close

సంపాదకీయం

ఎడారీకరణకు అడ్డుకట్ట

ప్రపంచ దేశాల అజెండా

వ్యవసాయ యోగ్యమైన భూమి సారాన్ని కోల్పోతూ ఎడారీకరణకు గురికావడం ప్రస్తుతం ప్రపంచ దేశాలకు పెద్ద సవాలుగా మారింది. భూసారం క్షీణించడం, వరస కరవులు భూఉత్పాదక సామర్థ్యాన్ని దెబ్బతీయడమే కాదు, పట్టణీకరణకు వ్యవసాయ భూమిని వినియోగించడం ప్రపంచవ్యాప్తంగా భూసార క్షీణతకు కారణమవుతున్నాయి. అస్థిరమైన భూ నిర్వహణ కారణంగా ప్రతి నాలుగు హెక్టార్లలో ఒకటి సాగుకు పనికిరాకుండాపోతోందని ఐక్యరాజ్య సమితి నివేదించింది. రాబోయే రోజుల్లో 320 కోట్ల ప్రజల ఆరోగ్య సంక్షేమ ఆహార భద్రతలపై ప్రభావం చూపే పరిణామమిదని ఐరాసకు చెందిన ‘యునైటెడ్‌నేషన్స్‌ కన్వెన్షన్‌ టు కాంబట్‌ డెజర్టిఫికేషన్‌(యూఎన్‌సీసీడీ) ఆందోళన వ్యక్తీకరించింది. మానవ చర్యలు, వాతావరణ మార్పుల కారణంగా నికర ప్రాథమిక ఉత్పాదకత తగ్గిపోవడాన్ని ‘భూసార క్షీణతగా’, పొడి నేలల్లో భూసారం మరింత క్షీణించే దుస్థితిని ‘ఎడారీకరణగా’ పరిగణిస్తారు.

భూసార క్షీణత, ఎడారీకరణపై పోరులో భాగంగా ఐరాస ఆధ్వర్యంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ‘కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌’ 14వ సదస్సు గ్రేటర్‌ నోయిడాలో ఈ నెల రెండున ప్రారంభమైంది. 13వ తేదీ వరకు జరిగే ఈ సదస్సుకు 196 దేశాల నుంచి మూడు వేలకుపైగా అధికారులు, 100 దేశాల మంత్రులతోసహా మొత్తం ఏడువేలకు పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ ద్వైవార్షిక సదస్సుకు భారత్‌ మొదటిసారిగా ఆతిథ్యం ఇస్తోంది. 30 కీలక లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి కార్యాచరణను సదస్సులో ప్రకటిస్తారు.

వాతావరణ మార్పులు, జీవావరణ వ్యవస్థ వైఫల్యాల కారణంగా 2050 నాటికి 70 కోట్ల మంది వలసల బారినపడే అవకాశం ఉందని; భూక్షీణత, కరవులను ఎదుర్కొంటున్న 130 కోట్ల మందిని వాటినుంచి బయటపడేయడం తక్షణ కర్తవ్యమని యూఎన్‌సీసీడీ చాటుతోంది. శతాబ్ద కాలంలో విశ్వవ్యాప్తంగా వ్యాధులతో మరణించినవారి కంటే కరవుల కారణంగానే ఎక్కువమంది మృత్యువాత పడ్డారని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల హెక్టార్ల భూమి సారాన్ని కోల్పోయిందని, ఇది చైనా భూభాగం కంటే రెండింతలు ఎక్కువని యూఎన్‌సీసీడీ కార్యనిర్వాహక కార్యదర్శి ఇబ్రహీం థియావ్‌ వాపోయారు.

