బహుళత్వం భారత్‌తోనే సాధ్యం: ఆరెస్సెస్‌ చీఫ్‌

ముంబయి: సమాజంలో భిన్నత్వాన్ని సమగ్రంగా కాపాడగలిగేది భారత్‌ మాత్రమేనని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) అధినేత మోహన్‌ భగవత్‌ అన్నారు. ఈ వైవిధ్యాన్ని సమర్థవంతంగా ఎలా నిర్వహిస్తామన్నది ప్రపంచమంతా గమనిస్తోందని చెప్పారు. ‘2047లో భారత్‌’ పేరిట ఆదివారం నాగ్‌పుర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో భగవత్‌ ప్రసంగించారు. దేశ ప్రజలు భయాన్ని వీడి, త్యాగాలకు సిద్ధపడినప్పుడే అఖండ భారతావని ఆవిష్కృతం  అవుతుందన్నారు. ‘మన చరిత్రను మనకు సరైన రీతిలో బోధించలేదు. సంస్కృత వ్యాకరణం ఇండియాలో పుట్టలేదు. ఆ విషయాన్ని మనమెప్పుడైనా ప్రశ్నించామా? మనదైన సొంత విజ్ఞానాన్ని మరిచిపోయాం. తర్వాతే పశ్చిమ, ఉత్తరాది దేశాల వారు దండెత్తి వచ్చి మన భూమిని ఆక్రమించుకున్నారు’ అని వివరించారు. ‘కుల, విభజన వ్యవస్థలకు అనవసర ప్రాధాన్యమిచ్చాం. మన భాషలు, వస్త్రధారణ, సంస్కృతుల్లో వైవిధ్యం ఉంది. వీటికే పరిమితం కాకుండా విశాల దృక్పథంతో ఆలోచించాలి. అన్ని భాషలూ జాతీయ భాషలే. అన్ని కులాలూ నావే అన్న భావన అలవడితేనే విశాల భారత్‌ ఆవిర్భవిస్తుంది’ అని భగవత్‌ వివరించారు. భారత్‌కు 2,400 ఏళ్ల చరిత్ర మాత్రమే ఉందని పరిశోధకులు చెప్పడాన్ని ఆక్షేపించిన ఆరెస్సెస్‌ అధినేత.. క్రీస్తుపూర్వం 9 వేల ఏళ్ల నాటికే సింధూ-సరస్వతి నాగరికత విలసిల్లిందని గుర్తు చేశారు.


మరిన్ని

ap-districts
ts-districts