close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమ్మల విహారమిది!

పిల్లాజెల్లా ఎవ్వరూ వెంట ఉండరు... అమ్మలు మాత్రమే విహారానికి వెళ్తారు... సముద్రం దగ్గర చిన్నారుల్లా ఆడుకుంటారు... ఇసుక తిన్నెలపై ఎగిరి గంతేస్తారు... నచ్చింది తింటారు... కావాల్సినంత ఎంజాయ్‌ చేస్తారు... ఇప్పుడిదో ట్రెండ్‌ తెలుసా... దీని పేరు మామ్‌కేషన్‌. ఆ సంగతులేంటంటే...

ప్రపంచంలో బిజీబిజీగా గడిపే వ్యక్తుల్లో అమ్మ ఒకరు. ఇంటిపనులు చేయాలి... భర్తకు కావాల్సినవన్నీ సమకూర్చాలి. పిల్లల్ని బడికి పంపాలి. ఇక్కడితో అయిపోతుందా... మళ్లీ తనూ ఉద్యోగానికి వెళ్లాలి. ఈ హడావుడిలో తనకంటూ సమయం ఉండదు. అందుకే ఈ మామ్‌కేషన్‌. అంటే అమ్మలందరూ కలిసి బృందంగా విశ్రాంతి కోసం విహారయాత్రలకువెళ్లడమన్నమాట. అలాంటి బృందమే సోలో ఉమెన్‌ ట్రిప్‌. దీన్ని ముంబయికి చెందిన రూపా భాటియా ప్రారంభించారు. ఆమెకు కొత్త ప్రదేశాలు చూడటమంటే ఎంతో ఇష్టం. కానీ ఒంటరిగా వెళ్లలేదు. ఉద్యోగమని, చదువులని కుటుంబ సభ్యులు, పిల్లలూ వెంటరాలేదు. అప్పుడే ఇలాంటి అమ్మల కోసం ఓ గ్రూప్‌ ఉండాలని 2016లో ఫేస్‌బుక్‌లో సోలో ఉమెన్‌ ట్రిప్‌ పేజీని ప్రారంభించారు. తనలాంటి మరెందరో తల్లులు అందులో చేరారు. వీళ్లంతా ఇప్పటి వరకు దేశంలో ఎన్నో ప్రదేశాలను చుట్టొచ్చారు. ఈ సంస్కృతి ఎక్కువగా దిల్లీ, ముంబయి వంటి నగరాల్లో ఉంది. ఇప్పుడిప్పుడే హైదరాబాద్‌, బెంగళూరు వంటి ప్రదేశాలకూ విస్తరిస్తోంది.

మామ్‌కేషన్‌తో బోలెడు లాభాలున్నాయండోయ్‌... అమ్మలకు మానసిక విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. కుటుంబ సభ్యులకు ఆమె విలువేంటో తెలుస్తుంది. ఆర్థికస్థోమత లేనివారు దగ్గర్లో ఉండే ప్రదేశాలకూ వెళ్లొచ్ఛు మీరూ ప్రయత్నించండి మరి.


మరిన్ని