తిరిగి వస్తే గట్టెక్కినట్లే..
కాలం చెల్లిన బస్సులు తరచూ పాడవుతున్నాయి. వారంలో కనీసం రెండు, మూడుసార్లు మరమ్మతులు చేయాల్సి వస్తోందని, ఎంత బాగుచేసినా మళ్లీ ఏదో ఒక సమస్య వస్తోందని ఆర్టీసీ మెకానిక్ ఒకరు తెలిపారు. దారిలో ఎక్కడ ఆగిపోతుందో తెలియదని, డిపో నుంచి బయటకు వెళ్లి.. ఆగకుండా తిరిగి వస్తే ఆ రోజుకు గట్టెక్కినట్లే అని పల్లెవెలుగు సర్వీసు డ్రైవర్ ఒకరు వాపోయారు.
- ఈనాడు, అమరావతి
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Usman Khawaja: వీసా ఆలస్యంతో ఆస్ట్రేలియా ఓపెనర్ అసంతృప్తి.. ఫన్నీ పోస్ట్ వైరల్
-
Movies News
Kiara Sidharth Malhotra: కియారా- సిద్ధార్థ్‌ల వివాహం అప్పుడేనా? శరవేగంగా పనులు..!
-
Movies News
Mukhachitram: విశ్వక్సేన్ ‘ముఖచిత్రం’.. ఓటీటీలోకి వచ్చేస్తోంది!
-
General News
Top 10 Budget Stories: కేంద్ర బడ్జెట్ - 2023 ప్రత్యేక కథనాలు!
-
Movies News
Social Look: సిల్క్‌స్మితలా దివి పోజు.. మేఘ ‘ప్రేమదేశం’ అప్పుడే
-
Movies News
Kichcha Sudeep: ఆమె చేసిన త్యాగాల వల్లే నేను ఇక్కడ ఉన్నా: కిచ్చా సుదీప్