ప్రపంచ భూవిస్తీర్ణంలో కేవలం ఒక శాతం భూభాగంపై పట్టణాలు విస్తరించి ఉన్నాయి. సగానికి పైగా జనాభా మాత్రం అక్కడే నివసిస్తోంది. శరవేగంతో విస్తరిస్తున్న పట్టణీకరణ ప్రభావం వల్ల 2000-2030 మధ్యకాలంలో ఏటా 16 నుంచి 33 లక్షల హెక్టార్ల సాగు భూమిని కోల్పోతున్నట్లు అంచనా. ప్రపంచంలోని దాదాపు 44 శాతం సాగుభూమి ఆసియా, ఆఫ్రికాల్లోని పొడినేలల్లోనే ఉండగా, ప్రపంచానికి కావాల్సిన 60 శాతం ఆహారోత్పత్తి ఇక్కడి నుంచే సరఫరా అవుతోంది. భూమి సారం కోల్పోవడం ఆహారోత్పత్తిపైనే కాకుండా తాగునీటిపైనా ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే ప్రపంచంలోని సగం జనాభా ఏడాదిలో ఒక నెల తీవ్ర నీటి ఎద్దడి ఒత్తిడిని ఎదుర్కొంటోందని, 2050 నాటికి 500 కోట్ల జనాభాపై (అప్పటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరవచ్చని అంచనా) ప్రభావం చూపనుందని అంతర్జాతీయ సంస్థలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. ఒక్క ఆసియాలోనే 73 శాతం ప్రజలు నీటి ఎద్దడికి గురికానున్నారని నివేదికలు చాటుతున్నాయి. అంతేకాకుండా 2000-2009 మధ్యకాలంలో భూసార క్షీణత కారణంగా 360-440 కోట్ల టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదలైందని వివిధ నివేదికలు స్పష్టీకరించాయి. భూసార క్షీణత  పర్యావరణ సమస్య మాత్రమే కాదు, అనేక దేశాల సామాజిక, ఆర్థిక స్థితిగతులకు అది శరాఘాతంగా పరిణమిస్తుందని యూఎన్‌సీసీడీ హెచ్చరించింది.

భారతదేశం మొత్తం భూభాగంలో దాదాపు 29 శాతం భూమి సారాన్ని కోల్పోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ‘ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’ ప్రకారం ప్రస్తుతం దేశంలో అడవుల విస్తీర్ణం 24 శాతంగా ఉంది. దాన్ని 2022 నాటికి 33 శాతానికి పెంచే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించారు. ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదన్నది నిష్ఠుర సత్యం. 2030 లోగా 50 లక్షల హెక్టార్ల బీడు భూమిని పునరుద్ధరించి సారవంతం చేసేందుకు భారత్‌ కృషి చేస్తోందని సదస్సులో కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు. దీనికోసం డెహ్రాడూన్‌లోని అటవీ పరిశోధన సంస్థలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలా వంద దేశాలు తమ లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. కరవు కోరల్లో చిక్కుకున్న మరో 70 దేశాలు ఈ సదస్సులో తమ కార్యాచరణ ప్రకటించనున్నాయి. సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా అన్ని దేశాలు భూ క్షీణత తటస్థీకరణ(ల్యాండ్‌ డీగ్రెడేషన్‌ న్యూట్రాలిటీ)తో పాటు భూమిని తిరిగి సారవంతం చేసుకోవాలి. వాటిని సాగులోకి తీసుకురావాలి. తద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందింపజేసుకోవాలి. ఈ పరిణామాలు ఆయా దేశాల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని యూఎన్‌సీసీడీ సూచించింది. సదస్సులో కీలకోపన్యాసం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, వాతావరణ మార్పులు భూసార క్షీణతకు కారణమవుతున్నాయన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడంకోసం పంట దిగుబడి పెంచేందుకు సూక్ష్మసేద్యంలో భాగంగా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి రాబట్టడానికి వివిధ కార్యక్రమాలను రూపొందిస్తున్నామన్నారు. పెట్టుబడి అవసరం లేని ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారిస్తున్నామన్నారు. భూసార పరిరక్షణకు ఈ పద్ధతులు దోహదపడతాయని ప్రధాని స్పష్టీకరించారు. నీటి ప్రవాహాలను నియంత్రించడం ద్వారా భూగర్భ జలాలను వృద్ధి చేసుకోవచ్చు. ఆ మేరకు నేలలో తేమను నిలుపుకోవడంతో పాటు నీటిని పొదుపుగా వినియోగిస్తే తాగునీటి సమస్యలనూ అధిగమించవచ్చు!

- అనిల్‌ కుమార్‌ లోడి

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు