Vijay Deverakonda: బాబోయ్‌.. మార్కెట్‌లో మనోడి ఫాలోయింగ్‌కి ఇంటర్నెట్‌ షేక్‌

చెప్పులేసుకున్నాడని కామెంట్స్.. ఇప్పుడు ఆయన్ని చూడ్డానికి ఎగబడుతోన్న అభిమానులు

ఇంటర్నెట్‌డెస్క్‌: కొన్నినెలల ముందు వరకూ అతడి లైఫ్‌ వేరు.. అతడికున్న ఫాలోయింగ్‌ వేరు.. అప్పటివరకూ కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకే పరిమితమైన అతడి పేరు కేవలం ఒక్క ట్రైలర్‌తో దేశం మొత్తానికి ఎగబాకింది. ఓవర్‌నైట్‌లో అతడి గ్రాఫ్‌ మారిపోయింది. ఇప్పుడు దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రేక్షకుల నుంచి విశేషస్పందన లభిస్తోంది. ఆ స్టార్‌ నామజపంతో యువతకు పూనకాలు వచ్చేస్తున్నాయి. యువతను ఉర్రూతలూగిస్తోన్న ఆ టాలీవుడ్‌ హీరో ఎవరంటే.. ది సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda). ఆయన హీరోగా నటించిన ‘లైగర్‌’ (Liger) ప్రమోషన్స్‌లో ఇప్పటివరకూ ఏం జరిగిందో ఒక లుక్కేద్దాం.

బ్యాక్‌గ్రౌండ్‌ లేదు..!

ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టి ‘నువ్విలా’, ‘లైఫ్‌ ఈజ్ బ్యూటీఫుల్‌’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ వంటి చిత్రాల్లో సహాయనటుడిగా పనిచేసి కెరీర్‌లో ఎదిగే క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు విజయ్‌. ‘పెళ్లి చూపులు’తో క్లాస్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చి ‘అర్జున్‌రెడ్డి’తో ఒక్కసారిగా సెన్సేషనల్‌ స్టార్‌గా మారారు. ‘గీతగోవిందం’ క్లాసిక్‌ లవ్‌స్టోరీగా నిలిచింది. ఆ సినిమా తర్వాత విజయ్‌ నటించిన ఏ చిత్రమూ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. అయినప్పటికీ మార్కెట్‌లో ఆయనకున్న ఫాలోయింగ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో విజయ్‌ హీరోగా నటించిన మొదటి పాన్‌ ఇండియా సినిమా ‘లైగర్‌’ ట్రైలర్‌ లాంచ్‌లో ఇదే విషయాన్ని చెప్పి విజయ్‌ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘మీకు మా అయ్య తెల్వదు. మా తాత తెల్వదు. రెండేళ్లు అవుతోంది సినిమా రిలీజై. అది కూడా అంత గొప్పగా చెప్పుకునే సినిమా కాదు. అయినా మీరు చూపిస్తోన్న ప్రేమకు నాకు మాటలు రావడం లేదు’’ అంటూ విజయ్‌ ట్రైలర్‌ లాంచ్‌లో ఎమోషనల్‌ అయ్యారు.

చెప్పులేసుకొచ్చారన్నారు..!

స్టైలిష్‌, బ్రాండెడ్‌ దుస్తులకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే బాలీవుడ్‌లో విజయ్‌ దేవరకొండ తన సింప్లిసిటీతో అదరగొడుతున్నారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా సాధారణమైన దుస్తులు, సింపుల్‌ లుక్స్‌లోనే విజయ్‌ ప్రమోషనల్‌ ఈవెంట్స్‌లో పాల్గొంటున్నారు. ఇక, ముంబయిలో జరిగిన ట్రైలర్‌ లాంచ్‌ వేడుకకు విజయ్‌ చెప్పులేసుకెళ్లడాన్ని చూసి.. రణ్‌వీర్‌ కామెంట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చాలా ఈవెంట్స్‌లో విజయ్‌ ఆ చెప్పులతోనే దర్శనమిచ్చారు. దీంతో ఆయన చెప్పులు, లుక్స్‌ కూడా బాలీవుడ్‌ వారికి ఓ టాపిక్‌గా మారాయి. సాధారణ స్లిపర్స్‌తోనే విజయ్‌ ఈవెంట్స్‌లో పాల్గొంటున్నారంటూ అక్కడివారు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మాల్స్‌ అన్నీ నిండిపోతున్నాయ్‌..!

ట్రైలర్‌ లాంచ్‌ జరిగిన తర్వాత రోజు నుంచి ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో లైగర్‌ ప్రమోషనల్‌ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ముంబయి, పట్నా, అహ్మదాబాద్‌లలోని ప్రముఖ షాపింగ్‌మాల్స్‌లో ఇప్పటివరకూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలకు యువత భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఇసుకేస్తే రాలనంతంగా ఆ ప్రదేశాలన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయాయి. విజయ్ నామ స్మరణతో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు దద్దరిల్లిపోయాయి. అనుకున్నదానికంటే అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావడంతో ఈవెంట్‌ నిర్వాహకులు షాక్‌ అవుతున్నారు. ఫ్యాన్స్‌ అదుపుచేయడం కోసం ప్రోగ్రామ్‌ పూర్తి కాకముందే విజయ్‌ని అక్కడి నుంచి పంపించేస్తున్నారు. ముంబయి, పట్నాలో కూడా ఇదే సీన్‌ రిపీట్‌ కావడంతో.. మాస్‌లో విజయ్‌కి ఉన్న క్రేజ్‌ చూసి బాలీవుడ్‌ వారు షాక్‌ అవుతున్నారు.

విజయ్‌ దేవరకొండ ఈజ్‌ ఏ ‘కింగ్‌’..!

తమ అభిమాన హీరో నటించిన మొదటి పాన్‌ ఇండియా సినిమా ‘లైగర్‌’ విడుదలకు ముందే అన్ని ప్రాంతాల్లో విజయ్‌కి వస్తోన్న రెస్పాన్స్‌ చూసి తెలుగు వారు ఆనందిస్తున్నారు. ‘విజయ్‌ దేవరకొండ ఈజ్‌ కింగ్‌’ అంటూ నెట్టింట వరుస పోస్టులు పెడుతున్నారు. సహాయనటుడిగా పని చేసినప్పుడు ఓ స్టార్‌తో కలిసి విజయ్‌ ఈవెంట్‌లో పాల్గొనగా అక్కడివారెవరూ ఈయన్ని పట్టించుకోలేదు. ఈయనతో ఫొటోలు దిగేందుకూ ఎవరూ ఆసక్తి కనబర్చలేదు. ఈ ఘటనతో విజయ్‌ చిన్నబుచ్చుకున్నారు. ఆనాటి వీడియోని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు జత చేసి అభిమానులు పంచుకుంటూ విజయ్‌ని మెచ్చుకుంటున్నారు. ఇలా, విజయ్‌ దేవరకొండ వీడియోలు, ఫొటోలతో గత కొన్నిరోజుల నుంచి ఇంటర్నెట్‌ షేక్‌ అవుతోంది. ‘లైగర్‌’ ప్రమోషనల్‌ వీడియోల్లో జన సంద్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ.. ‘‘మార్కెట్‌లో మనోడి ఫాలోయింగ్‌ చూస్తుంటే పిచ్చెక్కేస్తోంది’’ అని చెప్పుకుంటున్నారు.
మరిన్ని

ap-districts
ts-districts