WhatsApp: ఒకేసారి 32 మందికి వీడియోకాల్‌.. డీఎన్‌డీ మోడ్‌, డాక్యుమెంట్‌ క్యాప్షన్.. ఇంకా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పర్సనల్ లేదా ప్రొఫెషన్‌.. కమ్యూనికేషన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాట్సాప్‌ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. యూజర్‌ ఫ్రెండ్లీ ఇంటర్‌ ఫేస్‌, అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో ఉచితంగా అందుబాటులో ఉండటం ఎక్కువ మందిని ఆకర్షించడానికి ప్రధాన కారణం. వాట్సాప్‌ ఇటీవలే మరికొన్ని కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే డిలీట్ ఫర్‌ మీ టైమ్‌ లిమిట్‌, అన్‌రీడ్‌ చాట్ ఫిల్టర్, సైలెంట్ గ్రూప్‌ ఎగ్జిట్‌ వంటి ఫీచర్లను తీసుకొచ్చింది. మరి కొత్తగా రాబోయే ఫీచర్లతో యూజర్లకు ఎలాంటి సేవలు అందుబాటులోకి రానున్నాయో చూద్దాం.


లింక్స్‌తో కాల్ ఇన్విటేషన్‌

వాట్సాప్‌లో వీడియో/ఆడియోకాల్స్‌ కోసం లింక్‌ ఇన్విటేషన్‌ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఇందుకోసం గ్రూప్‌ కాల్ నిర్వహించాలనుకునే వ్యక్తి కాల్‌ సెక్షన్‌లోని వెళ్లి లింక్‌ను క్రియేట్ చేయాలి. తర్వాత  సదరు లింక్‌ను ఎవరైతే కాల్‌లో పాల్గొనాలనుకుంటున్నారో వారితో షేర్‌ చేస్తే, అవతలివారు లింక్‌పై క్లిక్ చేసి, కాల్‌లో జాయిన్ అవుతారు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ బీటా యూజర్లు అందుబాటులో ఉంది. త్వరలోనే పూర్తి స్థాయిలో యూజర్లకు అంబాటులోకి తీసుకొస్తామని వాట్సాప్ తెలిపింది. 


కెమెరా మోడ్‌

ఈ ఫీచర్‌తో యూజర్లు ఫొటో/వీడియో మోడ్‌లోకి సులువుగా మారొచ్చు. ప్రస్తుతం వాట్సాప్‌ యాప్‌ ద్వారా ఫొటో తీయాలంటే చాట్ పేజీలో కెమెరా ఐకాన్‌పై క్లిక్ చేయాలి. వీడియో రికార్డింగ్‌ కోసం కెమెరా ఓపెన్‌ అయిన తర్వాత క్యాప్చర్ బటన్‌ను కొన్ని సెకన్లపాటు హోల్డ్ చేస్తే రికార్డింగ్ ప్రారంభమవుతుంది. వీటికి బదులు ఫోన్ కెమెరాలో ఉన్నట్లుగా ఫొటో, వీడియో సెలక్షన్‌ కోసం వేర్వేను మోడ్స్‌ను పరిచయం చేయనున్నారు. 


ఇకపై ఎనిమిది కాదు 32

వాట్సాప్‌ వీడియోకాల్‌లో ఒకేసారి 32 మంది పాల్గొనేలా కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు మెటా సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఈ సంఖ్య ఎనిమిదిగా ఉంది. వాట్సాప్‌ వీడియోకాల్‌ ఫీచర్‌ పరిచయమైన తొలినాళ్లలో కేవలం ఇద్దరు మాత్రమే పాల్గొనే అవకాశం ఉండేది. తర్వాత ఆ సంఖ్యను నాలుగుకు పెంచారు. ప్రస్తుతం ఎనిమిదిగా ఉన్న ఈ లిమిట్‌ను 32కు పెంచనున్నారు. పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో యూజర్లకు పరిచయం చేస్తారని తెలుస్తోంది. 


డీఎన్‌డీ మోడ్‌

ఆఫీస్‌ మీటింగ్‌లో ఉన్నప్పుడు, డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు లేదా నిద్రాభంగం లేకుండా ఉండేందుకు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టేస్తుంటాం. ఇదే తరహా ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకొస్తోంది. డూ నాట్ డిస్ట్రబ్‌ (DND) మోడ్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసిన తర్వాత యూజర్‌కు వాట్సాప్‌ కాల్స్‌, నోటిఫికేషన్లు వచ్చిన కూడా స్క్రీన్‌పై కనిపించవు. యూజర్‌ డీఎన్‌డీ మోడ్‌ డిసేబుల్ చేసిన తర్వాత వాట్సాప్ ఓపెన్ చేస్తే అందులో మిస్డ్‌కాల్స్‌, మెసేజ్‌ వివరాలు కనిపిస్తాయి.


వాయిస్‌ స్టేటస్‌

వాట్సాప్‌లో ఇప్పటిదాకా ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్‌ను మాత్రమే స్టేటస్‌గా పెట్టుకునే అవకాశం ఉంది. త్వరలో రాబోతున్న ఫీచర్‌తో యూజర్లు ఆడియో క్లిప్స్‌తోపాటు, ఇతరులు పంపిన లేదా రికార్డు చేసిన వాయిస్‌ నోట్స్‌ను వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకోవచ్చు. ఆడియో స్టేటస్‌ కోసం యూజర్లు స్టేటస్‌ బార్‌ ఓపెన్ చేస్తే కెమెరా, టెక్ట్స్‌ ఫీచర్లతోపాటు కొత్తగా మైక్‌ సింబల్‌ కనిపిస్తుంది. మైక్‌ సింబల్‌పై క్లిక్‌ చేసి ఆడియో రికార్డ్‌ చేసిన తర్వాత నచ్చిన కలర్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో దాన్ని స్టేటస్‌లో అప్‌డేట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ పరీక్షల దశలో ఉంది. త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానుంది.


 

కొత్త స్టిక్కర్స్‌

ప్రొఫైల్‌ ఫొటో స్థానంలో యూజర్‌ తనకు నచ్చిన స్టిక్కర్‌ను అప్‌డేట్‌ చేయొచ్చు. ప్రస్తుతం యూజర్లు తమకు నచ్చిన ఫొటో లేదా బయటి నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న అవతార్‌లను ప్రొఫైల్ ఫొటోగా పెట్టుకుంటున్నారు. త్వరలో రాబోతున్న ఫీచర్‌తో యూజర్‌ తనకు నచ్చిన అవతార్‌ లేదా స్టిక్కర్‌ను వాట్సాప్‌లో క్రియేట్ చేసుకుని ప్రొఫైల్‌ ఫొటోగా మార్చుకోవచ్చు. యూజర్ డిజైన్‌ చేసిన స్టిక్కర్‌, అవతార్‌లను వ్యక్తిగత, గ్రూప్‌ చాటింగ్‌లో కూడా ఉపయోగించవచ్చు.      


  

డాక్యుమెంట్‌కు క్యాప్షన్‌

వాట్సాప్‌ ద్వారా రోజూ ఎన్నో ఫైల్స్‌ పంపుతుంటాం. వాటిలో ఏదైనా ఫైల్‌ కావాల్సి వచ్చినప్పుడు చాట్‌ పేజీని పై నుంచి కిందకు స్క్రోల్‌ చేసి వెతికినా కొన్నిసార్లు కనిపించదు. ఈ సమస్యకు పరిష్కారంగా వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. దీంతో యూజర్లు వాట్సాప్‌ ద్వారా పంపే డాక్యుమెంట్‌లకు తమకు నచ్చిన క్యాప్షన్‌ ఇచ్చి పంపవచ్చు. దానివల్ల భవిష్యత్తులో సదరు డాక్యుమెంట్‌ కోసం సెర్చ్‌ పేజీలో  క్యాప్షన్‌ను టైప్‌ చేసి సులువుగా వెతకొచ్చు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. 


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు