JSW Energy: జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ₹10వేల కోట్ల భారీ కొనుగోలు ఒప్పందం

దిల్లీ: మిత్రా ఎనర్జీ నుంచి 1.75 గిగావాట్ల పునరుత్పాదక ఎనర్జీకి సంబంధించిన ఆస్తులను తమ అనుబంధ సంస్థ జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ కొనుగోలు చేయనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తెలిపింది. ఈ ఒప్పంద విలువ రూ.10,530 కోట్లు. జేఎస్‌డబ్ల్యూ ఏర్పాటైన తర్వాత ఇదే అతిపెద్ద కొనుగోలు కావడం విశేషం. ఈ ఒప్పందానికి ‘కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI)’ అనుమతి లభించాల్సి ఉంది. 

ఈ కొనుగోలుతో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం 4.78 గిగావాట్ల నుంచి 35 శాతం పెరిగి 6.53 గిగావాట్లకు చేరనుంది. మరో 2.5 గిగావాట్ల విండ్‌, హైడ్రో ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. వచ్చే 18-24 నెలల్లో దశలవారీగా ఇవి అందుబాటులోకి రానున్నాయి. దీంతో కంపెనీ మొత్తం సంస్థాగత సామర్థ్యం 9.1 గిగావాట్లకు చేరుతుంది. దీంట్లో పునరుత్పాదక ఇంధనానిదే 65 శాతం వాటా. 2024-25 నాటికి కంపెనీ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని 10 గిగావాట్లకు పెంచుకోవాలన్నది కంపెనీ లక్ష్యం.

మిత్రా పోర్ట్‌ఫోలియోలో 1.33 గిగావాట్ల విండ్‌ ఎనర్జీ, 422 మెగావాట్ల సౌర ఇంధన ఉత్పత్తి కేంద్రాలున్నాయి. దక్షిణ, పశ్చిమ, మధ్యభారత్‌లో ఈ కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.


మరిన్ని

ap-districts
ts-districts