Sajjala: అది మార్ఫింగ్‌ వీడియో కాదని తేలితే ఎంపీ మాధవ్‌పై చర్యలు: సజ్జల

అమరావతి: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌పై వచ్చిన అసభ్య వీడియోకు సంబంధించి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. మాధవ్‌ వ్యవహారంపై సీఎంతో చర్చించిన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. ‘‘ఎంపీ మాధవ్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తనపై వచ్చిన ఆరోపణలను మాధవ్‌ ఖండిస్తున్నారు. అది మార్ఫింగ్‌ వీడియో అని పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దానిపై పోలీసు విచారణ జరుగుతోంది. మార్ఫింగ్‌ వీడియో కాదని తేలితే అతనిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మహిళలను కించపరిచేలా ఎవరైనా వ్యవహరిస్తే పార్టీ సహించదు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

ఏం జరిగిందంటే?..

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఓ మహిళ పట్ల వీడియో కాలింగ్‌లో అసభ్యంగా ప్రవర్తించిన తీరు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. రెండ్రోజుల క్రితం ఎంపీ గోరంట్ల .. ఓ మహిళతో వీడియో కాలింగ్‌లో మాట్లాడుతూ... వీడియో కాల్‌లో తన దుస్తులు లేకుండా ఉన్న చిత్రాలను మహిళకు చూపించడంతో ఆమె సీరియస్‌గా తీసుకుని వైరల్‌ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.  ఈ వీడియోపై గోరంట్ల మాధవ్‌ కూడా స్పందించారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను జిమ్‌ చేసేటప్పటి వీడియోలను మార్ఫింగ్‌ చేసి వైరల్‌ చేశారని పేర్కొన్నారు. అది ఫేక్‌ వీడియో అని.. తనను డ్యామేజ్‌ చేసి ఇబ్బంది పెట్టేందుకు తెదేపా వాళ్లు చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే జిల్లా ఎస్పీ, సైబర్‌ క్రైమ్‌ విభాగానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై ప్రెస్‌ కౌన్సిల్‌, హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు. తన పరువుకు భంగం కలిగించిన వారందరిపై దావా వేస్తానని తెలిపారు. ఆ వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిస్తామని.. కుట్రలు, దుర్మార్గాలను బయటపెడతామని మాధవ్‌ చెప్పారు. కచ్చితంగా లీగల్‌ యాక్షన్‌ ఉంటుందని హెచ్చరించారు. దమ్ముంటే తనను నేరుగా ఎదుర్కోవాలని సవాల్‌ విసిరారు.మరిన్ని

ap-districts
ts-districts