తెలంగాణలో రేపు సామూహిక జాతీయ గీతాలాపన.. 1నిమిషం పాటు రెడ్‌ సిగ్నల్‌

హైదరాబాద్: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపనకు అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రేపు ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన చేయనున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్ ఆబిడ్స్ జీపీవో కూడలి వద్ద గీతాలాపనలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆబిడ్స్ జీపీఓ సర్కిల్, నెక్లెస్ రోడ్డు కూడలి ప్రాంతాల్లో ఏర్పాట్లను సీఎస్ సోమేశ్‌ కుమార్, ఉన్నతాధికారులు పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు.

హైదరాబాద్‌లోని అన్ని కూడళ్ల వద్ద సామూహిక జాతీయ గీతాలాపనకు నగర ట్రాఫిక్ పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గీతాలాపన సమయంలో కూడళ్ల వద్ద అన్ని వైపులా రెడ్‌ సిగ్నళ్లు వేస్తారు. ఆ సమయంలో రోడ్లపై ఒక నిమిషం పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. గీతాలాపనలో ప్రతి వాహనదారుడు పాల్గొనేలా ట్రాఫిక్‌ పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారులతో పాటు ట్రాఫిక్‌ పోలీసులు సైతం పాల్గొననున్నారు. వాహనాల రద్దీ నెలకొనకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts