‘గూడు’ కట్టుకున్న కన్నీరు

ముంపునకు గురైన వేల ఇళ్లు
కుటుంబానికి రూ.లక్షన్నరకు పైగా ఆస్తి నష్టం
పునర్నిర్మాణానికీ పెద్దమొత్తంలో వ్యయం
వరద పోయినా వీడని సమస్యలు
ఆపన్నహస్తాల కోసం బాధితుల ఎదురుచూపులు  
గోదావరి పరీవాహక ప్రాంతంలో దైన్యం
వెలిశాల ఫల్గుణాచారి
భద్రాచలం నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి

గోదావరి వరద వారి ఆశల్ని సమూలంగా తుడిచిపెట్టేసింది. వరద ముంచెత్తిన సమయంలో పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. ఉద్ధృతి తగ్గాక తమ ఇళ్ల వద్దకు తిరిగొచ్చి చూస్తే.. అక్కడేమీ మిగల్లేదు. నివాసాలు నామరూపాల్లేకుండా పోవడమే కాదు.. సామగ్రి అంతా నీటిపాలైంది. పశువులు, గ్రాసం, టీవీలు, మంచాలు, సాగునీటి మోటార్లు.. ఇలా అన్నీ వరద పాలయ్యాయి. కట్టుబట్టలతోనే మిగిలినవారు వేలసంఖ్యలో ఉన్నారు. గత నెల 13 నుంచి 17వ తేదీ వరకు వచ్చిన ప్రళయం సృష్టించిన విషాదమిది. ముంపు ప్రాంతాల్లోని ఏ వీధిని చూసినా కొట్టుకొచ్చిన దర్వాజాలు, కూలర్లు, మోటార్ల పైపులు, బీరువాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన బియ్యం, నిత్యావసర వస్తువులు, దాతలు అందిస్తున్న సాయంతో ప్రాణాలు నిలుపుకొంటున్నా.. నిలువనీడ కరవై వందల కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. నిర్మాణ వ్యయం భారీగా పెరగడంతో ఇళ్లను పునర్నిర్మించుకునేందుకు అవస్థలు పడుతున్నారు. ఆపన్నహస్తాల కోసం ఎదురుచూస్తున్నారు.

మరమ్మతులకు రూ.50 వేలకుపైనే

ఒక్కో ఇంటి మరమ్మతులకు కనిష్ఠంగా రూ.50 వేలకు పైగా ఖర్చవుతోందని బాధితులు చెబుతున్నారు. దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి గ్రామంలో ఇళ్లను వరద పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఇక్కడ దాదాపు 30 ఇళ్ల పునర్నిర్మాణం చేపట్టారు. రేకులు, వాసాలు, సిమెంటు దిమ్మెలు, చుట్టూ పరదా, గచ్చుకు కలిపి రెండు గదులకు కనిష్ఠంగా రూ.లక్షకు పైగా ఖర్చవుతుందని చెబుతున్నారు. ఇళ్లు కోల్పోయినప్పుడు రూ.లక్షన్నరకు పైగా నష్టం కలిగిందని, పునర్నిర్మాణానికీ పెద్దమొత్తంలో అవుతున్న ఖర్చును ఎలా భరించాలని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గోదావరి ముంపు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. మరోవైపు ఆయా ప్రాంతాల్లో పనులు లేక.. రోజువారీ ఖర్చులకు చేతిలో డబ్బు లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారు.

మళ్లీ మళ్లీ విత్తనాలు వేస్తూ..

వరదలకు చెలకల్లో నీరు నిల్వ ఉండటంతో వేల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. అడుగు ఎత్తు వరకు పెరిగిన మొక్కలన్నీ కుళ్లిపోయాయి. ముంపు తగ్గాక గత నెల 20 అనంతరం నాటిన విత్తులు తేమతో మురిగిపోయాయి. ఎకరాకు నాలుగేసి సార్లు నాటడానికి, కలుపు మందులకు సుమారు రూ.25 వేల చొప్పున ఖర్చయిందని తెలిపారు. బూర్గంపాడు, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లో ఈ స్థితి ఉంది. వరదలకు మునిగి కుళ్లిపోయిన పత్తి మొక్కల మధ్య మళ్లీ విత్తనాలు వేస్తున్న దృశ్యాలు బూర్గంపాడు మండలంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి.

రాష్ట్రంలో పరిస్థితి..

భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలంలో 7,100 ఇళ్లు మునిగిపోయాయి. చాలా గ్రామాల్లో గుడిసెలు కూలిపోయాయి. అశ్వాపురం మండలంలో 1,458 ఇళ్లు, మణుగూరు అర్బన్‌ ప్రాంతంలో 392 ఇళ్లు మునిగాయి. దుమ్ముగూడెం మండలంలో 1,936 ఇళ్లు మునగగా, 195 కూలిపోయాయి.

మంచిర్యాల జిల్లాలోని నస్పూర్‌ పురపాలిక పరిధిలో 168 ఇళ్లు మునిగిపోగా.. 37 దెబ్బతిన్నాయి. మంచిర్యాల పట్టణంలోని 12 కాలనీల్లో 2,262 ఇళ్లు మునిగిపోగా 85 కూలిపోయాయి.


చిత్రంలోని చిన్నారి వరదల సమయంలో భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం ఎంపీ బంజరలోని పునరావాస కేంద్రంలో పుట్టాడు. సొంతూరు మండలంలోని గౌతమ్‌పురం. ఈ చిన్న గుడిసెలోనే చిన్నారితో పాటు తల్లి మౌనిక, తండ్రి, మామ, అమ్మమ్మ నీరుడు నర్సమ్మ ఉంటున్నారు. గోడలు వరద ధాటికి నాని ఉండటంతో కూలిపోతున్నాయి. అయినా మరో దిక్కు లేక అందులోనే నివసిస్తున్నారు. ‘బియ్యం, నిత్యావసరాలు ఇచ్చారు. ఇల్లు బాగు చేసుకునేందుకు డబ్బులు లేవు. పచ్చిబాలింతైన నా బిడ్డను చిన్నపాకలోనే ఉంచి చూసుకోవాల్సి వస్తోంది. ఎవరైనా ఆదుకోండి సారూ..’ అంటూ నీరుడు నర్సమ్మ వేడుకుంటున్నారు.


ద్దరు పిల్లలతో జీవిస్తున్న నరగొర్ల వరలక్ష్మి ఇల్లు వరదలకు కొట్టుకుపోయింది. ఇంటితో పాటు సామగ్రి అంతా పోయింది. ఫ్రిడ్జి, టీవీతో పాటు విలువైన వస్తువులు నీటిపాలయ్యాయని, వెండి పట్టీలు కూడా పోయాయని కన్నీరుమున్నీరవుతున్నారు. దాతలు ఇచ్చిన వస్తువులతో చిన్న గుడారం ఏర్పాటు చేసుకుని.. అందులో నెట్టుకొస్తున్నారు.


మరుగుదొడ్డిలోనే నివాసం

దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి గ్రామానికి చెందిన కౌలు రైతు కట్టబోయిన రాజు రేకుల ఇల్లు వరదల్లో కొట్టుకుపోయింది. మంచం, టీవీ, బీరువా, గ్యాస్‌ పొయ్యి, బియ్యం, దుస్తులు.. అన్నీ గల్లంతయ్యాయి. కొద్దిరోజులు పునరావాస కేంద్రంలో ఉండి ఇంటికి చేరుకున్నారు. నిలువనీడ లేక మరుగుదొడ్డిలోనే భార్యతో కలిసి తలదాచుకుంటున్నారు. దాదాపు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని