ప్రైవేటుకు పర్యాటకం

22 రెస్టారెంట్లు, కాటేజీలు, ఫుడ్‌ కోర్టులు లీజుకు..
టెండర్లను ఆహ్వానించిన పర్యాటకాభివృద్ధి సంస్థ
బ్యాంకు రుణంతో ఆధునికీకరణ వట్టిమాటేనా?
ఈనాడు - అమరావతి

ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల చేతుల్లోకి పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కి చెందిన పలు విలువైన ఆస్తులు వెళ్లనున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోగల 22 రెస్టారెంట్లు, కాటేజీలు, ఫుడ్‌ కోర్టులను ప్రైవేట్‌ సంస్థలకు కనిష్ఠంగా 5 ఏళ్లు, గరిష్ఠంగా 20 ఏళ్లపాటు లీజుకి ఇవ్వనున్నారు. ఇందుకోసం ఏపీటీడీసీ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. ఒక జాతీయ బ్యాంకు ఆర్థిక సాయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, కాటేజీలను ఆధునీకరిస్తామని ఒక వైపున చెబుతూ...ఇంకోవైపున ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేయడం ఏపీటీడీసీలో చర్చనీయాంశమవుతోంది.

లీజుకిచ్చే ఆస్తులివే..

వైయస్‌ఆర్‌ జిల్లాలో కడపలోని హరిత హోటల్‌లో వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే 2,767 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు ఇవ్వనున్నారు. సిద్దవటంలో రెస్టారెంట్‌, గండికోటలో 15 టెంట్లు, కిచెన్‌, రెస్టారెంట్‌కి టెండర్‌ పిలిచారు.

సత్యసాయిజిల్లా వెంకటాపురంలో హోటల్‌, కర్నూలులో బ్యాంకెట్‌ హాలు, తిరుపతిజిల్లా తడలో రెస్టారెంట్‌, కాన్ఫరెన్స్‌ హాలు, బీవీ పాలెంలో బార్‌, 15 ఉడెన్‌ కాటేజీలు, రెస్టారెంట్‌, ఇసకపల్లిలో రెస్టారెంట్‌, బార్‌ లీజుకి ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే జిల్లాలోని కొత్త కోడూరు, ఉదయగిరి, రామతీర్థంలోని రెస్టారెంట్లు కూడా లీజుకి పెట్టారు.

ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ దగ్గర్లోని రెస్టారెంట్‌, ఎనిమిది కాటేజీలు, స్విమ్మింగ్‌ పూల్‌, తిరుపతి జిల్లా పుత్తూరులోని రెస్టారెంట్‌, పల్నాడు జిల్లాలో ధ్యానబుద్ద సమీపంలోని హోటల్‌, కోటప్పకొండలో రెస్టారెంట్‌, ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలోని ముక్త్యాలలోని రెస్టారెంట్‌ లీజుకి ఇవ్వాలని నిర్ణయించారు.

శ్రీకాకుళం జిల్లా శాలిహుండంలోని ఎమినిటీ సెంటర్‌లో గదులతోపాటు రెస్టారెంట్‌, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా అరకులోగల డ్రైవ్‌-ఇన్‌ రెస్టారెంట్‌, బుద్దిస్ట్‌ సర్క్యూట్‌లోని అమరావతి, బావికొండ, గుంటుపల్లె, భట్టిప్రోలు వసతులను లీజుకి పెట్టారు.

రుషికొండ బీచ్‌లో ప్రవేశానికి రుసుము?

రాష్ట్రంలోని ఏకైక బ్లూఫ్లాగ్‌ బీచ్‌ రుషికొండ(విశాఖపట్నం)లో ప్రవేశానికి రాబోయే రోజుల్లో రుసుములు చెల్లించాల్సిందే.  బీచ్‌ నిర్వహణను ప్రైవేట్‌ సంస్థకు అప్పగించాలని ఏపీటీడీసీ నిర్ణయించింది.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు