Naga Chaitanya: జీవితంలో ఏం జరిగినా ఆనందంగా స్వీకరించాలి: నాగచైతన్య

హైదరాబాద్‌: ‘‘జీవితంలో ఏం జరిగినా ఆనందంగా ఉండాలి, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి’’ అని అంటున్నారు నటుడు నాగచైతన్య (Naga Chaitanya). ఆయన కీలకపాత్రలో నటించిన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha) గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన విలేకర్లతో ముచ్చటించారు. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ తనకెంతో ప్రత్యేకమన్నారు. చైతన్య పంచుకున్న మరిన్ని విశేషాలివీ..

‘‘లాల్‌ సింగ్‌ చడ్డా’లోని బాలరాజు పాత్ర కోసం ఆమిర్‌ ఖాన్‌(Aamir Khan) నాకు తొలిసారి ఫోన్‌ చేసినప్పుడు ఇది పూర్తిస్థాయి పాత్ర కాదని, కేవలం అతిథి పాత్రని చెప్పారు. స్క్రిప్ట్‌ విని నిర్ణయం తీసుకోమన్నారు. నా పాత్ర తెరపై కనిపించేది కేవలం 20 నిమిషాలే అయినా అదెంతో ప్రత్యేకంగా ఉంటుంది. సినిమా మొత్తం నా రోల్‌ ట్రావెల్‌ అవుతూనే ఉంటుంది. ఆమిర్‌ లాంటి నటుడి పక్కన యాక్ట్‌ చేసే అవకాశం అరుదుగా లభిస్తుంది. ఇలాంటి గొప్ప నటుడితో పనిచేసినప్పుడు మనం ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు తప్పకుండా నా పాత్రకు కనెక్ట్‌ అవుతారు. నాకు సంబంధించిన సీన్స్‌ అన్నీ శ్రీనగర్‌, గోదావరి జిల్లాలో షూట్‌ చేశారు. చిరంజీవి సమర్పణలో ఈ సినిమా విడుదలవుతుండటం మరింత ఆనందాన్ని ఇచ్చింది. బెంగళూరు, చెన్నై, దిల్లీలో ఇప్పటికే స్పెషల్‌ స్క్రీనింగ్స్‌ వేశాం. అన్నిచోట్లా మంచి స్పందనే వచ్చింది. ఈ సినిమా అందరి హృదయాల్లోకి వెళ్తుందని భావిస్తున్నా‌’’ అని చైతన్య అన్నారు. అనంతరం, మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

ఆమిర్‌తో వర్క్‌ చేయడం ఎలా అనిపించింది?

చైతన్య: సినిమా అనుకున్నప్పటి నుంచి తుది మెరుగులద్దేవరకూ వర్క్‌ పట్ల ఆయన ఎంతటి శ్రద్ధ చూపిస్తారో తెలుసుకున్నా. ఈ సినిమా షూట్‌ చేసింది 120 రోజులే. ప్రీ ప్రొడక్షన్‌ కోసం 6 నెలలు, పోస్ట్‌ ప్రొడక్షన్‌కి సుమారు 18 నెలల సమయం పట్టింది. ఏ దశలోనూ ఆమిర్‌ విసుగు చెందలేదు. ఇప్పటివరకూ ఈ చిత్రాన్ని ఆయన సుమారు 2000 మందికి చూపించారు. ప్రతి ఇండస్ట్రీలోని దర్శక నిర్మాతలు, నటీనటులకు ఫోన్‌చేసి వాళ్లతో మాట్లాడి.. వాళ్ల కోసం స్పెషల్‌ స్క్రీనింగ్స్‌ ఏర్పాటు చేశారు. వాళ్ల అభిప్రాయాలు తీసుకున్నారు.

ఇదేమైనా పీరియాడికల్‌ డ్రామానా?

చైతన్య: ఇది పీరియాడికల్‌ సినిమా కాదు. కానీ, 1970 నుంచి కథ మొదలవుతుంది. 2018 వరకూ దీన్ని చూపిస్తారు.

బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు? ఏమనిపిస్తోంది?

చైతన్య: సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఆమిర్‌ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వటం ఆనందంగా ఉంది. రెండువేలకు పైగా స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఒక పక్క ఆనందంగా ఉన్నా కొత్త మార్కెట్‌లో నన్ను ఎలా స్వాగతిస్తారోనని కంగారుగానూ ఉంది. ఓ నటుడిగా కెరీర్‌లో మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నా.

ఈ సినిమాకి మిమ్మల్ని ఎలా ఎంపిక చేశారు? 

చైతన్య: ఓ రోజు ఆమిర్‌ టీమ్‌ నుంచి నాకు కాల్‌ వచ్చింది. సినిమాలో అవకాశం ఉందని చెప్పారు. నేను ఎవరో కావాలని ఏడిపిస్తున్నారనుకున్నా. వాళ్ల మాటలు నేను నమ్మలేదు. అదే రోజు సాయంత్రం ఆమిర్‌ వీడియో కాల్‌ చేసి మాట్లాడారు. ఆ క్షణం నాకేమీ అర్థం కాలేదు. ఆ తర్వాత డైరెక్టర్‌ అద్వైత్‌ ఫోన్‌ చేసి స్క్రిప్ట్‌ మొత్తం చెప్పారు. ఒక వారం తర్వాత వెళ్లి ఆమిర్‌ని వ్యక్తిగతంగా కలిశా. ఇది కల కాదని నిజమేనని నమ్మా.

మీ పాత్ర కోసం ఏమైనా కష్టపడ్డారా?

చైతన్య: కష్టంగా ఏమీ అనిపించలేదు. మూడు నెలలపాటు వర్క్‌ షాప్‌నకు వెళ్లి నటన గురించి కొత్త విషయాలు నేర్చుకున్నట్టు ఉంది.

ఈ సినిమా ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనుకుంటున్నారు?

చైతన్య: సినిమా చూసిన ప్రేక్షకులంతా పాజిటివ్‌ వైబ్‌తో థియేటర్‌ నుంచి బయటకు వస్తారు. ఇందులో లాల్‌.. ఎంతో అమాయకంగా ఉండే వ్యక్తి. అలాంటి మనిషి జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఎన్ని కష్టాలొచ్చినా పాజిటివ్‌గానే ఉంటాడు. అతణ్ణి చూశాక అందరూ పాజిటివ్‌గా ఉండటం నేర్చుకుంటారు. జీవితంలో ఏం జరిగినా సంతోషంగా ఉండాలి. పాజిటివ్‌గా ముందుకు సాగాలి.

మొదటిసారి హీరోగా స్పెషల్‌ రోల్‌ చేయడం ఎలా అనిపించింది?

చైతన్య: ఇలాంటి స్పెషల్‌ రోల్స్‌ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. భవిష్యత్తులో అవకాశం వస్తే తప్పకుండా ఇలాంటి పాత్రలు మరిన్ని చేయాలనుకుంటున్నా.

బాలరాజు పాత్ర మీకు చాలా స్పెషల్‌ అని విన్నాం ఎందుకు?

చైతన్య: ఈ సినిమాలోని నా పాత్రకు బాలరాజు అనే పేరు పెట్టాలని మేం ముందుగా అనుకోలేదు. తర్వాత, ఆ పాత్ర కోసం ఎన్నో పేర్లు అనుకున్నాం. చివరికి ‘బాలరాజు’ని ఖరారు చేశాం.ఈ పేరు ఫిక్స్ చేసిన వారం తర్వాత నాకు తెలిసింది మా తాతగారిది (అక్కినేని నాగేశ్వరరావు) ‘బాలరాజు’ అనే సినిమా ఉందని. ఆయన ఆశీస్సులు నాకెప్పటికీ ఉంటాయని ఆ క్షణం అనిపించింది. అందుకే ఈ సినిమా నాకెంతో సెంటిమెంట్‌గా మారింది.

ఈ సినిమా చూసి చిరంజీవి ఏమన్నారు?

చైతన్య: నాన్న (నాగార్జున), చిరంజీవి అంకుల్‌ నన్ను ఎంతో మెచ్చుకున్నారు. సినిమా చూస్తున్నంతసేపు బాలరాజునే చూస్తున్న ఫీల్‌ వచ్చిందని అన్నారు. నాకు ఆనందంగా అనిపించింది.

టీమ్‌ రియాక్షన్‌ ఎలా ఉంది?

చైతన్య: సినిమా రిలీజ్‌కు ముందు అందరూ కంగారుగా ఉండటం సహజం. స్పెషల్‌ స్క్రీనింగ్స్‌లో ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన వల్ల మాకు కాస్త నమ్మకం, ధైర్యం వచ్చాయి. కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్‌కు వస్తారని ఇటీవల విడుదలైన ‘బింబిసార’, ‘సీతారామం’ నిరూపించాయి. దాంతో, మేమూ ధైర్యంగా ఉన్నాం.

ఈ సినిమా కథానాయిక కరీనాని కలిశారా?

చైతన్య: ఈ చిత్రంలో నేనూ కరీనా కలిసి నటించే సన్నివేశాల్లేవు. ఆమెను ఇప్పటివరకూ కలవలేదు.మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని