గోవుల దాతే.. వారికి గోకుల కృష్ణుడు!

విదేశీయుడికి ఆదివాసీ రైతుల సన్మానం

ఉట్నూరు, న్యూస్‌టుడే: అరకొర వసతుల మధ్య వ్యవసాయం చేస్తున్న పేద ఆదివాసీ రైతులకు సాయం అందించి వారి మనసులో గోకుల కృష్ణుడిలా స్థానం సుస్థిరం చేసుకున్నాడు ఓ విదేశీయుడు. ఇంతకీ ఆయనెవరు? చేసిన సాయం ఏమిటో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సేంద్రియ వ్యవసాయాభివృద్ధే లక్ష్యంగా ‘చేతన ఆర్గానిక్‌’ స్వచ్ఛంద సంస్థ పని చేస్తోంది. ఆదిలాబాద్‌, కుమురం భీం జిల్లాల్లో ఆదివాసీ రైతులు సాగు చేస్తున్న సేంద్రియ పంటలను గతేడాది జర్మనీకి చెందిన డిబెల్లా వస్త్ర పరిశ్రమ సీఈవో రాల్ఫ్‌ హెల్మెన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ‘మీకు ఏమైనా సాయం కావాలా’ అని హెల్మెన్‌ అడగ్గా.. దేశీయ ఆవులు కావాలని వారు కోరారు. సాయం చేస్తానని మాటిచ్చి స్వదేశానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత 52 ఆదివాసీ రైతు కుటుంబాలకు గోవులతోపాటు వారి గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం, సౌరశక్తితో నడిచే దీపాలు ఏర్పాటు చేయాలంటూ హెల్మెన్‌ రూ.17 లక్షలు పంపించారు. ఆయన పంపిన సాయంతో ‘చేతన’ సంస్థ రైతులకు ఆవులను అందించింది. వారి గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం కోసం కార్యక్రమాలను సైతం చేపట్టారు. బుధవారం హెల్మెన్‌ రెండోసారి ఏజెన్సీ పర్యటనకు వచ్చారు. ఉట్నూరు మండలంలోని అల్లిగూడలో ఆదివాసీ రైతులు ఆయనను చూసి ఆనందంతో పొంగిపోయారు. చేతికి వేణువు అందించి ఘనంగా సన్మానించారు. ఎడ్లబండిపై కూర్చోబెట్టి గ్రామమంతా తిప్పారు. తాను చేసిన చిన్న సాయానికి రైతులు ఇంతగా అభిమానం చూపడం జీవితంలో ఎన్నటికీ మరచిపోలేని విషయమని హెల్మెన్‌ సంతోషం వ్యక్తంచేశారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు