బిల్కిస్‌ కేసులో దోషుల విడుదలపై దుమారం

భాజపాపై విపక్షాల విమర్శలు
సమర్థించుకున్న గుజరాత్‌ ప్రభుత్వం

అహ్మదాబాద్‌/ దిల్లీ: గుజరాత్‌లో చోటుచేసుకున్న బిల్కిస్‌ బానో సామూహిక అత్యాచార కేసులో 11 మంది దోషులను విడుదల చేయడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. ఈ అంశంలో భాజపా లక్ష్యంగా విమర్శలు గుప్పించాయి. ఈ వ్యవహారంలో గుజరాత్‌ సర్కారు తన చర్యను సమర్థించుకుంది. 1992 నాటి రెమిషన్‌ విధానం కింద ఖైదీలను విడుదల చేసినట్లు తెలిపింది. 2002లో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆమె కుటుంబానికి సంబంధించిన ఏడుగురిని పాశవికంగా చంపేశారు. హతుల్లో బిల్కిస్‌కు చెందిన మూడున్నరేళ్ల కుమార్తె కూడా ఉంది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులందరినీ గుజరాత్‌ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సోమవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బానో భర్త యాకుబ్‌ రసూల్‌ విస్మయం వ్యక్తంచేశారు. ‘‘దోషుల దరఖాస్తులను ఎప్పుడు పరిశీలించారో, వారి విడుదలకు ఆదేశాలిచ్చేటప్పుడు ఏ నిబంధనలను పరిగణనలోకి తీసుకున్నారో తెలియదు. ఈ విషయంలో మాకు ఎలాంటి సమాచారం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తమకు రూ.50 లక్షల పరిహారాన్ని అందించినప్పటికీ ఉద్యోగం కానీ ఇల్లు కానీ ఇవ్వలేదని తెలిపారు. దోషుల విడుదలపై విపక్షాలు దిల్లీలో మండిపడ్డాయి. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ‘నారీ శక్తి’పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించిన కొద్దిగంటల్లోనే దోషులు విడుదలయ్యారని దుయ్యబట్టాయి. భాజపా నేతృత్వంలో ‘నవ భారత’ నిజరూపం ఇదేనని విమర్శించాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా గుజరాత్‌ ప్రభుత్వ నిర్ణయం ఉందని, దాన్ని ఉపసంహరించాలని డిమాండ్‌ చేశాయి. మహిళా సాధికారతపై తాను చెప్పిన మాటలకు మోదీ కట్టుబడి ఉన్నారా అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా ప్రశ్నించారు. హంతకులు, రేపిస్టులను విడుదల చేసిన ప్రభుత్వం.. న్యాయం కోసం పోరాడిన తీస్తా సీతల్వాద్‌ను జైల్లో పెట్టిందని సీపీఎం విమర్శించింది. మహిళా శక్తి గురించి మాట్లాడిన రోజే రేపిస్టులను విడుదల చేయడం ద్వారా మోదీ ఏం సందేశమిస్తున్నారని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు.

ఈ కేసులో నిందితులు 2008లో దోషులుగా తేలారని గుజరాత్‌ హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి రాజ్‌ కుమార్‌ తెలిపారు. ఆ సమయానికి గుజరాత్‌లో 1992 నాటి రెమిషన్‌ విధానం అమల్లో ఉందని చెప్పారు. సుప్రీంకోర్టు కూడా అదే విధానం కింద వీరి శిక్ష తగ్గింపు అంశాన్ని పరిశీలించాలని తమను ఆదేశించిందన్నారు. గుజరాత్‌ తన రెమిషన్‌ విధానాన్ని 2014లో సవరించింది. దాని ప్రకారం.. సామూహిక అత్యాచారం, హత్య కేసుల్లో దోషులకు శిక్ష తగ్గింపు కుదరదు. 1992 నాటి విధానంలో అలాంటి నిబంధనలేమీ లేవని న్యాయవాదులు తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని