కృష్ణాలో స్వల్పంగా పెరిగిన ప్రవాహం

సాగర్‌, శ్రీశైలం నుంచి కొనసాగుతున్న విడుదల

ఈనాడు, హైదరాబాద్‌, మన్ననూర్‌, నాగార్జునసాగర్‌, భద్రాచలం, న్యూస్‌టుడే: కృష్ణా నదికి కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్‌ల నుంచి స్వల్పంగా ప్రవాహం పెరుగుతోంది. జలాశయాల ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో ఆలమట్టికి మంగళవారం మధ్యాహ్న సమయానికి 2.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం డ్యాం వద్ద 4.25 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది. ప్రాజెక్టు పది గేట్లు 15 అడుగులు ఎత్తి వరద విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ నుంచి 20 గేట్లు పది అడుగులు, ఆరు గేట్లు ఐదు అడుగుల మేరకు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లుగా వదిలారు. రాత్రి 9 గంటలకు వరద ప్రవాహం స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో రెండు గేట్లు దించారు.

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి వరద

గోదావరిలో వరద పెరుగుతోంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎత్తిపోతల్లోని లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీ వద్ద 9లక్షల క్యూసెక్కుల వరద నమోదవుతోంది. భద్రాచలం వద్ద ప్రవాహం మంగళవారం రాత్రి 8 గంటలకు 53 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద 55 అడుగుల వరకు వచ్చే అవకాశం ఉందని భద్రాద్రి కొత్తగూడెం  కలెక్టర్‌ అనుదీప్‌ సూచించారు.


మరిన్ని

ap-districts
ts-districts