Stock Market Closing Bell: ఒకరోజు విరామం తర్వాత తిరిగి లాభాల్లోకి సూచీలు

ముంబయి: ఆర్‌బీఐ రేట్ల పెంపు అంచనాల కంటే స్వల్పంగా ఎక్కువే ఉన్నప్పటికీ.. మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. దీంతో ఒకరోజు విరామం తర్వాత సూచీలు తిరిగి లాభాల్లోకి ఎగబాకినట్లైంది. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు చివరి గంటన్నరలో కాస్త తడబడినప్పటికీ.. ఆఖరికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఆర్‌బీఐ రేట్ల పెంపునకు మదుపర్లు ముందే సిద్ధమై ఉన్న నేపథ్యంలో సూచీలు పెద్దగా చలించలేదు. ఆర్‌బీఐ ప్రకటన వెలువడిన వెంటనే ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేసిన మార్కెట్లు గరిష్ఠాల వద్ద అమ్మకాలతో కిందకు దిగొచ్చాయి. రూపాయి బలపడడం, చమురు ధరలు 95 డాలర్ల దిగువకు రావడం కూడా సూచీలకు కలిసొచ్చింది. మరోవైపు బలమైన కార్పొరేట్‌ ఫలితాలూ మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి.

* నిఫ్టీ ఉదయం 17,423.65 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఇంట్రాడేలో 17,474.40 వద్ద గరిష్ఠాన్ని, 17,348.75 కనిష్ఠాన్ని తాకింది. చివరకు 15.50 పాయింట్ల స్వల్ప లాభంతో 17,397.50 వద్ద స్థిరపడింది. 58,421.04 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 58,649.19 - 58,244.86 మధ్య కదిలింది. చివరకు 89.13 పాయింట్లు ఎగబాకి 58,387.93 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.79.47 వద్ద ట్రేడయ్యింది.

* సెన్సెక్స్‌ 30 సూచీలో అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో స్థిరపడ్డాయి. ఎంఅండ్‌ఎం, రిలయన్స్‌, మారుతీ, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.

మార్కెట్‌లోని ఇతర విశేషాలు..

* భవిష్యత్తులో బలమైన వృద్ధి అంచనాల నేపథ్యంలో టాటా ఎలెక్సీ షేర్లు ఇంట్రాడేలో 5 శాతానికి పైగా రాణించాయి. చివరకు 3.56 శాతం లాభంతో రూ.9,276 వద్ద స్థిరపడింది.

* నిఫ్టీ ఐటీ వరుసగా రెండోరోజూ రాణించింది. టాటా ఎలెక్సీ షేరు అత్యధికంగా 3.83 శాతం లాభం నమోదు చేయగా.. టెక్‌ మహీంద్రా షేరు 0.11 శాతం ఎగబాకింది.

* టైటన్‌ కంపెనీ ఈరోజు జూన్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ లాభంలో 13 రెట్ల వృద్ధి నమోదై రూ.793 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ఈరోజు కంపెనీ షేరు స్వల్పంగా లాభపడి రూ.2,428 వద్ద స్థిరపడింది.


మరిన్ని

ap-districts
ts-districts